తానే మారెనో.. సోము స్వరమే మార్చెనా?
posted on Jul 29, 2022 @ 4:30PM
కాఫీ అడిగితే తిట్టుకున్న చిన్నకోడలి కంటే కాసిని చల్లటి కాఫీ ఇచ్చే పెద్ద కోడలే నయం అనుకుని పెద్దామె ఎంతయినా పెద్దదే మంచిదే.. అనకుంది. అదుగో అలా ఉంది బీజేపీ నేత సోము వీర్రాజు వ్యవహారం. మొన్నటి దాకా టీడీపీపైనా, ఆ పార్టీ అధినేత చంద్రబాబు పైనా కారాలు మిరియాలు నూరిన సోము హఠాత్తుగా స్వరం మార్చారు. రాజకీయ పరిస్థితులను అనుసరించి, వాతావరణాన్ని అనుసరించి ఎవర యినా మారిపోతారనడానికి ఇదో పెద్ద ఉదాహరణ. గత ఎన్నికలకు ముందు చంద్రబాబు ఎన్డీఏను వీడకుండా బీజేపీ తోనే ఉండి ఉంటే వైసీపీ అధికారంలోకి వచ్చేదే కాదని కొత్తగా సెలవిచ్చారు.
వైసీపీ మూడు రాజధానుల అంశాన్ని బాగా ప్రచారం చేసుకుంటూ, ఇది తప్పని పరిస్థితి అంటూ జనాల మీద అభిప్రాయాన్ని రుద్దే ప్రయత్నాలు ముమ్మరం చేసినపుడు సోము వీర్రాజు పెదవి విప్పలేదు. ఆ ఆలోచన అమలు ఎంతవరకూ సబబు అన్న ముక్క మాట్లాడలేదు. కానీ జగన్ ప్రభుత్వ ఆలోచనను తిర స్కరిస్తూ రైతాంగం కోర్టు మెట్లెక్కి వారికి తీర్పు అనుకూలంగా వచ్చిన తర్వాతనే బీజేపీ నేత స్వరం సరిచేసు కుని అవును అమరావాతినే రాజధాని చేయాలన్నదే తాము మొదటి నుంచి చెబుతూవచ్చామన్నారు.
అమరావతినే రాజధానిగా చేయడానికి బీజేపీ కంకణం కట్టుకున్నట్టు సోము చెబుతున్నారు. అమరావతి నే రాజధానిగా చేయాలన్న సంకల్పంతోనే బీజేపీ ఏకంగా పాదయాత్ర చేయడమేగాక రాజధాని నిర్మాణా నికి కేంద్రం నిధులు, సహాయాన్ని బాగా ప్రచారం చేసుకుంటోంది. కేంద్రం రాజధాని అమరావతి కోసం 4వేల కోట్లు ఒకసారి, 2500 కోట్లు మరోసారి నిధులు ఆనాడు కేంద్రం మంజూరు చేసిందని గుర్తు చేశారు.
అసలు రాష్ట్రంలో జగన్ సర్కారుకు పరిస్థితులు అననుకూలంగా ఉన్నాయని గ్రహించే బీజేపీ ఇపుడు టీడీపీ అధినేత చంద్రబాబుకి భజనచేయడానికీ సిద్ధపడ్డారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కానీ టీడీపీ తో పొత్తు అంశాన్ని మాత్రం సోము వీర్రాజు మాట్లాడటం లేదు. జనసేన అనుభవం తరువాత పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా తన పరిమితులను ఆయన గుర్తించినట్లున్నారు. అయితే పరిస్థితులు బాగా మారుతు న్ననేపథ్యంలో బీజేపీ వైసీపీ పట్ల నమ్మకం కోల్పోయిందనేది సోము మాటల్లో తేటతెల్లమౌతోంది. మొత్తంగా వైసీపీ, బీజేపీల మధ్య బయటకు కనిపించని సెగలేవో రగులుతు న్నాయనడానికి అటు వైసీపీ స్వరం కూడా మారుతుండటమే నిదర్శనం.