భుజాలు తడుముకున్నకొడాలి నాని
posted on Jul 29, 2022 @ 3:38PM
వెనుకటికి ఎవడో గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నాడట.సరిగ్గా అలా ఉంది ప్రస్తుతం మాజీ మంత్రి కొడాలి నాని పరిస్థితి. గుడివాడ క్యాసినో వ్యవహారంలో మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే తీరు ‘ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే’ అంటే ‘దొంగే.. దొంగ దొంగ అరిచినట్టు’ కొడాలి నాని తెలుగుదేశం నేతలకు సవాల్ వసురుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గుడివాడలో క్యాసినోను తాను నిర్వహించినట్లు ఆధారాలు ఉంటే.. ఈడీకి అందజేసి తనను అరెస్ట్ చేయించాలంటూ కొడాలి చేసిన సవాల్ పట్ల టీడీపీ నేతలు ఫైరవుతున్నారు. చేసిందంతా చేసి, ఇప్పుడు ఈ మేకపోతు గాంభీర్యం ఎందుకని ప్రశ్నిస్తున్నారు.
విషయం ఏంటంటే.. గత జనవరిలో సంక్రాంతి పండుగ సందర్భంగా గుడివాడలో పెద్ద ఎత్తున క్యాషినో నిర్వహించారు. అది కూడా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని సొంత ఫంక్షన్ హాల్ లో నిర్వహించడం సంచలనంగా మారింది. అప్పటికే భూ దందాలు, పేకాట క్లబ్బులు నిర్వహించడంలో నానికి అందెవేసిన చెయ్యి అనే పేరుంది. అయితే.. అప్పుడు ఇలా గోవా తరహాలో క్యాషినో నిర్వహించడంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. టీడీపీ నేతలైతే ఓ రేంజ్ లో కొడాలి నానిపై విరుచుకుపడ్డారు. నిజనిర్ధారణ కోసం గుడివాడ వస్తున్న టీడీపీ నేతలను పోలీసలు, కొడాలి అనుచరులు అడ్డుకున్నారు. దీంతో గుడివాడలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.
శ్రీలంక, నేపాల్, గోవాల్లో క్యాషినోలు నిర్వహిస్తున్నాడనే సమాచారంతో ఇటీవల హైదరాబాద్ లో చీకోటి ప్రవీణ్, మాధవరెడ్డిల ఇళ్లు, నగర శివార్లలోని ప్రవీణ్ ఆస్తులపై ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు పెద్ద ఎత్తున దాడులు నిర్వహించారు. చీకటి వ్యాపారాల్లో సిద్ధహస్తుడైన చీకోటి ప్రవీణ్ కు- గుడివాడలో జరిగిన క్యాషినోకు సంబంధం ఉందన్న ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిదే. చీకోటి ప్రవీణ్ ను కొడాలి నానికి గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పరిచయం చేశారని, ఆ క్రమంలోనే కొడాలి నాని ఫంక్షన్ హాల్ లో క్యాషినో నిర్వహణకు ఏర్పాట్లు జరిగాయంటున్నారు.
ఈ విషయాన్ని టీడీపీ నేత వర్ల రామయ్య ఎత్తి చూపుతూ.. చీకోటి ప్రవీణ్ తో వల్లభనేని వంశీ కలిసి ఉన్న ఫొటోలను మీడియా ముందు ప్రదర్శించారు. గోవా తరహాలో గుడివాడలో క్యాషినో నిర్వహించడం వెనుక చీకోటి ప్రవీణ్, కొడాలి నాని, వల్లభనేని వంశీ హస్తం ఉందని వర్ల రామయ్య ఆరోపించారు.
అయితే.. గుడివాడలో క్యాషినో తాను నిర్వహించినట్లు ఆధారాలు ఉంటే.. ఈడీకి సమర్పించి తనను అరెస్ట్ చేయించాలని కొడాలి నాని టీడీపీ నేతలకు బహిరంగంగా సవాల్ విసిరారు. ‘బురద పాము కోపం’ అనే సామెత ఒకటి ఉంది.. విషం లేని బురద పాము కరిచినా ప్రమాదం ఉండదు. అలాగే ఒక పక్కన మంత్రి పదవి కోల్పోయి, మామూలు ఎమ్మెల్యేగా ఉంటున్న కొడాలి నాని హవా ఇప్పుడు స్థానికంగా అస్సలు లేదట.
స్థానిక అధికారులు కూడా ఆయన మాటను ఏమాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులే కాదు స్వయంగా ఆయనే చెప్పుకుంటున్నారు. చెత్తపై పన్ను వసూలు చేయొద్దని కొడాలి చెప్పినా గుడివాడ మున్సిపల్ అధికారులు పెడచెవిన పెట్టారు. ఎమ్మెల్యే మాట విని విధులు నిర్వర్తించకుండాఉండమని ఆయనకే ఖరాకండీగా చెప్పేశారు. దీంతో కోరలు పీకిన పాములా కొడాలి నానిలో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతోంది. అందుకే చెత్త పన్ను విషయంలో సీఎం జగన్ తోనే మాట్లాడతానంటూ తనలాగే అమాత్య పదవి కోల్పోయిన మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని సాయంకోరినట్లు ఆయన అనుచరులే చెబుతున్నారు.
టీడీపీ నేతల నుంచి, ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్న క్రమంలో కొడాలి నాని భుజాలు తడుముకుంటున్నారని, దొంగే.. దొంగ.. దొంగ అని అరిచినట్లు చేస్తున్నారంటున్నారు. చేతనైతే తనన అరెస్ట్ చేయించాలంటూ కొడాలి నాని సవాల్ విసరడం వెనక ఆయనలోని ఉలికిపాటు బట్టబయలైందంటున్నారు.