మమత దూకుడుకు మో(ఈ)డీ చెక్!
posted on Jul 29, 2022 @ 1:19PM
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఈ దెబ్బలన్నిటి వెనుకా కేంద్రం ఉందన్నది పరిశీలకులు అంటున్న మాట. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారింది. ఇందుకూ పరోక్షంగా కేంద్రమే కారణం. విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా మమత నేతృత్వంలో అందరూ మద్దతు పలికిన యశ్వంత్ సిన్హా రాష్ట్రపతి ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. ఆ పరాజయం మమత నేతృత్వంలోని విపక్షాల ఐక్యత డొల్ల అని తేల్చేసింది. రాష్ట్రపతి ఎన్నికలో విపక్షాల సభ్యులు క్రాస్ ఓటింగ్ కు పాల్పడటం వెనుకా మోడీ షా వ్యూహం ఉంది. ఇక తాజాగా ఉపాధ్యాయుల నియామక స్కాం లో మమత కేబినెట్ లో విద్యాశాఖ మంత్రి పార్థా చటర్జీ అడ్డంగా దొరికి పోయి అరెస్టయ్యారు. మంత్రి పదవి నుంచి ఉద్వాసనకు గురయ్యారు. తనకు సన్నిహితుడైన మంత్రివర్గ సహచరుడిని స్వయంగా మమతే మంత్రివర్గం నుంచి తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకు కారణం ఈడీ దాడుల్లో ఆయన అడ్డంగా దొరికిపోవడమే అయినా.. ఆ ఈడీ దాడుల వెనుక ఉన్నది మోడీయేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఇక మళ్లీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దగ్గరకు వస్తే.. అష్టదిగ్బంధనంలా మారిన కేంద్రం షరతులతో ఆర్థిక వెసులుబాటుకు మమత సర్కార్ దూరమైంది. దీంతో చేసిన అప్పులకు వడ్డీలు కట్టడమే గగపమైన పరిస్థితుల్లో ఎన్నికలలో మమత ఇచ్చిన హామీల అమలు, పథకాల అమలులో అనివార్యంగా కోత పడుతోంది. ఇది ఒక విధంగా జనంలో దీదీ పాపులారిటీ వేగంగా తగ్గిపోవడానికి కారణమౌతోంది. అలాగే రాష్ట్రపతి ఎన్నికలో విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యవ్వంత్ సిన్హా ఓటమితో విపక్షాల ఐక్య కూటమికి నేతృత్వం వహించాలన్న మమత కలలు దాదాపు కల్లలైనట్లే. విపక్షాల ఐక్యత విషయంలో ఉప రాష్ట్రపతి ఎన్నికలో విపక్షాలు నిలబెట్టిన అభ్యర్థికి తృణమూల్ ఓటేయదని స్వయంగా మమతా బెనర్జీయే ప్రకటించి విపక్షాల ఐక్యతా యత్నాలు డొల్లేనని చెప్పకనే చప్పే పరిస్థితి ఏర్పడింది.
దీని వెనుక ఉన్నదీ మోడీ వ్యూహమే. పైగా ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఆయన నిలబెట్టింది.. బెంగాల్ ప్రభుత్వానికి అడుగడుగులా అడ్డంకులు సృష్టించిన ఆ రాష్ట్ర గవర్నరనే. ఇక ఇది చాలదన్నట్లు ఉపాధ్యాయుల రిక్రూట్ మెంట్ కుంభకోణం. ఈ కుంభకోణంలో ఏకంగా ఒక మంత్రి అడ్డంగా దొరికిపోవడంతో జాతీయ స్థాయిలో బీజేపీయేతర పార్టీల ఐక్యతకు మమత ప్రయత్నాలకు పూర్తిగా చెక్ పడినట్లే. గత అసెబ్లీ ఎన్నికలలో పరాభవానికి, పరాజయానికి మోడీ మమతపై ఈ రకంగా ప్రతీకారం తీర్చుకున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అదే సమయంలో మమతా బెనర్జీని మరింత డిఫెన్స్ లో పడేసే విధంగా పులి మీద పుట్రలా పాఠశాలల్లో నియామకాల కుంభకోణం వెలుగు చూసింది. ఇంకేముంది అదును చూసి మోడీ మమతను దెబ్బ కొట్టారు. అసెంబ్లీ ఎన్నికల పరాభవానికి ప్రతీకారం తీర్చుకున్నారు. ఫలితంగా జాతీయ రాజకీయాల నుంచి వెనుదిరిగే అవకాశం కల్పించారు.
ఈ పరిణామాల మధ్యే 38 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు బిజేపి తో కాంటాక్ట్ లో ఉన్నారు అంటూ అలనాటి బాలీవుడ్ స్టార్ హీరో, ఇప్పడు బీజేపీ సీనియర్ నాయకుడు మిథున్ చక్రవర్తి బాంబులాంటి వ్యాఖ్య చేశారు. ఆయన అక్కడితో ఆగకుండా మమతా బెనర్జీ హయాంలో బెంగాల్ లో శాంతి భద్రతలు క్షీణించాయనీ, రోహింగ్యాల రాజ్యం నడుస్తోందనీ విమర్శలు గుప్పించారు. మోడీ వ్యూహం ఎంత పకడ్బందీగా ఉందంటే.. తన కేబినెట్ మంత్రిని ఈడీ అరెస్టు చేసినా కనీసం ఖండన ప్రకటన కూడా చేయలేని పరిస్థితి మమతకు కల్పించారు.
కళ్లెదుట నోట్ల కట్టలు కనిపిస్తుంటే.. ఎంత కేబినెట్ సహచరుడైనా మమత ఆయనకు మద్దతుగా ఎలా నిలుస్తారు. అరెస్టుకు ముందు పార్థా చటర్జీ మమతకు పలుమార్లు ఫోన్ చేసినా ఆమె కనీసం రెస్పాండ్ కాలేదు. దీంతో ఆయనా ఆగ్రహించినట్లున్నారు. తనను అరెస్టు చేస్తే తెలియజేయాల్సిన వారి జాబితాగా ఇచ్చే మెమోలో మమత పేరును చేర్చారు. దీంతో మమతా బెనర్జీ కేబినెట్ నుంచి పార్థా చటర్జీని బర్త్ రఫ్ చేశారు. ఈ వరుస పరిణామాలతో మమతా బెనర్జీ ఇక ఇప్పట్లో జాతీయస్థాయిలో రాజకీయాల వైపు దృష్టి సారించే అవకాశాలు దాదాపు మృగ్యమేనని.. ఆ విధంగా మోడీ వ్యూహాత్మకంగా మమతను బెంగాల్ కే పరిమితం చేయగలిగారనీ అంటున్నారు. ఇక తరువాతి వంతు కేసీఆర్ దేనని ఆయనను కూడా తెలంగాణకు పరిమితం చేసేందుకు మోడీషా ద్వయం పావులు కదుపుతున్నారనీ రాజకీయ వర్గాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.