3 లక్షల కోట్లు.. 3 లక్షల దొంగ ఓట్లు.. 3 లక్షల్లోపు మెజార్టీ.. ఇదేమి గెలుపు?
తిరుపతిలో 2,71,592 ఓట్లతో వైసీపీ విజయకేతనం. గతంలో కంటే ఇంకొంచెం మెజారిటీ. ఎలాగోలా అధికార పార్టీ మళ్లీ గెలిచింది. తిరుపతి మరోసారి వైసీపీ ఖాతాలో చేరింది. ఈ విజయం అంత సునాయాసంగా రాలేదు. ఈ గెలుపు అసలు గెలుపే కాదు. ఖజానా ఖాళీ చేసి.. జనాన్ని బెదిరించి.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి.. దొంగ ఓట్లు గుప్పించి.. గురుమూర్తిని గెలిపించారు. తిరుపతిలో గెలిచి.. ఓడిపోయారు.
నవ రత్నాల పేరుతో చిల్లి గవ్వ కూడా లేకుండా ఖజానా ఖాళీ చేశారు. ప్రస్తుతం ఏపీలో అమలవుతున్న సంక్షేమ పథకాల కోసం సుమారు 3 లక్షల కోట్లు ఖర్చు చేస్తోంది జగన్‌రెడ్డి ప్రభుత్వం. చేతికి ఎముకే లేనట్టు.. కులాల వారీగా, వర్గాల వారీగా, వయసుల వారీగా, వృత్తుల వారీగా.. సంక్షేమం పేరుతో జనానికి బిస్కెట్లు విసురుతూనే ఉన్నారు. ఏపీలో ప్రతీ ఇంటికీ, ప్రతీ మనిషికి ఏదో ఒక రూపంలో.. ఏదో ఒక పథకం పేరుతో డబ్బులు అందుతూనే ఉన్నాయి. ఇవి చాలవన్నట్టు.. ఎన్నికల సమయంలో అధికార పార్టీ పంచే ఓటుకు నోట్లు, మందు, బిర్యానీ ప్యాకెట్లు అదనం. ఇంత చేస్తే.. అంతా కలిపి.. ముచ్చటగా మూడు లక్షల మెజారిటీ కూడా రాకపోవడం అధికార పార్టీపై ప్రజల్లో వ్యక్తమవుతున్న వ్యతిరేకతకు నిదర్శనం.
తిరుపతి ఎంపీ నియోజకవర్గంలో మొత్తం 17 లక్షల ఓట్లు ఉన్నాయి. ఇందులో 11 లక్షల వరకూ ఓట్లు పోలయ్యాయి. పోలైన ఓట్లకు వైసీపీకి వచ్చింది 6,26,108 ఓట్లు. అంటే దాదాపు 45శాతం ఓటర్లు అధికార పార్టీని వ్యతిరేకించారు. అంతేకాదు వైసీపీకి పోలైన ఓట్లన్నీ ఆ పార్టీ మీద అభిమానంతో వేసినవి కానే కాదు. ఫ్యాన్ గుర్తుకు ఓటేయకపోతే.. ప్రభుత్వ పథకాలు ఆపేస్తామంటూ బెదిరింపులు.. అక్రమ కేసులతో కుట్రలు.. ఇవి చాలవన్నట్టు.. దొంగ ఓట్ల దారుణం. వినిపిస్తున్న ఆరోపణల ప్రకారం.. తిరుపతి పరిధిలో ఏకంగా 3 లక్షల వరకూ దొంగ ఓటరు కార్డులు తయారు చేసినట్టు తెలుస్తోంది. ఇందులో.. పోలింగ్ నాడు దాదాపు రెండు లక్షల వరకూ దొంగ ఓట్లు వేయించుకున్నట్టు సమాచారం. ఇలా లెక్కేసి చూస్తే.. వైసీపీకి వచ్చిన 6 లక్షల ఓట్ల నుంచి 2 లక్షల దొంగ ఓట్లను మైనస్ చేయాల్సి ఉంటుంది. అంటే, అధికార పార్టీ మెజార్టీ మొత్తం మాయమైపోతుంది. 3 లక్షల కోట్ల విలువైన సంక్షేమ పథకాలు అమలు చేసి.. 3 లక్షల దొంగ ఓటరు కార్డులు సృష్టించి.. ఇంటింటికీ 3 వేల వరకూ డబ్బులు పంచి.. 3 లక్షల లోపు మెజార్టీతో బయటపడటం అధికార పార్టీకి అవమానకరంగా మారింది. ప్రజల్లో ఆ పార్టీకి ఉన్న వ్యతిరేకత స్పష్టం అవుతోంది.
