పొత్తు పొడుపులపై ఊహాగాన సభలు.. ఢిల్లీ టు గల్లీ ఇదే చర్చ ఇదే రచ్చ
రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు. శాశ్వత శతృవులు ఉండరు... ఇది ఒక విధంగా సర్వామోదం పొందిన నానుడి. యూనివర్సల్ ట్రూత్. సో .. పార్టీల మధ్య స్నేహ సంబంధాలు అటూ ఇటూ కావడం, పొత్తులు, కూటములు విచ్చిన్నం కావడం, పాత పొత్తులు వాడి, కొత్త పొత్తులు విచ్చుకోవడం, కొత్త విషయం కాదు. నిన్న గాక మొన్న బీహారులో ఏమి జరిగిందో చూశాం.
రెండేళ్ళ క్రితం 2020 అక్టోబర్, నవంబర్ నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జనతా దళ్ (యు) పార్టీలు పొత్తు పెట్టుకుని, ఒకే కూటమిగా (ఎన్డీఎ) పోటీ చేశాయి. కూటమి విజయం సాధించింది. ఎన్డీఎ ప్రభుత్వం ఏర్పడింది. జేడీయు కంటే బీజేపీకి రెట్టింపు సీట్లు వచ్చినా, ముందే కుదిరిన ఒప్పందం ప్రకారం జేడీయు నేత నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే, ఈరెండు సంవత్సరాలలో లోలోపల ఏమి జరిగిందో ఏమో కానీ, నితీష్ కుమార్’ బీజేపీ చేయి వదిలి ఆర్జేడీ చేయి పట్టుకున్నారు. మళ్ళీ ఆయనే పీఠం ఎక్కారు. నితీష్ ముఖ్యమంత్రిగా కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. సరే,నితీష్ కుమార్ మనసు మళ్ళీ ఎప్పుడు మారుతుంది, ఈ ప్రభుత్వం ఎంతకాలం మనుగడ సాగిస్తుందనే భేతాళ ప్రశ్నలు ఉంటే ఉండవచ్చును కానీ, రాజకీయ ఎన్నికల పొత్తులకు సంబంధించి ఇదొక లేటెస్ట్ క్లాసిక్ ఎగ్జాంపుల్’ గా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. నిజమే, ఇంతకు ముందు ఇదే బీహారులో ఇదే తరహ పొత్తులు కుడి ఎడమలు అయిన సందర్భాలున్నాయి. మహారాష్ట్రలోనూ కొంచెం అటూ ఇటుగా అదే జరిగింది. ఇతర రాష్ట్రలలోనూ, చివరకు జాతీయ స్థాయిలోనూ ఇలాంటి ఉదంతాలు అనేక ఉన్నాయి. కూటమిలో వచ్చిన కుమ్ములాటల కారణంగా ఒకే ఒక్క ఓటు తేడాతో అటల్ బిహారీ వాజపేయి ప్రభుత్వం కూలి పోయింది.
అదలా ఉంచితే, ఇప్పుడు జాతీయ స్థాయి నుంచి రాష్ట్రాల వరకు పొత్తులు, ఎత్తులకు సంబంధించిన చర్చలే జోరుగా జరుగుతన్నాయి. టీవీ డిబేట్స్ మొదలు రచ్చబండ రాజకీయ చర్చల్ వరకు పొత్తుల మీదనే చర్చ నడుస్తోంది.ఎవరితో ఎవరు జట్టు కడతారు, ఎవరితో ఎవరు చేతులు కలుపుతారు ఎవరు ఎవరితో చేతులు కలిపితే ఫలితాలు ఎలా తారుమారు అవుతాయి అనే లెక్కల చుట్టూనే చర్చలు సాగుతున్నాయి.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసేఆర్ బీహార్ రాజదాని పాట్నా వెళ్లి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్’ తో సమావేశమై జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ ఏకం కావలసిన అవసరాన్ని, ఇటు బీహారు పెద్దాయనకు, దేశ ప్రజలకు విశద పరిచే ప్రయత్నం చేశారు. అలాగే, అంతకు ఒకరోజు ముందే ఎన్సీపీ అధినేత శరద పవార్’ బీజేపీయేతర రాజకీయ పార్టీలను జాతీయ స్థాయిలో ఏకం చేసి, ప్రజాభిప్రాయాన్ని కూడగట్టేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని చెప్పారు. అయితే అందులో తనది సలహాదారు పాత్ర మాత్రమే అని కూడా చెప్పారు. అలాగే, తృణమూల్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ, ఆప్ అధ్యక్షుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ఇలా ఎవరికి వారు, ప్రధాన మంత్రి నరేందర్ మోడీని గద్దెదించడం కోసం ఎవరికి వారు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఏకమయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు కానీ, నాయకత్వం విషయంలో ఎవరి దారిన వారు విడి పోతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాట్నా పర్యటనలో ఇదే తగవు తలమానికంగా నిలిచింది. చివరకు ఆయన వెళ్ళిన పని పంచిన కోటి రూపాయల నజరానాలు అన్నీ పక్కకి పోయి, నాయకత్వం విషయంలో కేసీఆర్, నితీష్ కుమార్ మధ్య ఏకాభిప్రాయం కుదరలేదన్న విషయమే ప్రముఖంగా బయటకు వచ్చింది.నాయకత్వ విషయంవచ్చే సరికి నితీష్ కుమార్ లేచి పోవడం, కేసీఆర్ ఆయన్ని కూర్చో పెట్టిందుకు భైఠోజీ .. భైఠో అని బతిమిలాడుకోవడమే హైలైట్’ గా నిలిచింది.
