కరోనాను జయించిన కేసీఆర్
posted on Apr 28, 2021 @ 7:16PM
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా మహమ్మారిని జయించారు. కరోనా సోకడంతో తన ఫామ్ హౌజ్ లో క్వారంటైన్ లో ఉన్నారు కేసీఆర్. ప్రత్యేక వైద్య బృందం ఆయనను పర్యవేక్షిస్తోంది. సీఎం వ్యక్తిగత డాక్టర్ ఎంవీ రావు పర్యవేక్షణలో యశోద హాస్పిటల్ కు చెందిన డాక్టర్ల బృందం బుధవారం ఆయనకు మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించింది. రాపిడ్ యాంటిజెన్ టెస్టులో కేసీఆర్ కు కరోనా నెగిటివ్ వచ్చింది. ఆర్టీపీసీఆర్ రిజల్ట్ మాత్రం గురువారం రానుంది. యాంటిజెన్ టెస్టులో నెగిటివ్ రావడంతో కేసీఆర్ కరోనాను జయించారని వైద్యులు చెప్పారు. కేసీఆర్ కు నెగిటివ్ రావడంతో టీఆర్ఎస్ నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
సీఎం కేసీఆర్ కు ఈనెల 19న కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఆయనకు స్వల్పంగా కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్టులు నిర్వహించారు. ఈ పరీక్షల్లో కేసీఆర్‌కు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆయన తన ఫాంహాజ్ లోనే క్వారంటైన్ లో ఉన్నారు.మూడు రోజుల తర్వాత యశోదకు వచ్చి పరీక్షలు చేయించుకున్నారు. సీటీ స్కాన్ రిపోర్టు నార్మల్ గానే రావడంతో ఎలాంటి ఇబ్బంది లేదని డాక్టర్లు నిర్దారించారు. దీంతో మళ్లీ ఆయన ఫాంహౌజ్ కు వెళ్లిపోయారు. అక్కడే ప్రత్యేక డాక్టర్ల బృందం పర్యవేక్షణలో ఉన్నారు.
నాగార్జున సాగర్ ఉప ఎన్నిక కోసం ఈనెల 14న హాలియాలో నిర్వహించిన బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొన్నారు. ఆ సభలో వేదికపై ఉన్న పార్టీ అభ్యర్థి నోముల భగత్ సహా చాలా మంది నేతలకు కరోనా వచ్చింది. దీంతో నాగార్జున సాగర్ సభలోనే ముఖ్యమంత్రికి కరోనా సోకి ఉంటుందని భావించారు. కేసీఆర్ పాజిటివ్ వచ్చిన తర్వాత కేటీఆర్ , ఎంపీ సంతోష్ కు కూడా కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. కేసీఆర్ తో పాటు సంతోష్ ఫాంహౌజ్ లో క్వారంటైన్ లో ఉండగా.. కేటీఆర్ తన నివాసంలో ఐసోలేట్ అయ్యారు.