కర్ణాటకలో కమలానికి షాక్.. బళ్లారిలో గాలికి భంగపాటు
కర్ణాటకలో అధికార బీజేపీకి భారీ షాక్ తగిలింది. గత నెల 27న కార్పొరేషన్లు, నగరసభ, పట్టణ పంచాయతీ, పురసభకు జరిగిన ఎన్నికల్లో అధికార బీజేపీకి ఘోర పరాభవం ఎదురైంది. 10 స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగ్గా కాంగ్రెస్ ఏడు చోట, రెండు చోట్ల జేడీఎస్ గెలవగా.. అధికారంలో ఉన్న బీజేపీ మాత్రం ఒకే ఒక్క స్థానంలో గెలిచి పరువు పోగొట్టుకుంది. సీఎం యడియూరప్ప సొంత జిల్లా శివమొగ్గలో కూడా బీజేపీ ఘోరంగా ఓడింది. 8 జిల్లాల్లోని 10 స్థానిక సంస్థల్లో 263 వార్డులకు ఎన్నికలు జరగ్గా కాంగ్రెస్ 120 స్థానాల్లో జయభేరి మోగించింది. ఆశ్చర్యకరంగా బీజేపీ కంటే జేడీఎస్ మెరుగైన ఫలితాలు రాబట్టింది. బీజేపీ 57 స్థానాలకే పరిమితం కాగా, జేడీఎస్ 66 స్థానాల్లో విజయం సాధించింది.
బీజేపీకి కంచుకోటగా చెప్పుకునే బళ్లారి కార్పొరేషన్ కాంగ్రెస్ కైవసం చేసుకుంది. బళ్లారిలో గాలి సోదరులకు దిమ్మతిరిగే షాక్ తగిలింది. బళ్లారి మహానగర పాలికె (కార్పొరేషన్)లో మొత్తం 39 వార్డులు ఉండగా.. 20 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు, ఐదుగురు కాంగ్రెస్ రెబెల్స్ గెలవగా బీజేపీ 13 స్థానాల్లో విజయం సాధించింది. 18వ వార్డులో బీజేపీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్ రెడ్డి కుమారుడు శ్రవణ్ కుమార్ ఓడిపోయారు. బీదర్‌లో హంగ్ ఏర్పడింది. అయితే 15 స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించింది. బీజేపీ 8, జేడీఎస్ 7, ఎంఐఎం 2, ఆప్ ఒక స్థానంలో విజయం సాధించింది.
రామనగరలో బీజేపీకి ఘోర పరాభవం ఎదురైంది. ఇక్కడ ఆ పార్టీ ఖాతానే తెరవలేదు. ఇక్కడ 31 స్థానాలకు గాను కాంగ్రెస్ 19, జేడీఎస్ 11, స్వతంత్ర అభ్యర్థి ఒక స్థానంలో విజయం సాధించారు. బీజేపీ ఇక్కడ ఖాతా కూడా తెరవలేదు. రామనగర జిల్లా చెన్నపట్టణ నగర సభ ఎన్నికల్లో 31 వార్డులకు గాను జేడీఎస్ 16 చోట్ల విజయం సాధించగా, కాంగ్రెస్ ఏడు, బీజేపీ ఏడు స్థానాల్లో గెలుపొందాయి. ఒక స్థానంలో ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపొందాడు. హసన్ జిల్లాలోని బేలూరు పురసభలోనూ బీజేపీ భారీ షాక్ తగిలింది. ఇక్కడ మొత్తం 23 స్థానాలుండగా కాంగ్రెస్ 17, జేడీఎస్ 5 స్థానాలను కైవసం చేసుకున్నాయి. బీజేపీకి ఒక్క స్థానం దక్కింది.
ఇక ముఖ్యమంత్రి యడియూరప్ప సొంత జిల్లాలోనూ బీజేపీకి ఎదురుగాలి వీచింది. ఇక్కడ మొత్తం 35 స్థానాలుండగా కాంగ్రెస్ 18, జేడీఎస్ 11, బీజేపీ 4 స్థానాల్లో గెలుపొందాయి. శివమొగ్గ జిల్లా తీర్థహళ్లిలో 15 వార్డులకు కాంగ్రెస్ 9, బీజేపీ 6 స్థానాల్లో విజయం సాధించగా, చిక్కబళ్లాపుర జిల్లా గుడిబండ పట్టణ పంచాయతీకి జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఖాతా తెరవలేదు. 11 స్థానాలకు గాను కాంగ్రెస్ 6, జేడీఎస్ 2, ఇతరులు మూడు స్థానాల్లో గెలుపొందారు.
బెంగళూరు రూరల్ జిల్లా విజయపురలోనూ బీజేపీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇక్కడ 23 వార్డులకు గాను జేడీఎస్ 14, కాంగ్రెస్ 6, ఇతరులు 2 చోట్ల విజయం సాధించగా, బీజేపీ ఒకే ఒక్క స్థానానికి పరిమితమైంది. మడికెరె నగరసభను మాత్రం బీజేపీ కైవసం చేసుకుంది. ఇక్కడ 23 స్థానాలకు ఎన్నికలు జరగ్గా బీజేపీ 16, ఎస్‌డీపీఐ 5, కాంగ్రెస్, జేడీఎస్‌లు ఒక్కో స్థానంలో విజయం సాధించాయి.