అదొకటి అలా ఉంటే, ఆంద్ర ప్రదేశ్’ లో టీడీపీ, బీజేపీల మధ్య మళ్ళీ పొత్తు పొడుస్తోందని, త్వరలోనే టీడీపీ ఎన్డీఎలో చేరుతోదంటూ గత వారం పదిరోజులుగా సాగుతున్న ప్రచారానికి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చక్కగా చుక్క పెట్టారు. ఏపీ అభివృద్ది కోసం అవసరాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు అన్నారు. ఇప్పటి వరకూ పొత్తుల గురించి తానెక్కడా మాట్లాడలేదని చెప్పారు. పొత్తులపై నాయకుల్లోనూ ఈ స్పష్టత ఉండాలని తెలిపారు. నిజం, గతంలోనూ తెలుగు దేశం పార్టీ రాష్ట్ర ప్రయోజనాల కోసమే బీజేపీతో పొత్తు పెట్టుకుంది. రాష్ట్ర ప్రయోజనాల కోసమే, ప్రత్యేక హోదా కోసమే పెట్టుకున్న పొత్తును తుంచేసుకుంది. ప్పడు కూడా అదే పద్దతిలో, ఎన్నికలు వచ్చినప్పుడు, అప్పటి రాజకీయ పరిస్థితి, రాజకీయ అవసరాలు, అన్నిటినీ మించి రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవడమే సరైన నిర్ణయం అవుతుందని టీడీపీ భావిస్తోంది.చంద్రబాబు నాయుడు చెప్పింది కూడా అదే.నిజానికి ఇప్పడు కాదు, మొదటి నుంచి చంద్ర బాబు నాయుడు పొత్తుల చర్చలకు ఇంకా సమయం రాలేదనే అభిప్రాయం తోనే ఉన్నారు.
అదలా ఉంటే తెలంగాణలో త్వరలో ఉపఎన్నిక జరగనున్న మునుగోడులో అధికార తెరాసకు మద్దతు ఇవ్వాలని ఉభయ కమ్యునిస్ట్ పార్టీలు, సిపిఐ, సిపిఎం నిర్ణయించాయి. నిజమే, కొత్త పొత్తులకు పాత తగవులు అడ్డు రావని, లెఫ్ట్ పార్టీలే కాదు అన్ని పార్టీలు ఎప్పుడోనే నిర్ణయించాయి.ఇక్కడ నైతిక విలువలు అవీ ఇవీ అని మాట్లాడవలసిన అవసరం లేదు. అయితే, సిపిఐ, సిపిఎం పార్టీలు బీజేపీని ఓడించేందుకు తెరాసకు మద్దతు ఇస్తున్నామని చెప్పుకోవడం తాడి చెట్టు ఎందుకు ఎక్కావు అంటే ... ఆవుదూడ మేతకు అన్నట్లు ఉందని కొందరు అంటున్నారు,అనుకోండి అది వేరే విషయం. గతంలో కేసేఆర్ లెఫ్ట్ పార్టీలను, ఆ పార్టీ నాయకులను ఎంతగా చులకన చేశారు, ఎంతగా అవహేళన చేశారు, లెఫ్ట్ నేతలు కేసీఆర్’ను ఏ బాషలో దూషించారు, అనేది ఇప్పడు అప్రస్తుతం.
అయితే, ఇలా పొత్తుల చుట్టూ తిరుగుతున్న చర్చలో జాతీయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు, రాష్ట్ర స్థాయి నుంచి నియోజక వర్గ స్థాయి వరకు బీజేపీని ఓడించడమే లక్ష్యంగా కనిపిస్తోందని, ఇన్ని పార్టీలు, ఇంత మంది మహా నాయకులు అందుకోసమే పనిచేస్తున్నారు, అని పిస్తుంది. కానీ... బీజేపీని మోడీని ఓడించడం అయ్యే పనేనా అంటే రేపటి సంగతి ఏమో కానీ ఈరోజుకు అయితే కాదనే అనిపిస్తుందని విశ్లేషకులే కాదు, సామాన్యులు కూడా భావిస్తున్నారు. ఎందుకలా ...?!