అదే తిరుపతి ఎన్నికల్లో ప్రతిపక్ష టీడీపీకి 3,54,516 ఓట్లు వచ్చాయి. టీడీపీ అధికారంలో లేదు. టీడీపీ బెదిరింపులకు దిగలేదు. టీడీపీ సంక్షేమ పథకాలతో కోట్లు కుమ్మరించలేదు. టీడీపీ దొంగ ఓట్లు వేయించలేదు. టీడీపీ ఓటర్లను భయబ్రాంతులకు గురి చేయలేదు. అయినా.. మూడున్నర లక్షలకు పైగా ఓటర్లు టీడీపీని నమ్మారు. తిరుపతిలో టీడీపీ గెలిస్తే రాష్ట్రంలో ప్రభుత్వమేమీ మారిపోదు. అయినా, జగన్‌రెడ్డిపై తమకున్న అసంతృప్తిని చాటేందుకే.. టీడీపీకి అన్ని లక్షల మంది ఓటేశారని అంటున్నారు.
ఒకటా, రెండా.. జగన్‌రెడ్డి పాలనలో అనేక అక్రమాలు. లక్షలాది పేదలకు కడుపు నిండా అన్నం పెట్టిన.. అన్నా క్యాంటీన్లను అడ్డంగా మూసేశారు. పేదల కడపు కొట్టారు. ఇసుక నుంచి కాసులు పిండుకుంటున్నారు. సరైన ఇసుక విధానం లేక నెలల తరబడి ఏపీలో నిర్మాణాలు ఆగిపోయాయి. ఇసుక దొరక్క రోజువారీ కూలీలు రోడ్డున పడ్డారు. ఇప్పటికీ ఏపీలో ఇసుక ఖరీదైన వ్యాపార వస్తువే. ఇలా అన్ని వర్గాల ప్రజలను ఏదో ఒక రూపంలో దెబ్బ కొట్టింది జగన్‌రెడ్డి సర్కారు. ఆఖరికి మందు బాబులు సైతం సీఎం జగన్‌పై ఓ రేంజ్‌లో మండిపడుతున్నారు. ఊరూ,పేరూ లేని బ్రాండులు తీసుకొచ్చి.. డబుల్, త్రిబుల్ రేట్లు పెట్టి.. మందుబాబులను అడ్డంగా దోచుకుంటున్నారు. టీడీపీ ఆరోపిస్తున్నట్టు.. ఒక చేత్తో వంద రూపాయలు ఇచ్చి.. మరో చేత్తో వెయ్యి రూపాయలు లాగేస్తోంది జగన్‌రెడ్డి ప్రభుత్వం. అందుకే, వైసీపీ పాలనపై అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది.
అయితే, ప్రభుత్వ వ్యతిరేకత వేరు.. ఎన్నికల్లో గెలుపు వేరు. తాయిళాలతోనో, బెదిరింపులతోనో, ఏకగ్రీవాలతోనో, దొంగ ఓట్లతోనే.. ఎలాగోలా దారుణాలతో, దౌర్జన్యాలతో.. వరుస ఎన్నికల్లో గెలుస్తూ వస్తోంది వైసీపీ. తిరుపతిలోనూ అదే జరిగింది. టెక్నికల్‌గా గెలిచి.. నైతికంగా ఓడిపోయింది. ప్రజాక్షేత్రంలో దోషిగా నిలబడింది. పరిస్థితి చూస్తుంటే.. ముందుముందు భవిష్యత్తు అంతా టీడీపీదే అనిపిస్తోంది. ప్రజానాడి అలా ఉంది మరి. అధికార పార్టీపై వెల్లువెత్తుతున్న వ్యతిరేకత.. తెలుగుదేశానికి పెరుగుతున్న ప్రజాదరణ.. తిరుపతి ఫలితాల్లో అంతర్లీనంగా స్పష్టం అవుతోంది.