ఆలూ లేదు చూలూ లేదు.. అయినా హామీలకు కొదవే లేదు
ఏ దేశానికీ అయినా ఒకరే ప్రధాని ఉంటారు.. ఒకటే రాజధాని ఉంటుంది. అలాగే ఏ రాష్ట్రానికి అయిన ఒకరే ముఖ్యమంత్రి ఉంటారు. ఒకటే రాజధాని ఉంటుంది. అంతే కానీ, ఏకకాలంలో ఇద్దరు, ముగ్గురు ప్రధానులు ఉన్న దేశం, ఇద్దరు ముగ్గరు ముఖ్యమంత్రులు ఉన్నరాష్ట్రం ఉండవు. అలాగే ఏక కాలంలో రెండు మూడు రాజధానులు ఉన్న దేశాలు రాష్ట్రాలు కూడా ఉండవు. అయితే,ఇప్పడు దేశంలో ఇద్దరు,ముగ్గురు కాదు ఏకంగా ఓ అరడజను మందికి పైగానే, మహా నాయకులు ప్రధాని పదవి కోసం పోటీ పడుతున్నారు. నిజమే,ప్రధాని పదవికి పోటీ పడడం వరకు అయితే తప్పు కాదు. అందులో అక్షేపించవలసిన విషయం ఉండదు. కానీ, ఒక కూటమిగా కలిసి పోటీచేయాలని అనుకుంటున్న పార్టీల నాయకులు ఎవరికి వారు, ‘నేనే ప్రధాని’ అన్న విధంగా వాగ్దానాలు చేయడం వరకు వచ్చేశారు. అక్కడే చిక్కొచ్చింది.
ఇతర నేతల విషయం ఎలా ఉన్నా తెలంగాణ ముఖ్యమంత్రి, కేసీఆర్, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్’ ఇద్దరికిద్దరూ ఏమి కలలు కంటున్నారో ఏమో కానీ, పోటాపోటీగా వాగ్దానాలు చేసేస్తున్నారు. అయితే, ఆలు లేదు చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం, అన్నట్లుగా ఎవరికి వారు ఇలా ప్రధాని కిరీటం పెట్టేసుకుంటే, అసలుకే మోసం చేసేవిధంగా ఉందని రాజకీయ పండితులు హెచ్చరిస్తున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి, తెరాస అధ్యక్షుడు కే. చంద్రశేఖర రావు విషయాన్నే తీసుకుంటే 2024 ఎన్నికల తర్వాత కేంద్రంలో వచ్చేది, ‘మన’ ప్రభుత్వమే అని ఆయన ఇప్పటికే ప్రకటించారు. పార్టీ వేదికలనుంచే కాదు, పబ్లిక్ మీటింగులలో అదే ధీమా వ్యక్త పరుస్తున్నారు. అయితే ఆ ‘మనం’ లో ఎవరెవరు ఉన్నారో, ఎవరు లేరో మనకు తెలియదు, కానీ, ఆయన మాత్రం తెరాస శ్రేణులను ఉద్దేశించే ఈ ప్రకటన చేశారు. అంటే, తెరాస లేదంటే ఇంకా పుట్టని జాతీయ పార్టీ, బీఆర్ఎస్ అధికరంలోకి వస్తుందనేది ఆయన ఆలోచనో ఏమో, కానీ, ఉచిత వరాల జల్లు అయితే మొదలైంది. కేంద్రంలో, ‘మన’ ప్రభుత్వం రాగానే, దేశంలోని రైతులు అందరికీ, ఉచిత విద్యుత్, రైతు బంధు, రైతు బీమా ఇత్యాది ఉచితాలన్నీ ఇచ్చేస్తామని ప్రకటించారు.
అంతే కాదు, దేశం మొత్తంలో తెలంగాణ మోడల్ పాలన అందిస్తామని హామీ ఇచ్చారు.అంటే రాబోయే రోజుల్లో కాబోయే ప్రదాని తానే నని చెప్పకనే చెప్పారు. అయితే, ఇంతవరకు జాతీయ రాజకీయాలో ఆయన పోషించే పాత్రపై ఆయన సంగతి ఏమో కానీ, తెరాస శ్రేణులు సహా ఏ ఒక్కరికీ ఎలాంటి స్పష్టత లేదు. జాతీయ పార్టీ పెడతారా, ప్రాతీయ పార్టీల జాతీయ కూటమిని ఏర్పాటు చేస్తారా లేక నలుగురిలో నారాయణ గుంపులో గోవింద అన్నట్లుగా, జాతీయ పార్టీల ప్రాంతీయ కూటమిలో చేరతారా? ఏమి చేస్తారు? ఎటు పోతారు ? జాతీయ రాజకీయాల్లో అయన పోషించే పాత్ర ఏమిటి? ఇలా జవాబు లేని ప్రశ్నలు, ఎన్నో.. అయినా, ఆలు లేదు చూలు లేదు , కొడుకు పేరు సోమలింగం, అన్నట్లుగా, కేసీఆర్ జాతీయ నేతగా ప్రచారం చేసుకుంటున్నారు.పట్టుమని పది మంది ఎంపీలు లేక పోయినా, తానే కాబోయే ప్రధాని అనే ధీమాతో, దేశ ప్రజలపై వరాల జల్లు కురిపితున్నారు.
కేసీఆర్ కథ ఇలా ఉంటే, బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీష్ కుమార్’ కుమార్, మరో అడుగులు ముందుకేశారు. 2024 ఎన్నికల్లో పీఎం కుర్చీలో కూర్చోగానే,బీహార్‌తో సహా వెనుకబడిన రాష్ట్రాలన్నింటికీ ప్రత్యేక హోదా కల్పిస్తామని వాగ్దానం చేశారు. అంతే కాదు, కేసీఆర్ కంటే ఇంకా ఎక్కవ భరోసాతో, వెనక బడిన రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వక పోవడానికి ప్రత్యేక కారణం ఏదీ లేదని కూడా నితీష్ కుమార్ సెలవిచ్చారు.
అయితే, నిజానికి, నితీష్ కుమార్ ఇటీవల ఢిల్లీలో గడప గడపకు వెళ్లి దండాలు పెట్టుకుని వచ్చిన సందర్భంలో, అన్ని పార్టీల నాయకులను కలిసిన సమయంలో, తాను ప్రధాన మంత్రి రేసులో లేనని ప్రకటించారు. బీజేపే యేతర పార్టీలను ఏకం చేసి, మోడీని ఓడించడమే తమ లక్ష్యమని ప్రకటించారు. కానీ, ఇప్పడు ఏకంగా, ఏక పక్షంగా, కీలక వెనకబడిన రాష్ట్రాలకు చేశారు. అంటే ఒక విధంగా తానే ప్రతిపక్షాల ప్రధాని అభ్యర్ధినని డిక్లేర్ చేశారు.
ఇలా ఓ వంక కేసీఆర్, మరో వంక నితీష్, ఈ పక్క నుంచి మమతా బెనర్జీ, ఆ వైపు నుంచి కేజ్రీవాల్, ఇటు పవార్, అటు మాయ ఈ అందరినీ మించి, పార్టీని పణంగా పెట్టి మరీ భారత్ జోడో యాత్రా చేస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ .. ఇలా ఎవరికీ వారు ఎవరి ఎజెండాతో వారు ముందుకు పోతున్నారు. అందుకే రాజకీయ పండితులు ప్రతిపక్షలా ఈ అనైక్యతే బీజేపీకి శ్రీరామ రక్షా.. అంటున్నారు.