మూడొచ్చినా మొక్కుబడి తంతే!
posted on Sep 15, 2022 @ 7:44PM
ఇటు చూస్తే మూడు రాజధానులు. అటు చూస్తే సంక్షేమ పథకాలు, ఎటు పోవడమో అర్థం కాని పరిస్థితిలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, దిక్కులు చూస్తున్నారు. నిజానికి, ఎటు వెళ్ళినా వైసీపీ నేతలకు అష్టమ దిక్కే దర్శన మిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా, మూడు రాజధానులు, సంక్షేమ మీటలు, ఏ అంశం మీద ఎన్నికలకు వెళ్ళినా, వైసీపీ ఓటమి ఇప్పటికే ఖారారై పోయిందనే అభిప్రాయం జనంలోకి బలంగా వెళ్ళిపోయింది. నిజానికి, ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా చాలా సమయమే వుంది.
అయినా, ప్రజలు మాత్రం ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారు. ప్రస్తుతం రాష్ట్రం ఎదుర్కుంటున్న కష్టాల నుంచి బయట పడాలంటే, ఒకే ఒక్క మార్గం, ఒక్క ఛాన్స్ ముఖ్యమంత్రిని ఒక్క ఛాన్స్ తోనే ఇంటికి పంపేయడమే అనే నిర్ణయానికి వచ్చారు. ఈ విషయంలో ఏ ఒక్కరికీ ఎలాంటి అనుమానం లేదు. నిజానికి ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి కూడా నిజం ఏమిటో తెలుసు. అయితే, కళ్ళు మూసుకుని పాలు తాగే పిల్లి తనను ఎవరూ చూడడం లేదు అనుకున్నట్లుగా, ముఖ్యమంత్రి ఒక విధమైన భ్రమల్లో ఉన్నారు. ఓ వంక రాష్ట్రానికి అమరావతి ఒకటే రాజధాని అంటూ రైతులు మహాపాదయాత్ర చేస్తుంటే, జగన్ రెడ్డి ప్రభుత్వం మూడు రాజధానుల అంశాన్ని మళ్ళీ మరో మారు తెర మీదకు తెచ్చింది.
గురువారం(సెప్టెంబర్15) నుంచి మొదలైన శాసన సభ వర్షాకాల సమావేశాల్లోనే మూడు రాజధానుల బిల్లును మళ్ళీ ప్రవేశ పెడతామని, మంత్రులు ఒకరి వెంట ఒకరు బింకాలుపోతున్నారు. సవాళ్ళు విసురుతున్నారు. అయితే, ప్రతిపక్ష టీడీపీ అధ్యక్షుడు చద్రబాబు నాయుడు, అసెంబ్లీని రద్దు చేసి మూడు రాజధానులకు ప్రజామోదం పొందాలని చేసిన సవాలు స్వీకరించేందుకు మాత్రం అధికార పార్టీకి ధైర్యం సరిపోవడం లేదు. నిజానికి గత ఎన్నికల్లో వైసీపీ మూడు రాజదానుల అంశాన్ని ఎక్కడా ప్రస్తావించ లేదు. అంతే కాదు, అమరావతే రాజధానిగా ఉంటుందని వైసీపీ ఎన్నికల పత్రంలో పేర్కొంది. ఆమేరకు రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చింది.
అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత వికేంద్రీకరణ పేరిట మూడు రాజధానుల అంశాన్ని తెర మీదకు తెచ్చింది.నిజంగానే జగన్ రెడ్డి ప్రభుత్వం మూడు రాజధానులకే కట్టుబడి ఉంటే చంద్రబాబు నాయుడు సూచించిన విధంగా, అసెంబ్లీని రద్దు చేసి ప్రజా తీర్పు కోరడమే సమంజమని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు,అయితే, బింకాలు పోతున్న మంత్రులు మాత్రం, ఆ ఒక్కటీ అడక్కు అన్నట్లుగా, అసలు విషయం తప్పింది ఇతర విషయాలు అన్నీ మాట్లాడుతున్నారు. మంత్రి ఆర్కే రోజా అయితే, ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే మూడు రాజధానుల బిల్లు పెడతామని చెప్పారు. సరే, గత ఐదారు నెలలుగా వైసీపే నేతలంతా అదే మాట చెపుతున్నారు. కానీ, చిత్రంగా మంత్రి రోజా,ఈ అంశంపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పంలో రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని డిమాండ్ చేశారు. ప్రజలుకు మూడు రాజధానులు కావాలో లేదో అప్పుడు అర్ధమవుతుందని అన్నారు. నిజానికి రాష్ట్ర ప్రజల అభిప్రాయం తెలియాలంటే, ఒక కుప్పంలోనూ, ఒక పులివెందులలోనో కాకుండా,అసెంబ్లీ రద్దు చేసి మళ్ళీ ఎన్నికలకు వెళ్ళాలని చంద్రబాబు నాయుడు, తెలుగు దేశం పార్టీ మాత్రమే, కాదు అన్ని రాజకీయ పార్టీలు కోరుతున్నాయి, సామాన్య ప్రజలు కూడా అదే అడుగుతున్నారు. కోరుకుంటున్నారు. అయితే, ఆ ధైర్యం లేకనే, వైసీపీ మంత్రులు అసలు సమస్యను డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారని పరిశీలకులు అంటున్నారు.
అదొకటి అలా ఉంటే, కొద్ది కాలం క్రితం వరకు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సహా వైసీపీ నేతలంతా సంక్షేమ పథకాలే తమను మరో మారు అధికార పీఠం ఎక్కిస్తాయనే భ్రమల్లో ఉన్నారు. అయితే ‘గడప గడపకు ...’ కార్యక్రమంతో ఆ భ్రమలు చాలా వరకు తొలిగి పోయాయని, రాజకీయ పరిశీలకులు,అధికార పార్టీ నాయకులు కూడా భావిస్తున్నారు.
నిజానికి, ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి కూడా తత్త్వం బోధ పడిందని, అందుకే ఆయన ఈ మధ్య మంత్రులు, ఎమ్మెల్యేలపై చిర్రు బుర్రులాడు తున్నారని అంటున్నారు. ఈ నేపధ్యంలోనే, ముఖ్యమంత్రి ప్రజల దృష్టిని అసలు సమస్య నుంచి తప్పించేందుకే, మరో మారు మూడు.. బిల్లును తెరపైకి తెచ్చారని. ఈ సమావేశాల్లో అసలు బిల్లు రాక పోయినా ఆశ్చర్య పోనవసరం లేదని అంటున్నారు. మరోవంక కేంద్ర మంత్రి నారాయణ స్వామి, అసెంబ్లీ ఎక్కడుంటే అదే రాజధానని కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రం నుంచి చాలా పనులకు అనుమతులు పొంది.. 40 శాతం పూర్తయ్యాక కాదనడానికి వీల్లేదని తెలిపారు.
పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల మధ్య అమరావతి అభివృద్ధి చెందిందని చెప్పారు. రాష్ట్ర రాజధానిని రాజకీయ పార్టీలు నిర్ణయించలేవని నారాయణస్వామి వ్యాఖ్యానించారు. ఒక వేళ ముఖ్యమంత్రి ప్రస్టేజికి పోయి మళ్ళీ బిల్లు తెచ్చినా, పాత కథే పునరావృతం అవుతుంది రాజకీయ విశ్లేషకులు, న్యాయ నిపుణులు భావిస్తున్నారు. అది మొక్కుబడి తంతుగానే మిగులుతుందని అంటున్నారు