నాన్నా..ఇంకో ముక్క!
posted on Jul 29, 2022 @ 1:56PM
. . . నీకో ముద్ద .. నాకో ముద్ద .. అంటూ ఏదో ఒక కూనిరాగం తీస్తూనే తల్లి పిల్లకి తినిపిస్తుంటూంది. వయసు పెరిగేకొద్దీ ఈ పాట మాధుర్యం బంధాల్ని మరింత కట్టిపడేస్తుంటుంది. తరాలు మారతాయి, ఇలాంటి సందర్భాలు కొనసాగుతూనే ఉంటాయి. తెలీకుండానే ఒకరికోసం ఒకరు అన్న భావన బలపడుతుంది. పరిస్థితుల్లో మార్పు రావచ్చు.. తల్లిదండ్రలు, పిల్లల మధ్య మాత్రం ఏ కాలమూ, ఏ మార్పూ అంతగా ప్రభావం చూపదు. ఆడపిల్లలయితే తల్లినే తలపిస్తారు. తండ్రి ఎలాంటివాడయినా, తండ్రి ఏ స్థితిలో ఉన్నా.. తండ్రే. తనవి లాలించలేని పసి వయసు అయినా, ఒక్క ముద్ద పెట్టి ఆయన సమస్యను తెలుసుకునే వయసు, కాకున్నా కళ్లు తుడిచి చేతికందిన పండు ముక్కయినా పెట్టడానికి సాహసించే గొప్ప మనసు పిల్లది! దాని ముందు ప్రతీదీ దిగదుడుపే.
పిల్లల మనసు తెల్ల కాయితం. అందుకే అంతగా ప్రేమిస్తారు. అంతగా బాధాపడతారు. నువ్వు తింటేనే నేనూ తింటానంటారు. పిల్లలు దైవస్వరూపులు.. కాదు.. మాతృ మూర్తులు. ఇక్కడో చిన్నారి తన తండ్రికి ఓ పండు ముక్క పెడుతోంది. అతనికి వెండిగిన్నెలో ఎంతో ఖరీదయిన తిండి తిన్నంత ఆనం దం. దట్ ఈజ్ బ్యూటీ ఆఫ్ లైఫ్! ఈ దృశ్యం ముంబై లోకల్ ట్రైన్‌లో దృశ్యం. దీన్ని ఇప్పటికి లక్షల మందే చూసి ఉంటారు. వారికీ తండ్రి ప్రేమ గుర్తొచ్చే ఉంటుంది.