తెరాసలో ఉప ఎన్నికల భయం
మలివిడత తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ రాష్ట సమితి (తెరాస) తెరాస ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎప్పుడంటే అప్పుడు రాజీనామాలు చేశారు, పుష్కర కాలానికి పైగా సాగిన తెలంగాణ ఉప ఎన్నికలకు పోవడం ఒక నిరంతర క్రతువుగా, ఉద్యమంలో భాగంగా, జరిగిపోయింది. పుష్కర కాలానికి పైగా తెరాస సారధ్యంలో సాగిన ఉద్యమానికి అవసరమైన ఆక్సిజన్ అందించేందుకు,సెంటిమెంట్ ను సజీంగా ఉంచేందుకు, తెరాస అధినేత కల్వకుట్ల చంద్రశేఖర రావు, ఉప ఎన్నికలను ఒక అస్త్రంగా ఉపయోగించుకున్నారు.
నిజానికి మాలి విడద తెలంగాణ ఉద్యమం కేసీఆర్ రాజీనామాతోనే పురుడు పోసుకుంది. తెలుగుదేశం పార్టీ సభ్యత్వంతో పాటు, ఎమ్మెల్యే (సిద్ధిపేట), అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, పదవులకు రాజీనామా చేసిన తర్వాతనే కేసీఆర్, తెరాస జెండా ఎగరేశారు. సిద్ధిపేట ఉప ఎన్నికతోనే తెరాస రాజకీయ ప్రస్థానం మొదలైంది. ఇక ఆ తర్వాత, గెలుపు ఓటములు ఎలా ఉన్నా, తెరాస ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎన్నిసార్లు రాజీనామాలు చేశారో ఎన్నిసార్లు ఉపఎన్నికలకు వెళ్ళారో చెప్పలేము. అదొక చరిత్ర.
అయితే, ఇప్పడు అదే తెరాస ఉప ఎన్నికలు అంటే భయపడుతోందా? అప్పుదు ఉద్యమ నేతగా పలుమార్లు తనతో పాటు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులతో రాజీనామా చేయించి ఉపఎన్నికలకు వెళ్ళిన కేసీఆర్, ముఖ్యమంత్రిగా ఉప ఎన్నికలకు వెళ్లేందుకు భయపడుతున్నారా? అంటే, అందరి నుంచి అవుననే సమధానమే వస్తోంది.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఉపఎన్నికలకు వెళితే ఫలితం ఏ మాత్రం అటూ ఇటు అయినా, అసలుకే ఎసరు వస్తుందనే భయం కేసీఆర్‌తో పాటు టీఆర్ఎస్ నేతల్ని వెంటాడుతోంది. ముఖ్యంగా హుజురాబాద్ ఉప ఎన్నిక ఓటమి తర్వాత కేసీఆర్ ఉప ఎన్నికలంటే భయపడుతున్నారని, సన్నిహిత వర్గాల సమాచారంగా ప్రచారం జరుగుతోంది. మరో వంక, దుబ్బాక, హుజురాబాద్ ఉపఎన్నికల విజయంతో తెలంగాణపై ఆశలు పెంచుకున్న బీజేపీ, ఉప ఎన్నికలకు ఉత్సాహం చూపుతోంది. 2023 అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణలో కాషాయ జెండా ఎగరేసేందుకు సర్వ శక్తులు వడ్డుతున్న బీజేపీ, అసెంబ్లీ ఎన్నికలలోగా, తెరాస, కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలను తమ వైపుకు తిప్పుకుని, ఉప ఎన్నికల ద్వారా రాష్ట్రంలో ప్రధాన రాజకీయ శక్తి గా ఎదుగేందుకు వ్యూహత్మకంగా పావులు కదుపుతోంది.
నల్గొండ జిల్లా మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల రెడ్డి బీజేపీలో చేరేందుకు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు రెడీ అయి పోయారు. మునుగోడు నియోజక వర్గంలో రాజగోపాల రెడ్డికి, పార్టీ (కాంగెస్) పరంగానే కాకుండా వ్యక్తిగతంగానూ మంచి పట్టుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి స్థానికంగా అంతపట్టులేకున్నా, ఇతరత్రా అంగబలం, అర్థ బలం అన్నీ పుష్కలంగా ఉన్నాయి. అన్నిటినీ మించి, రాజగోపాల రెడ్డి అన్నట్లుగా తెరాసను గద్దె దించాలనే పట్టుదల వుంది.
మరోవంక, వరసగా రెండు తెరాస సిట్టింగు స్థానాలకు జరిగిన ఉపఎన్నికల్లో విజయకేతనం ఎగరేసిన బీజేపీ, మునుగోడును గెలుచుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే, ఉప ఎన్నికలు అధికార తెరాసకు కలిసి రావడం లేదు. అందుకే మునుగోడు ఉప ఎన్నిక అంటే టీఆర్ఎస్ భయపడుతోందని, అలాగే, హుజూర్ నగర్ సిటింగ్ స్థానంతో పాటు, కాంగ్రెస్ దిగ్గజం జానారెడ్డి పోటీ చేసిన నాగార్జున సాగర్ స్థానం ఉపేన్నికలోనూ ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ కూడా ఉప ఎన్నికకు అంత సుముఖంగా లేదని అంటున్నారు. ఉపఎన్నికల్లో ఓడి పొతే, అది కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని దెబ్బవుతుందిని ఆపార్టీ నాయకులు ఆందోళన చెందుతున్నారు. అందుకే, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని బుజ్జగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
అదలా ఉంటే. మునుగోడు ఉపఎన్నికలో, టీఆర్ఎస్ ఓడితే రాష్ట్రంలో అధికార మార్పిడికి కౌంట్‌డౌట్ మొదలైనట్లేనని, పరిశీలకులు అంటున్నారు. మరో వంక బీజేపీ, మునుగోడుతో పాటుగా,మరో రెండు మూడు నియోజక వరగాలపై కన్నేసిందని, విశ్వసనీయంగా తెలుస్తోంది. నియోజకవర్గం పై పట్టున్న ఇద్దరు ముగ్గురు కాంగ్రెస్, తెరాస సిట్టింగ్ ఎమ్మెల్యేలను తమవైపుకు తిప్పుకుని రాజీనామాచేయించి,జనవరిలో మూడు లేదా నాలుగుస్థానాలకు ఒకేసారి ఉపఎన్నికలు జరిగేలా బెజేపీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఆదే నిజమైతే, ఇప్పటికే వేడెక్కిన రాష్ట్ర రాజకీయాలు రానున్న రోజులో మరింత వేడెక్కే ప్రమాదముంది, రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.