గోవాలో లాక్‌డౌన్.. ముచ్చటగా 3 రోజులు మాత్రమే..
posted on Apr 28, 2021 @ 3:42PM
దేశమంతా కరోనా కల్లోలం. గోవాలో మాత్రం జిల్ జిల్ జిగా. టూరిస్టుల హంగామా. అసలే ఎండాకాలం కావడం.. కొవిడ్‌తో భయం పెరగడంతో.. సిటీలో ఉండటం కన్నా.. గోవా అయితే బెస్ట్ అనుకుంటూ ఇప్పటికీ చాలా మంది జనాలు గోవా టూర్ వేస్తున్నారు. గతంలో మాదిరి కాకున్నా.. ప్రస్తుతం గోవాకు చెప్పుకోదగ్గ స్థాయిలో పర్యాటకులు వస్తున్నారు. సాగర తీరంలో సందడి చేస్తున్నారు.
అయితే, వైరస్‌కు గోవా, హైదరాబాద్, ఢిల్లీ అనే తేడా ఉండదుగా. అందుకే, అక్కడా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గోవాలో మంగళవారం 2,110 మందికి కరోనా సోకింది. 31 మంది చనిపోయారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 16,591.
గోవాలో రోజురోజుకూ కరోనా విజృంభిస్తుండటంతో.. అక్కడి ప్రభుత్వం గత్యంతరం లేని పరిస్థితుల్లో లాక్‌డౌన్ ప్రకటించింది. గురువారం నుంచి ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. ఏప్రిల్ 29వ తేదీ రాత్రి 7 నుంచి.. మే 3వ తేదీ ఉదయం వరకు లాక్‌డౌన్ అమల్లో ఉండనుంది. అంటే, ముచ్చటగా మూడు రోజులు మాత్రమే. అదేంటి, మరీ మూడు రోజుల లాక్‌డౌన్ ఏంటి అనుకుంటున్నారా. అది అంతే. ఎంతైనా గోవా కదా.
అత్యవసర సేవలు, పారిశ్రామిక కార్యకలాపాలకు మాత్రం అనుమతి ఉంటుంది. ప్రజా రవాణా, క్యాసినోలు, హోటళ్లు, పబ్బులు మూసివేయనున్నారు. అత్యవసర వస్తువుల రవాణా కోసం మాత్రం రాష్ట్ర సరిహద్దులు తెరిచే ఉంటాయి.
సో.. సమ్మర్‌లో గోవా వెళ్లాలనుకునే వాళ్లు.. ఓ మూడు రోజులు ఆగి టూర్ ప్లాన్ చేసుకోవచ్చు. వెళ్లాక చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రస్తుత సెకెండ్ వేవ్ హర్రర్‌లో అసలు గోవాకు వెళ్లకపోవడం ఇంకా బెటర్. బుద్ధిగా ఇంట్లో కూర్చొని.. కొవిడ్ నుంచి కాపాడుకోండి. బాగుంటే మరోసారి గోవా వెళ్లొచ్చు కానీ, ఇప్పుడు మాత్రం వద్దు అంటున్నారు వైద్యులు.