అధీర్ వ్యాఖ్యలపై రాజకీయ దుమారం
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మొదలై శుక్రవారం (జులై 29) నాటికి పది రోజులు. కానీ, ఇంతవరకు ఒక్క రోజు కూడా పార్లమెంట్ ఉభయ సభలు సజావుగా సాగింది లేదు. ఏ రోజుకారోజు ఏదో ఒక వివాదంతో వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఇంతవరకు పార్లమెంట్ ఉభయ సభల నుంచి ఓ పాతిక మంది వరకు ఎంపీలు సస్పెండ్ అయ్యారు. నిజానికి, ఇలా పార్లమెంట్ సమావేశాల పేరిట ప్రజాధనం వృధా పద్దులో కొట్టుకు పోవడం,ఇదే మొదలు కాదు. ఇంతకు ముందు కూడా ప్రజా సమస్యలు చర్చకు రాకుండానే ప్రజాధనం వృధా అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇక ముందు కూడా ఉంటాయి. అందులో ఎలాంటి సందేహం అవసరం లేదు.
అయితే ప్రస్తుత సమావేశాలలో రెండు కీలక ఘట్టాలు చోటు చేసుకున్నాయి. ఇదే సమావేశాలలో గౌరవ సభ్యులు, స్వతంత్ర భారత చరిత్రలో తొలిసారిగా, ఓ గిరిజన మహిళ, ద్రౌపతి ముర్మును భారత రాష్టపతిగా ఎన్నుకున్నారు. ఒక గిరిజన దళిత మహిళను రాష్ట్రపతిగా ఎన్నుకుని గౌరవించిన సభలోనే, అదే గిరిజన దళిత మహిళకు అవమానం జరిగింది. లోక్ సభలో కాంగ్రెస్ పక్ష నేత అధిర్ రంజన్ చౌదరి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును ఉద్దేశించి, పొరపాటునే కావచ్చును, ‘రాష్ట్రపత్ని’ అని సంభోదించారు. నిజానికి, అధిర్ రంజన్ చౌదరి తప్పు తెలుసు కున్నారు. భారత రాష్ట్రపతిని అగౌరవ పరచాలని తాను ఎప్పుడూ అనుకోలేదని, పొరపటున నాలుక దొర్లిందే కానీ ఉద్దేశ పూర్వకంగా చేసిన వ్యాఖ్య కాదని విచారం వ్యక్త పరిచారు.
రాష్ట్రపతి ముర్ముకి క్షమాపణ చెప్పడానికి కూడా అంగీకరించారు. అయితే చౌదరి క్షమాపణ చెపితే సరిపోదని, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా క్షమాపణలు చెప్పాలని, మహిళా మంత్రులు నిర్మల సీతారామన్, స్మృతి ఇరానీ సహా బీజేపీ సభ్యులు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పక్ష నేత అధీర రంజన్ చౌదరి ఉద్దేశపూర్వకంగానే రాష్ట్రపతిని అవమానించారని, ఆయన వ్యాఖ్యలు రాష్ట్రపతి హోదాను కించపరిచేలా ఉన్నాయని, భారతీయ విలువలకు విరుద్ధమని కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, స్మృతీ ఇరానీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటులో సోనియా గాంధీకి, స్మృతీ ఇరానీకి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
సభ మరోరోజు వాయిదా పడింది. అదలా ఉంటే, అధీర రంజన్ చౌదరి రాష్ట్రపతిని ఉద్దేశించి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు పార్లమెంట్ లోపలే కాదు, వెలుపల కుడా దుమారం రేపుతున్నాయి. మధ్య ప్రదేశ్ లో బీజేపీ కార్యకర్తలు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. మరోవంక జాతీయ మహిళా కమిషన్ కూడా అధీర్ రంజన్ చౌదరికి నోటిసు ఇచ్చింది. వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని, లిఖిత పూర్వకంగా వివరణ ఇవ్వాలని కమిషన్ ఆదేశించింది.
నిజమే, అధీర్ రంజన్ చౌదరి రాష్ట్రపతిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు పొరపాటున చేసిన వ్యాఖ్యలే అయినా, సారీతో సరిపుచ్చుకునేంత చిన్న పొరపాటు కాదు. చాలా పెద్ద పొరపాటు. పొరపాటు కుడా కాదు. ఒక మహాపరాధం, అందులో సందేహం లేదు. అందుకే, ఆయన లోక్ సభ సభ్యత్వాని రద్దు చేయాలనే డిమాండ్ కుడా వినవస్తోది. నిజమే, పార్లమెంట్ సాక్షిగా జరిగిన పరాభవానికి, అయన పై కఠిన చర్యలు అవసరం. ఆ నిర్ణయం ఎవరు తీసుకుంటారు, కాంగ్రస్ పార్టీ తీసుకుంటుందా. లోక్ సభ స్పీకర్ తీసుకుంటారా? అనేది పక్కన పెడితే, ఆయనన లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేయడం సముచితంగా ఉంటుందనడంలో సందేహం లేదు.
అయితే, అదే అయితే, అయన వ్యాఖ్యలపై సభలో చర్చ, చోటుచేసుకున్న వాదోపవాదాలు, సభ ఔనత్యాన్ని, రాష్ట్రపతి గౌరవాన్ని కానీ, ఇనుమడించేలా ఉన్నాయా? మరింత అవమాన పరిచేలా ఉన్నాయా?అనేది కూడా ఆలోచించవలసి ఉంటుందని అంటున్నారు.