ఏమని పిలవాలి? ఇంకేమని పిలవాలి?
posted on Jul 29, 2022 @ 2:31PM
రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము గురించి, కాంగ్రెస్ ఎంపీ అధీర రంజన్ చౌదరి చేసిన వ్యాఖ్య చుట్టూ రాజకీయ దుమారం రేగుతోంది. పార్లమెంట్ లోపల వెలుపల కూడా చౌదరి వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.అనుమానం లేదు. కాంగ్రెస్ ఎంపీ మర్యాద గీత దాటారు. అయితే ఉద్దేశపూర్వకంగా తానా వ్యాఖ్యలు చేయలేదని, పొరపాటున మాట దొర్లిందని సంజాయషీ ఇచ్చారు. అయినా ఆ వివాదం సర్దుమణగ లేదనుకోండి అది వేరే విషయం.
అయితే, మహిళలు రాష్ట్రపతి పదవిని చేపట్టినప్పుడు, వారిని ఎలా పిలవాలి?ఎలా సంభోధించాలి ? అనే విషయంలో ఇప్పుడు కాదు, రాజ్యాంగ నిర్మాణానికి ముందు నుంచి కూడా సందేహాలు, సందిగ్దతలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి, రాజ్యాంగ సభలో ‘రాష్ట్రపతి’ సంబోధన అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. మహిళలు ‘రాష్ట్రపతి’ పదవిని చేపట్టినప్పుడు, వారిని రాష్ట్రపతిగా పిలవడం సరికాదని...‘నేత’ అని సంబోధించాలని రాజ్యాంగ సభ సభ్యుడు కె.టి.షా అభిప్రాయపడ్డారు. అలాగే, మరికొందరు ‘కర్ణధార్’ (కెప్టెన్)గా, సర్దార్‌గా పిలవాలని సూచించారు. అయితే భారత తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ, ఆ వివాదానికి అప్పుడే చుక్క పెట్టారు. రాష్ట్రపతి స్త్రీ అయినా పురుషుడు అయినా, లింగ భేదంతో సంబంధం లేకుండా, వారిని ‘రాష్ట్రపతి’గానే పిలవాలని నెహ్రూ నిర్ణయించారు.
అయితే నెహ్రూ కాలంలో కానీ, అనంతర కాలంలో కానీ, రాష్ట్రపతి సంభోదనకు సంబంధించి ఏలాంటి చర్చ జరగలేదు. అలాంటి అవసరం,సందర్భం కూడా రాలేదు. 2007 లో ప్రతిభా పాటిల్ దేశ 12వ రాష్ట్రపతిగా రాష్ట్రపతిగా ఎనికయ్యారు. తొలి మహిళా రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేశారు. అప్పట్లో, ఇదిగో ఇప్పటిలానే, మహిళా రాష్ట్రపతిని ఎలా సంభోదించాలనే విషయంలో చిన్నపాటి చర్చ జరిగింది
కానీ, ఇప్పటిలా వివాదం అయితే కాలేదు. అయితే, ప్రధానమంత్రి, కేంద్ర రాష్ట్ర మంత్రులు, గవర్నర్లను ఆడ, మగ తేడ లేకుండా ఒకేలా సంభోదిస్తున్నప్పుడు,ఒక్క రాష్ట్రపతి విషయంలో మాత్రమే వివాదం ఎందుకు, అనే వాదన కూడా వుంది. అందుకే, భారత తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ, పదవులకు లింగ భేదం ఎందుకనే ఉద్దేశంతోనే కావచ్చు స్త్రీ పురుషులు ఎవరైనా రాష్ట్రపతి అంటే రాష్ట్రపతి అని తేల్చేశారు