సంగం డెయిరీపై 20 ఏళ్ల కుట్ర.. జీవోపై హైకోర్టులో పిటిషన్..
posted on Apr 28, 2021 @ 2:01PM
సంగం డెయిరీపై 20 ఏళ్ల కిందటే కుట్రలు జరిగాయని అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అప్పట్లో సుప్రీంకోర్టుకు కూడా వెళ్లాడని గుర్తు చేశారు. ప్రస్తుత వ్యవహారంపై స్పందిస్తూ.. ధూళిపాళ్ల నరేంద్ర చైర్మన్ కాకముందే భూ బదలాయింపు జరిగిందని చంద్రబాబు స్పష్టం చేశారు. అమూల్ కోసం సంగం డెయిరీని నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. కోర్టులో పెండింగ్ లో ఉన్న అంశంపై అరెస్ట్ ఎలా చేస్తారని ప్రశ్నించారు. పాడి రైతులకు చెడు చేయడం తగదని హితవు పలికారు.
నాడు యడ్లపాటి వెంకట్రావు సంగం డెయిరీని ప్రారంభించారని, ఆ తర్వాత సంగం డెయిరీని ధూళిపాళ్ల వీరయ్య ఎంతో అభివృద్ధి చేశారని.. నరేంద్ర హయాంలో ఓ వెలుగు వెలిగిందని.. చంద్రబాబు వెల్లడించారు.
మరోవైపు.. డెయిరీ యాజమాన్య హక్కులను బదలాయిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను వ్యతిరేకిస్తూ సంగం డెయిరీ డైరెక్టర్లు హైకోర్టును ఆశ్రయించారు. డెయిరీ స్వాధీనానికి ప్రభుత్వం ఇచ్చిన జీవో నెం.19ను రద్దు చేయాలని లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఉత్తర్వులు జారీ చేశారని సంగం డెయిరీ డైరెక్టర్లు ఆరోపించారు.
అటు, తనపై ఏసీబీ కేసు నమోదు చేయడాన్ని సవాల్ చేస్తూ టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేయగా, విచారణ జరిపిన హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది.