ఇటు చూస్తే స్టాలిన్.. అటు చూస్తే మోడీ .. కేసీఆర్ కు కింకర్తవ్యం!
తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే, ఈ పోలిక అంత ఆప్ట్ కాదేమో కానీ, ఒక దానితో ఒకటి ముడి వేసి, అటూ ఇటూ అవడం కంటే దేనికదే అన్నట్లుగా నడచు కుంటే, ఇదిగో ఇలాంటి గిల్లికజ్జాలు, చిల్లర తగవులు రావంటారు. ఒకరేమో దేశ ప్రధానమంత్రి, ఇంకొకరేమో ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆ ఇద్దరు ఎడ ముఖం పెడ ముఖంగా ఒకరి ముఖం ఒకరు చూసుకోలేక పోవడం వారికేమో గానీ, చూసే వాళ్ళకు , అస్సలు బాగోదు. బాగుండడం బాగోకపోవడం విషయం పక్కన పెట్టినా, ఆ కారణంగా అసలే అంతంత మాత్రంగా ఉన్న కేంద్ర రాష్ట్ర సంబధాలు మరింతగా బిగుసుకు పోయే ప్రమాదం ఉందని, నిజానికి అదే జరుగుతోందని అంటున్నారు.
ఫలితంగా పరస్పర ప్రయోజనాలే కాదు, పరిపాలనా పరంగా సమస్యలు వస్తాయని అధికారులు అంటున్నారు. కేంద్ర ప్రభుత్వంతో తెలంగాణ ప్రభుత్వ సంబంధాల విషయాన్నే తీసుకుంటే రెండు ప్రభుత్వాల మధ్య ప్రతి రోజు ఏదో ఒక వివాదం రగులుతూనే వుంది. రోజులు వారాలు కాదు, ఏకంగా నెలల తరబడి తగవులు సాగినా చివరకు ప్రజలకు ఎలాంటి మేలు జరగడం లేదు. హళ్లికి హళ్లి సున్నకు సున్నా. వరి వివాదమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ.
తెలంగాణకు ఇరుగు పొరుగున ఉన్న రాష్ట్రాలు ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలలోనూ రాజకీయంగా కేంద్రలో అధికారంలో ఉన్న బీజేపీని రాజకీయంగా వ్యతిరేకించే ప్రభుత్వాలే ఉన్నాయి. నిజానికి ఈ రెండు రాష్ట్రాలు మాత్రమే కాదు, దేశంలో ఉన్న మొత్తం 28 రాష్ట్రాలు కేంద్ర పాలిత కు గానూ, 18 రాష్ట్రాలలో మాత్రమే బీజేపీ అధికారంలో వుంది. మిగిలిన రాష్ట్రాలలో బీజేపీ అధికారంలో లేదు. కాంగ్రెస్, తృణమూల్ , లెఫ్ట్ ఫ్రంట్, ఆప్ ఇలా వేర్వేరు పార్టీలు అధికారంలో ఉన్నాయి. అయినా, రాజకీయంగా ఎవరిని ఎవరు ఎంతగా విమర్శించుకున్నా వ్యక్తిగత ద్వేషం పెద్దగా ఎక్కడ కనిపించదువు. ఒక కేసీఆర్, ఒక మమతా బెనర్జీ వంటి ఒకరిద్దరు ముఖ్యమంత్రుల విషయంలో తప్పించి మిగిలిన వారి విషయంలో ఇలాంటి వ్యక్తిగత ద్వేషం ఎక్కడా లేదనే చెప్పవచ్చును.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గత సంవత్సర కాలంలో , అధికార అనధికార కార్యక్రమాలలో పాల్గొనేందుకు నాలుగైదు సార్లు రాష్ట్రానికి వచ్చారు. అయినా, ఏ ఒక్క సందర్భంలోనూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానికి స్వాగతం పలకలేదు. వీడ్కోలు చెప్పలేదు. ప్రోటోకాల్ పాటించలేదు. మరోవంక గవర్నర్ విషయంలోనూ ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు అదే విధంగా వుంది. రాష్ట్ర ప్రభుత్వం, ఇటు గవర్నర్ తో అటు కేంద్ర ప్రభుత్వంలో మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు, అన్నట్లుగా కయ్యానికి కాలు దువ్వడమే కనిపిస్తోంది.
అదలా ఉంటే ఇప్పుడు కేసీఆర్ కు పెద్ద చిక్కే వచ్చి పడింది. రాష్ట్రానికి వచ్చిన ప్రధానికి ఎదురుపడకుండా అయితే తప్పించుకున్నారు, కానీ, రేపు జూలై 28 న చెన్నైలో ప్రధాని మోడీని, ఎదురుగా పేస్ చేయక తప్పేలా లేదు. విషయం ఏమంటే, జూలై 28న చెన్నైలో ఫిడె చెస్ ఒలింపియాడ్ పోటీలు ప్రారంభమవుతున్నాయి. ఈ పోటీలను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభిస్తున్నారు. ఇదే ప్రారంభ వేడుకలకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు కూడా ఆహ్వానం అందింది.
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ప్రత్యేకంగా ఒక ఎంపీని హైదరాబాద్ పంపి మరీ, కేసీఆర్ ను ఆహ్వానించారు. కేసీఆర్ ఒకే చెప్పేశారు. తప్పకుండ్ వస్తానని మాట కూడా ఇచ్చేశారు. అయితే, అప్పటికీ అ పోటీలను ఎవరు ప్రారంభిస్తారనే విషయ ఖరారు కాలేదో ఏమో కానీ, ఇప్పడు తాజాగా ఒలింపియాడ్ ను ప్రధాని మోడీ ప్రారంభిస్తున్నారని అధికారికంగా ప్రకటించడంతో,కేసీఆర్ మీమాంసలో పడ్డట్టు తెలుస్తోంది. స్టాలిన్ కోసం వెళ్ళా లా, మోడీ కోసం మానేయాలా ? అనే విషయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తర్జనభర్జన పడుతున్నారని అంటున్నారు.