ఎలాంటి అడ్డులేక తీసికెళ్లేదే ఆంబులెన్స్!
posted on Sep 15, 2022 @ 11:28PM
పిల్లలు స్కూలుకి వెళ్లడానికి లేటయితే బస్సు మిస్సయి ఎవర్నియినా దింపమని అడుగుతారు, బస్సు మిస్సయ్యే ఉద్యోగి టూ వీలర్ మీద వెళ్లే కుర్రాణ్ణి కొంతదూరం లిఫ్ట్ అడుగుతాడు.. కానీ ఒక వ్యక్తి చెప్పాపెట్టకుండా ఏకంగా 108 బండినే తీసి కెళ్లాడు. అదీ ఇంటికి వెళ్లడానికి డబ్బుల్లేక. ఇది తప్పకుండా బాగా ఆలోచించే ఎత్తుకెళ్లాడని అందరూ అనుమానించారు. ఎందుకంటే 108 వాహనం రోగులను తీసికెళ్లడానికి ఉపయోగించేది. అదయితే ట్రాఫిక్ సమస్యా ఉండదు. చెవులు చిల్లు పడేలా హారన్ కొడుతూంటే లారీ కూడా ఆగి దారివ్వాల్సిందేకదా!
నల్గొండ జిల్లా హయత్‌నగర్‌లో ఈమధ్యనే ఒక మహానుభావుడు ఎక్కడ తిరిగాడో ఏమో జేబులో పైసా లేకుండా ఉన్నాడు. ఇంటికి వెళ్లడానికి డబ్బుల్లేవు. ఎంత ఆలోచించినా ఇంటికి చేరే మార్గంతోచడం లేదు. పోనీ నడిచి వెళదామంటే ఇల్లు చాలా దూరం. హయత్‌నగర్ తాసీల్దార్ కార్యాలయం వద్దకు వచ్చేడు. అక్కడ 108 వాహనం కనపడింది. కానీ అందులో ఎవ్వరూ లేరు. వాహనం డ్రైవర్ మూత్రవిసర్జన్‌కి వెళ్లాడు. ఇతను చుట్టూరా చూసి మెల్లగా ఆ వాహనం ఎక్కి చూశాడు. ఎవ్వరూ అభ్యం తరం చెప్పలేదు. కారణం వారికీ ఈ వాహనం డ్రైవర్ ఎవరో తెలీదు. ఎవరి పనుల్లో వారు ఉన్నారు. అంతే మనోడు రయ్ మంటూ ఈ వాహనాన్ని తీసికెళ్లాడు.
బుద్ధున్నవాడెవడూ చేయని పని ఈ మహానుభావుడు చేశాడు. ఇంటికి వెళ్లాలన్న తొందరలో 108 వాహనాన్ని కొట్టేశాడు. కానీ దాని వల్ల ఇంట్లోవారు, చుట్టుపక్కలవారూ, స్నేహితులు ఎంతగా ఖంగారు పడతారో ఆలోచించలేదు. బండి ఇంటి దగ్గర ఆపి ఇంట్లోకి వెళ్లాడు. పక్కనే ఉన్న పిన్నిగారు, బాబాయిగారు, పెద్దాయన అంతా ఇంటి దగ్గర తిరుగుతున్నారు. ఏదన్నా దుర్వార్త బయటికి వస్తుందని. కానీ అలాగేమీ జరగలేదు. పైగా , ఆ యింటి అబ్బాయి నిదానంగా బండిని చూస్తుండిపోయాడు. వచ్చిన వారు అతన్ని అడిగే ధైర్యమూ చేయలేదు. ఏమీ కాలేదని వాళ్లంతా ధైర్యం చెప్పుకుని ఇళ్లల్లోకి వెళిపోయారు. బుజ్జా..వీడు సామాన్యుడు కాదు...ఆంబులెన్స్‌తో ఇంటికి వచ్చి మరీ అందర్నీ కుశలాలు అడుగుతున్నాడ్రా... అనుకున్నారంతా!