తెలంగాణలో బాబుకు బ్రహ్మరథం
posted on Jul 29, 2022 @ 10:15AM
తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు 2014 ఎన్నికల తరువాత తెలంగాణను అంతగా పట్టించుకున్న దాఖలాలు లేవు. 2019 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ తో జట్టు కట్టి తెలంగాణలో ప్రచారంలో పాల్గొన్నారు. అంతే ఆ తరువాత తెలంగాణలో పార్టీని నడిపే బాధ్యత దాదాపుగా ఆయన ఇక్కడి నాయకత్వానికే వదిలేశారు.
సరే తెలంగాణలో పార్టీ ఉనికి నామమాత్రంగా మారిపోయిందని అందరిలానే ఆయనా భావించారు. కానీ జనం మాత్రం తెలుగుదేశం పార్టీని మరిచిపోలేదు. ఇప్పటికీ గుండె నిండుగా ఆ పార్టీ ఉంది. ఆ పార్టీ అధినేతగా తెలంగాణ జనం హృదయాలలో చంద్రబాబు స్థానం పదిలంగా ఉందని తాజాగా రుజువైంది. 2019 ఎన్నికల సందర్భంగా ఆయన తెలంగాణలో పర్యటించిన ప్రతి చోటా జనం ఆయనకు నిరాజనాలు పలికారు. అదే విధంగా ఇప్పుడు ఇటీవలి వర్షాలు, వరదలకు నష్టపోయిన వారిని పరామర్శించేందుకు ఆయన పోలవరం ముంపు గ్రామాల పర్యటనకు వెళుతూ భద్రాద్రి జిల్లా బూర్గంపహాడ్ మండలంలో పర్యటించారు.
ఆ సందర్భంగా ఆయనకు జనం బ్రహ్మరథం పట్టారు. విద్యార్థులు రోడ్డుకు ఇరువైపులా నిలబడి స్వాగతం పలికారు. మహిళలు పూల వర్షం కురిపించారు. దీంతో చంద్రబాబు ఆగి వారితో మాట్లాడారు. రాష్ట్రం విడిపోయిన తరువాత చంద్రబాబు భద్రాచలం జిల్లా పర్యటనకు రావడం ఇదే తొలిసారి. అంటే దాదాపు ఎనిమిదేళ్ల తరువాత తొలిసారిగా ఆయన భద్రాచలం జిల్లాలో అడుగుపెట్టారు. ఒక రాజకీయ నాయుడు అంత కాలం దూరంగా ఉంటే జనం ఆ నేతను మరచిపోవడం సహజం. కానీ చంద్రబాబును జనం గుర్తు పెట్టుకున్నారు.
తమ ప్రాంతానికి వచ్చిన సందర్భంగా నీరాజనాలు పలికారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి నాయకులు లేరేమో కానీ.. క్యాడర్ మాత్రం చెక్కు చెదరకుండా అలాగే ఉందనడానికి చంద్రబాబుకు లభించిన ఘనస్వాగతమే నిదర్శనమని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు.