కూతురి ప్రియుడ్ని.. నరికిన తండ్రి..
posted on Apr 28, 2021 @ 2:37PM
మనుషుల్లో మానవత్వం మచ్చుకైనా లేకుండా పోతుంది.. భవిష్యత్తు గురించి ఆలోచించకుండా.. పరువు కోసం పరువు హత్యలు చేస్తున్నారు.. పిల్లలు ప్రేమించుకుంటే పెళ్లి చేయాల్సిన తల్లి దండ్రులు.. ఆ పిల్లల పైన కత్తులతో దాడులు చేస్తున్నారు.. పిల్లల మరణాలకు కారకులు అవుతున్నారు.
అది గుంటూరు జిల్లా. పెదకాకాని మండలం. కొప్పురావూరు గ్రామం. అతని పేరు వెంకటేష్. అదే గ్రామానికి చెందిన భాస్కర్ రావు అనే వ్యక్తి కూతురు ఇంటర్మీడియట్ చదువుతుంది. భాస్కర్ రావు అమ్మాయికి , వెంకటేష్ కి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమ గా మారడానికి ఎంత కాలం పట్టలేదు. మనసులు ఇచ్చిపుచ్చుకున్నారు. ఆ తర్వాత కలిసి బతుకుదామనుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు వెంకటేశ్‌ను పిలిపించి గ్రామంలో పంచాయతీ పెట్టారు. అప్పటి నుంచి గ్రామానికి దూరంగా ఉన్నాడు వెంకటేశ్. అయినా ఆ యువతితో తరచూ ఫోన్‌లో సంభాషిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలుసుకున్నారు.
అమ్మాయి వాళ్ళ ఫాదర్ వెంకటేష్ ని గ్రామానికి పిలిపించాడు. తనతో మాట్లాడాలంటూ.. అర్ధరాత్రి గ్రామ శివారులోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు ఆ యువతి తండ్రి భాస్కర్ రావు, మరో ఐదుగురు కలిసి వెంకటేశ్‌పై మారణాయుధాలతో దాడి చేసి కాళ్లు, చేతులు నరికేశారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని యువకుడిని గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతడు మృతిచెందాడు. దాడికి పాల్పడ్డ ఆరుగురు పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శోభన్ బాబు తెలిపారు.