మంచి దొంగ!
posted on Jul 29, 2022 @ 10:35AM
దొంగల్లో దొర, దొరల్లో దొంగ లాంటి సినిమాలు చూసే ఉంటారు. వాళ్లకి మించిన కాస్తంత సద్భుద్ధిగల మంచి దొంగ ఈమధ్యనే మరింత విచిత్రం చేసి తాను అసల్కి దొంగనే కానని నిరూపించుకున్నాడు. శ్రీకాకుళంజిల్లా బూర్జమండలం కొల్లివలసకు చెందిన చక్రధర రావు కుటుంబ సమేతంగా తమ బంధు వుల ఇంటికి వెళ్లి వచ్చే సరికి ఇంటి తాళం తీసి, డబ్బులు నగల బీరువా తాళం తీసి కనిపించేసరికి గుండె ఆగినంత పనయింది. ఆయన పరుగున వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మొత్తం బీరువాలోని రూ.11.20 లక్షలు చోరీ అయినట్టు చక్రధరరావు గుర్తించారు. ఘటనా స్థలంలో క్లూస్‌టీం తనిఖీలు నిర్వహిం చారు. ఇంతలో చాలా సినిమాటిక్‌గా ఆ చోరుడు మనసు మార్చుకుని అదే యింటికి వెళ్లి తాను దొంగిలించిన సొమ్ము అణా పైసలతో సహా మూటగట్టి ఇంట్లోనే పెట్టి వెళిపోయాడు. పైగా తనను దొంగ అని అపార్ధం చేసుకోవద్దని ఓ లేఖ కూడా రాసి పారి పోయాడు. అది ఆ ఇంటి యజ మాని మర్నాడు చూసి పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు డబ్బును స్వాధీనం చేసుకుని కోర్టుకు అప్పగించారు.
ఈ విచిత్ర చోరుడు డబ్బుతో పాటు ఓ ఉత్తరాన్ని కూడా వదిలి వెళ్లాడు. పోలీసులు, కేసు, జైలు శిక్ష చిప్పకూడు అన్నీ గుర్తుకు వచ్చేసరికి మరి చోరుడికి భయంతో ఒళ్లు ఒణికి నట్టుంది. పరుగున అదే ఇంటికి వెళ్లి డబ్బు మూటను పెట్టి వచ్చేశాడు. పోయిందనుకున్న సొత్తు మొత్తం దొరికినందుకు ఆ కుటుంబం ఎంతో ఆనందించింది. వచ్చినవాడు మరీ అనుభవజ్ఞుడు గాక పోవడంతో వీరికి ప్రశాంతత చేకూరింది. ఎందుకంటే వాడు దోచిన సొమ్మంతా మళ్లీ పైసాతో సహా దొంగతనంగా అదే ఇంటికి వచ్చి దాచిపెట్టాడు. లేఖ సారాంశమేమంటే, అన్నా, వదినా, ఈ దొంగతనం చేయడం ఇదే మొదటిసారి. క్షమించి నన్ను వదిలేయండి, అలాగే కోర్టు, కేసు అంటూ రచ్చచేయవద్దు. పోలీసులు పట్టుకుంటే ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుంది. కనుక వదిలేయండి అంటూ తెగ ప్రాధేయపడ్డాడు. ఆ లేఖ చూసి ఆ కుటుంబం నవ్వుకుంది.. తమ అదృష్టానికి.. ఆ వచ్చినవాడు దొంగతనం మొదటిసారిచేసి తన తప్పును తెలుసుకుని డబ్బును తిరిగి ఇచ్చేసినందుకు! మంచిదొంగే...అనుకున్నారంతా!