ఓటేయకు.. కరోనాకు బలికాకు!
posted on Apr 28, 2021 @ 5:24PM
తెలంగాణలో కరోనా విజృంభిస్తున్న వేళ జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. ఏప్రిల్ 30న వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతో పాటు సిద్దిపేట, జడ్చర్ల, కొత్తూరు, అచ్చంపేట, నకిరేకల్ మున్సిపాలిటీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. కరోనా పంజా విసురుతుండటంతో పోలింగ్ ఎలా జరుగుతుందన్న ఆందోళన నెలకొంది. ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు ఉద్యోగులు జంకుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఓటేందుకు జనాలు బయటికి వస్తారా లేదా అన్న చర్చ జరుగుతోంది. కరోనా భయంతో వణికిపోతున్న జనాలు పోలింగ్ కేంద్రాలకు రావడం కష్టమేనని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు.
కరోనా సమయంలో ఎన్నికలు నిర్వహించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. సామాజిక కార్యకర్తలు సర్కార్ తీరుపై మండిపడుతున్నారు. వరంగల్ ఎంజీఎం ప్రాంగణంలో కోట శ్యాంకుమార్ అనే వ్యక్తి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఓటేయ్యడానికి పోకు- కరోనాతో ఖతమై పోకు అంటూ డాక్టర్ వేషాధారణలో ప్లకార్డులు చేతబూని నిరసన వ్యక్తం చేశారు. కరోనా అత్యంత ప్రమాదకరంగా విజృంభిస్తున్న వేళ మిని మునిసిపల్ ఎన్నికలను నిర్వహించడంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు.
ప్రజల ఆరోగ్యం, ప్రాణాలపై ఈ ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి ఎంతమాత్రం పట్టింపులేదని ఆవేదన వ్యక్తం చేశారు శ్యాంకుమార్. బాధ్యతలేని ప్రభుత్వాలకు 10 లక్షల మంది చనిపోయినా, ఎంతమాత్రం ఏం కానట్లుగా ఉంటున్నాయి.. కానీ మీ కుటుంబానికి మీరే పెద్ద దిక్కు.. మీ ప్రాణాలు మీ కుటుంబ సభ్యులకు ఎంతో వేదనను మిగుల్చుతాయి.. ఓటింగ్‌లో పాల్గొని కరోనాను అంటించుకోకండి. బాధ్యతలేని ప్రభుత్వాలకు ఓటింగ్‌లో పాల్గొనకుండా నిరసన వ్యక్తం చేయండి అంటూ పిలుపునిస్తున్నారు కోట శ్యాంకుమార్.