కరోనా హాట్ స్పాట్లుగా టెస్టింగ్ సెంటర్లు!
posted on Apr 28, 2021 @ 4:50PM
దేశంలో కరోనా విలయ తాండవం చేస్తోంది. రాష్ట్రంలోనూ పంజా విసురుతోంది. లక్షణాలు ఉన్నా లేకున్నా భయంతో జనాలు టెస్టుల కోసం పరుగులు పెడుతున్నారు. దీంతో ప్రైవేట్ ల్యాబులు, ప్రభుత్వ కరోనా టెస్టింగ్ సెంటర్ల దగ్గర రద్దీ కనిపిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో క్యూలైన్లలో భౌతిక దూరం కూడా పాటించడం లేదు. కరోనా సోకిన వారు.. సోకని వారు అంతా ఒకే దగ్గర గుమి గూడుతున్నారు. దీంతో టెస్టింగ్ సెంటర్లే ఇప్పుడు కరోనా హాట్ స్పాట్లుగా మారుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. సీటీ స్కాన్ కోసం జనాలు ఎగబడుతున్నారు. క్లోజ్డ్ రూమ్ లో చేసే సీటీ స్కాన్ సెంటర్ల ద్వారా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉందని వైద్యులు అంచనా వేస్తున్నారు.
వైద్య శాఖ అధికారులు కూడా ఇదే విషయం చెబుతున్నారు. కరోనాతో ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, లక్షణాలు లేకున్నా భయంతో పరీక్ష చేయించుకునేందుకు పరుగులు తీయొద్దని తెలంగాణ ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు సూచించారు. కొందరు లక్షణాలు లేకున్నా పరీక్షలు చేయించుకుంటుండటంతో లక్షణాలు ఉన్నవారు సకాలంలో పరీక్షలు చేయించుకోలేకపోతున్నారని అన్నారు. లక్షణాలు లేని వారు టెస్టింగ్ సెంటర్ల వద్దకు వెళ్లి వ్యాధి కొని తెచ్చుకోవద్దని కోరారు. కొవిడ్ లక్షణాలు కేవలం రెండు మూడు రోజులు ఉంటాయని..తగ్గకపోతేనే పరీక్షలు చేయించుకోవాలని చెప్పారు. ఆరోగ్యంగా ఉన్నా టెస్టింగ్ కోసం వెళుతూ కొందరు అనవసరంగా వైరస్ భారీన పడుతున్నారని శ్రీనివాసరావు తెలిపారు.
కరోనా విజృంభిస్తున్నందున రానున్న రెండు, మూడు వారాలు చాలా కీలకమని డాక్టర్ శ్రీనివాసరావు అభిప్రాయపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో పరిస్థితి కాస్త మెరుగ్గానే ఉందని చెప్పారు. మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో కరోనా వ్యాప్తి తక్కువగానే ఉందని అన్నారు. కరోనాపై ప్రజల్లో అవగాహన పెరిగిందని, రాష్ట్రంలో 90 శాతం మంది మాస్కులు ధరిస్తున్నారని పేర్కొన్నారు. తెలిపారు. వందేళ్లకు ఒకసారి ఇలాంటి విపత్తులు వస్తుంటాయని అన్నారు. కరోనా కట్టడికి చర్యలు తీసుకోవడంతో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ముందుందని చెప్పారు. వచ్చే నెల వివాహాలు, శుభకార్యాలు జరిగేందుకు అవకాశం ఉన్నందున ప్రజలు కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో వ్యాక్సినేషన్ వేగంగా కొనసాగుతుందని, ఇప్పటివరకు 45 లక్షల మంది పైగా వాక్సిన్ వేసినట్టు ఆయన తెలిపారు. విడతల వారిగా మిగితా వారికి సైతం వాక్సిన్ వేస్తామన్నారు డాక్టర్ శ్రీనివాసరావు.