లాక్ డౌన్ దిశగా తెలంగాణ!
posted on Apr 28, 2021 @ 7:16PM
మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటక తరహాలోనే తెలంగాణలో సంపూర్ణ లాక్ డౌన్ పెట్టబోతున్నారా? అంటే ప్రభుత్వ వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. రాష్ట్రంలో కొవిడ్ మహమ్మారి తీవ్రత రోజురోజుకు పెరిగిపోతుండటంతో లాక్ డౌన్ విధించక తప్పని పరిస్థితులు నెలకొన్నాయని చెబుతున్నారు. బుధవారం హోంశాఖ మంత్రి మహా ముద్ అలీ ఆధ్వర్యంలో లకిడికపూల్ లో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం జరిగింది. హోమ్ సెక్రెటరీ , డీజీపీతో పాటు పలువురు కమిషనర్లు హాజరయ్యారు. లాక్ డౌన్ పైనే ఈ సమావేశంలో చర్చ జరిగిందని తెలుస్తోంది. ఈనెల 30 వరకు రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ అమలులో ఉంది. ఆ తర్వాత ఏ క్షణమైనా తెలంగాణలో లాక్ డౌన్ పెట్టే అవకాశాలు ఉన్నాయని అధికారిక వర్గాల సమాచారం.
లాక్ డౌన్ పై రాష్ట్ర వైద్యా ఆరోగ్యశాఖ ప్రభుత్వ నికి నివేదిక సమర్పించిందని చెబుతున్నారు. ఆ నివేదిక హోంశాఖకు చేరడంతో దానిపైనే ఉన్నతాధికారులతో హోంశాఖ మంత్రి చర్చించారని తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం కూడా కేసుల సంఖ్య పెరిగితే లాక్ డౌన్ విధించుకోవచ్చు అని రాష్ట్రాలకు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో హోంమంత్రి సమీక్షకు ప్రాధాన్యత ఏర్పడింది.
కరోనా కట్టడి కోసం కర్ఫ్యూ విధించినప్పటికీ అనుకున్న ఫలితాలు రాకపోవడంతో ప్రభుత్వం దశల వారీగా లాక్‌డౌన్ విధించేదిశగా ఆలోచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా గ్రేటర్ పరిధిలోని నిరాశ్రయులు, బిచ్చగాళ్లను నైట్ షెల్టర్లకు తరలించే ప్రక్రియను జీహెచ్ఎంసీ చేపట్టింది.గ్రేటర్‌లో లాక్‌డౌన్ విధించేందుకు ప్రభుత్వం ఎప్పుడు నిర్ణయం తీసుకున్నా సిద్దంగా ఉండేలా జీహెచ్ఎంసీ ముందస్తు చర్యలు తీసుకుంటోంది.
పూర్తిగా లాక్డౌన్విధిస్తే నిరాశ్రయులు, బిక్షగాళ్లపై ఎక్కువ ప్రభావం పడుతున్నట్టు గత అనుభవాలు స్పష్టం చేస్తున్నాయి.రోజంతా అన్ని బంద్ ఉంటే రోడ్ల పక్కన ఉండేవారికి, నిరాశ్రయులకు ఆహారం, ఇతర అవసరాలకు ఇబ్బందులు ఎదురు కానున్నాయి. వీటిని నివారించడంలో భాగంగా ముందుగానే వారందరిని బల్దియా నైట్షెల్టర్లకు తరలించే ప్రక్రియను చేపట్టారు. మే నెల మొదటి వారంలోనే లాక్డౌన్విధించే పరిస్థితులు ఉండటంతో ఆ లోపే వీలైనంత ఎక్కువ మందిని తమ పర్యవేక్షణలో ఉంచేలా జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు చేపడుతున్నారని అంటున్నారు.