కేఆర్ఆర్ స్టోరీలో కొత్త ట్విస్ట్ ... తెర మీదకు దిగ్విజయ్ సింగ్
మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటి రెడీ రాజగోపాల రెడ్డి ఇంకా బీజేపీలో చేరలేదు, కానీ, చేరినట్లే అనుకోవచ్చనే స్పష్టమైన సంకేతాలు అయితే ఇచ్చారు. అంతే కాదు, ఎందుకు తాను పార్టీ మారాలని అనుకుంటున్నది కూడా అంతే స్పష్టంగా చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ పాలనను ఎదిరింఛి ఓడించే శక్తి సామర్ధ్యాలు ఒక్క బీజేపీకి మాత్రమే ఉన్నాయని, కాంగ్రెస్ పార్టీకి ఆ శక్తి లేదని స్పష్టంగా చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ, పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీల పట్ల గౌరవం ఉన్నా, ప్రస్తుత కేసేఆర్ ను ఎదుర్కునే సత్తా కాంగ్రెస్ పార్టీకి లేదని కుండబద్దలు కొట్టారు. కాంగ్రెస్ ను వదిలి బీజేపీలో చేరడం, ‘చారిత్రిక అవసరం’ గా పేర్కొన్నారు. మరోవంక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా రాజగోపాల రెడ్డి బీజేపీలో చేరుతున్నారని, మీడియా సాక్షిగా ధృవీకరించారు. ఇక ముహూర్తం ఖరారు కావడమే మిగిలుందని, అంటున్నారు.
అయితే, కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇంకా రాజగోపాల రెడ్డిపై ఆశలు వదులుకోలేదని తెలుస్తోంది. రాజగోపాల రెడ్డి గత రెండు సంవత్సరాలుగా ఇదే చెపుతున్నా, పెద్దగా పట్టించుకోని కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ పెద్దలు ఇప్పడు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.
ఢిల్లీలో కేసీ వేణుగోపాల్‌తో రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాణిక్యం ఠాగూర్ వంటి నేతలు సమావేశమై రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపైనే ప్రధానంగా చర్చించారు. ఈ సమావేశం అనంతరం రాజగోపాల్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడమో లేక షోకాజ్ నోటీసు ఇవ్వడమో చేస్తారని వార్తలు వచ్చాయి. ముఖ్య్మగా రేవంత్ రెడ్డి అలాంటి సంకేతాలు ఇచ్చారు. కానీ, కాంగ్రెస్ పెద్దలు తొందర వద్దని హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఈ నేపధ్యంలోనే రాజగోపాల్ రెడ్డి పార్టీలో కొనసాగుతారని తమకు నమ్మకం ఉందని మాణిక్యం ఠాగూర్ విశ్వాసం వ్యక్త పరిచారు.
నిజానికి, అంతకు ముందే సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క వ్యక్తిగతంగా రాజగోపాల రెడ్డిని కలిసి, పార్టీ వీడద్దని కోరారు.అయినా, తన నిర్ణయంలో మార్పు లేదని రాజగోపాల రెడ్డి స్పష్టం చేశారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో, కేసీఆర్ ను ఓడించాలనే కసి కనిపించడం లేదని, అందుకే, కేసీఆర్ ను ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్న ఈటల రాజేందర్, కాంగ్రెస్ లో కాకుండా, ఆ కసి, శక్తి సామర్ధ్యాలు ఉన్న బీజీపీలో చేరారని చెప్పు కొచ్చారు. అంటే తనది కూడా అదే బాటని రాజగోపాల రెడ్డి చెప్పు కొచ్చారు.
ఆదలా ఉంటే కాంగ్రస్ నాయకత్వం చివరి ప్రయత్నంగా, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్ చార్జి దిగ్విజయ్ సింగ్‌ను రంగంలోకి దించినట్లు తెలుస్తోది. దిగ్విజయ్ సింగ్‌తో కోమటిరెడ్డి సోదరులకు గతంలో మంచి సంబంధాలున్నాయని , అందుకే ఆయన్ని రంగంలోకి దించారని అంటున్నారు. త్వరలోనే ఆయన రాజగోపాల్ రెడ్డితో చర్చలు జరపబోతున్నారని సమాచారం. శుక్రవారం( జులై 29)ఢిల్లీలో రాజగోపాల రెడ్డి, దిగ్విజయ్ సింగ్ తో సమావేశం అవుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. అయితే, రాజగోపాల రెడ్డి, కాంగ్రెస్ పార్టీలో కొనసాగే ప్రసక్తే లేదని, అయితే, దిగ్విజయ్ సింగ్ తో ఉన్న సంబంధాల దృష్ట్యా ఆయన్ని కలిసి, తాను కాంగ్రెస్ పార్టీని ఎందుకు వీడాలని అనుకుంటున్నది,వివరంగా చెప్పేందుకు ఢిల్లీ వెళుతున్నారని కోమటి రెడ్డి క్యాంపు సమాచారం.