ఒక్కరోజులో 14,669 కేసులు.. ఏపీలో కరోనా కాటు.. పరీక్షలతో చేటు..
posted on Apr 28, 2021 @ 6:04PM
ఒక్కరోజులో 14,669 కేసులు. 2, 4, 6, 8, 10, 14.. రోజురోజుకీ ఏపీలో కరోనా కేసులు వేలల్లో నమోదవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. వైరస్‌బారిన పడుతోన్న బాధితుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. మృతుల సంఖ్య సైతం భారీగా ఉండటం బెంబేలెత్తిస్తోంది. గడిచిన 24 గంటల్లో ఏపీ వ్యాప్తంగా 74,681 పరీక్షలు నిర్వహించారు. ఏకంగా 14,669 మందికి పాజిటివ్ వచ్చింది. ఒక్కరోజులోనే సుమారు 15వేల మందికి కరోనా సోకడం మామూలు విషయమేమీ కాదు. ఆంధ్రప్రదేశ్ మరో మహారాష్ట్రగా మారబోతోందా అనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఢిల్లీ తరహాలో కేసులు పెరుగుతుండటం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది.
కరోనాతో బాధపడుతూ ఏపీలో ఒక్క రోజులోనే 71 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకూ మొత్తం 1,62,17,831 కరోనా పరీక్షలు నిర్వహిస్తే.. 10,69,544 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.
కరోనా కేసుల్లో దూసుకుపోతున్న ఏపీ.. కొవిడ్ కట్టడి చర్యల్లో మాత్రం చాలా వెనకబడి ఉంది. మందుల కొరత, ఆసుపత్రిలో బెడ్స్ కొరత, ఆక్సిజన్ కొరత, స్మశానంలో శవదహనానికి ఇక్కట్లు.. ఇలా అనేక సమస్యలు. వీటన్నిటికీ సీఎం జగన్‌రెడ్డి చేతగాని తనమే కారణమని టీడీపీ విమర్శ. అసమర్థ ముఖ్యమంత్రి వల్లే రాష్ట్రం కరోనా కేంద్రంగా మారిందంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబు విమర్శించారు.
ఏపీ కరోనాతో అల్లాడిపోతుంటే.. సీఎం జగన్‌రెడ్డి మాత్రం విద్యార్థుల భవిష్యత్తు కోసమే పది, ఇంటర్ పరీక్షలంటూ వారిని మరింత ప్రమాదంలో నెట్టేస్తున్నారు. పరీక్షల నిర్వహణ రాష్ట్ర పరిధిలోని అంశమంటూ లాజిక్కులు చెబుతున్నారు. కేంద్ర బోర్డులతో పాటు, అనేక రాష్ట్రాలు పది పరీక్షలను రద్దు, వాయిదా వేస్తున్నా.. జగన్ మాత్రం ఎగ్జామ్స్ పెట్టి తీరుతామంటూ మొండి కేస్తున్నారు. రోజుకు దాదాపు 15వేల పాజిటివ్ కేసులు వస్తున్న తరుణంలో అన్ని లక్షల మంది విద్యార్థులు హాజరయ్యే పరీక్షలు పెట్టడం ఎంత ప్రమాదకరమో జగన్‌రెడ్డికి అర్థం కావట్లేదా అంటూ తల్లిదండ్రులు నిలదీస్తున్నారు. ఇదేమి మూర్ఖపు నిర్ణయం, వితండ వాదం అంటూ చంద్రబాబు ప్రశ్నిస్తున్నారు. కేవలం పరీక్షా కేంద్రాల్లో జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందా? విద్యార్థుల రాకపోకల సమయంలో కరోనా సోకే అవకాశం ఉండదా? అనేది చంద్రబాబు అడుగుతున్నారు. టీడీపీ గగ్గోలు పెడుతున్నా.. పేరెంట్స్ ఎగ్జామ్స్ వద్దంటూ వేడుకుంటున్నా.. సర్కారులో పునరాలోచన లేదు. ఎగ్జామ్స్ విషయంలో జగన్ మొండివైఖరి వీడటం లేదు.