తెలంగాణ సచివాలయానికి అంబేడ్కర్ పేరు.. కేసీఆర్ వేగంతో డిఫెన్స్ లో మోడీ
posted on Sep 16, 2022 6:53AM
ఢిల్లీలో కేంద్రం నిర్మిస్తున్న కొత్త పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని తెలంగాణలో డిమాండ్ ఎక్కువగా వినిపిస్తోంది. ఇటీవలి కాలంలో పలు పార్టీలతో పాటు గద్దర్ వంటి ప్రముఖులు కూడా అన్ని పార్టీల నేతలను కలిసి పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని కోరారు. ఇదే డిమాండ్‌తో తెలంగాణ అసెంబ్లీలో ప్రభుత్వం తీర్మానాన్ని కూడా ఆమోదించింది. అయితే కేసీఆర్ అంతటితో ఆగకుండా కేంద్రాన్ని, మోడీనీ మరింత ఇరుకున పెట్టి.. వారిపై ఒత్తిడి పెంచేందుకు తాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న తెలంగాణ సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరు పెట్టాలని నిర్ణయించారు.ఇలా నిర్ణయించడం, అలా ఉత్తర్వులు ఇచ్చేయడం అనూహ్య వేగంతో జరిగిపోయాయి. తెలంగాణ సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడం తెలంగాణ ప్రజలకు గర్వకారణమని సీఎం కేసీఆర్ ఉద్ఘాటించారు.. అంతే కాదు ఢిల్లీలోని సెంట్రల్ విస్టాకు కూడా అంబేడ్కర్ పేరు పెట్టాలని మరోసారి డిమాండ్ చేశారు.
అంతే కాదు తెలంగాణ చూపిన బాటలోనే నూతన పార్లమెంటు భవనానికి తెలంగాణ ప్రభుత్వం డిమాండును పరిగణలోకి తీసుకుని అంబేద్కర్ పేరును పెట్టాలని కేంద్రానికి లేఖ రాయనున్నట్లు చెప్పారు. కొత్త సచివాలయానికి అంబేడ్కర్ పేరు పెట్టాలన్న డిమాండ్ ఇప్పటి వరకూ పెద్దగా రాలేదు. దానిపై ఎలాంటి చర్చా కూడా జరిగింది లేదు. అయితే నూతన పార్లమెంటు భవనానికి అంబేడ్కర్ పేరు పెట్టాలన్న డిమాండ్ నేపథ్యంలో కేసీఆర్ వ్యూహాత్మకంగా తెలంగాణ సర్కార్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న రాష్ట్ర సచివాలయానికి అంబేడ్కర్ పేరు పెడుతున్నట్లుగా ప్రకటించి బీజేపీపై ఒత్తిడి పెంచేశారు. రాజ్యాంగ నిర్మాతను బీజేపీ గౌరవించాలంటే సెంట్రల్ విస్టాకు అంబేద్కర్ పేరు పెట్టాల్సిందేనని.. లేకపోతే అవమానించినట్లేనన్న వాదన టీఆర్ఎస్ ఇప్పుడు తెరపైకి తీసుకువస్తుందనడంలో సందేహం లేదు. తెలంగాణ సచివాలయానికి అంబేడ్కర్ పేరు పెట్టాలన్నప్రభుత్వ నిర్ణయానికి సంబంధించి చర్యలు తీసుకోవాలని సీఎస్ కు కేసీఆర్ ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన ఒక ప్రకటనలో తెలంగాణ రాష్ట్ర కేంద్ర పరిపాలనా సముదాయ భవనమైన సెక్రటేరియట్ కు భారత సామాజిక దార్శనికుడు మహామేధావి డా. బిఆర్ .అంబేద్కర్ పేరు పెట్టడం తెలంగాణ ప్రజలందరికీ గర్వకారణం.
ఈ నిర్ణయం భారతదేశానికే ఆదర్శం. భారత ప్రజలందరికీ అన్ని రంగాల్లో సమాన గౌరవం దక్కాలనే అంబేద్కర్ మహాశయుని తాత్వికతను తెలంగాణ ప్రభుత్వం అందిపుచ్చుకుని ముందుకు సాగుతున్నది. సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో సబ్బండ వర్గాలను సమున్నత స్థాయిలో నిలుపుతూ కొనసాగిస్తున్న స్వయం పాలన, రాష్ట్రం ఏర్పాటయిన అనతి కాలంలోనే దేశానికి ఆదర్శంగా నిలవడం వెనక డా. బిఆర్ అంబేద్కర్ మహాశయుని ఆశయాలు ఇమిడి ఉన్నాయి.
డా. బిఆర్ అంబేద్కర్ దార్శనికతతో రాజ్యాంగంలో ఆర్టికల్ 3 పొందుపరచడం ద్వారా మాత్రమే తెలంగాణ నేడు ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటయ్యింది. ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళా వర్గాలతో పాటు పేదలైన అగ్రకులాల ప్రజలకు కూడా మానవీయ పాలన అందిస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డా. బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ స్పూర్తిని అమలు చేస్తున్నది.అంబేద్కర్ మహానుభావుడు కలలుగన్న భారతదేశంలో భిన్నత్వంతో కూడిన ప్రత్యేక ప్రజాస్వామిక లక్షణం ఉన్నది. ఫెడరల్ స్పూర్తి ని అమలు చేయడం ద్వారా మాత్రమే అన్ని వర్గాలకు సమాన హక్కులు అవకాశాలు కల్పించబడుతాయనే అంబేద్కర్ స్పూర్తి మమ్మల్ని నడిపిస్తున్నది. భారత దేశ ప్రజలు కుల, మత, లింగ, ప్రాంతాల వివక్ష లేకుండా అన్ని వర్గాలు సమానంగా గౌరవించబడి, అందరికీ సమాన అవకాశాలు కల్పించబడడమే నిజమైన భారతీయత. ఆనాడే నిజ భారతం ఆవిష్కృతమౌతుంది. అందుకోసం మా కృషి కొనసాగుతది. అన్ని రంగాల్లో దార్శనికతతో ముందుకుపోతూ, అనతి కాలంలోనే దేశానికి ఆదర్శంగా నిలిచిన తెలంగాణ రాష్ట్రం, అంబేద్కర్ మహాశయుని పేరును రాష్ట్ర సెక్రటేరియట్ కు పెట్టడం ద్వారా మరోసారి దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నది.
భారత నూతన పార్లమెంటు భవనానికి కూడా డా. అంబేద్కర్ పేరును పెట్టాలని ఏదో ఆషామాషీకి కోరుకున్నది కాదు. భారత దేశ గౌరవం మరింతగా ఇనుమడించబడాలంటే, భారత సామాజిక తాత్వికుడు రాజ్యాంగ నిర్మాత పేరును మించిన పేరు లేదనే విషయాన్ని ఇటీవలే అసెంబ్లీ సాక్షిగా ప్రకటించుకున్నాం. అందుకు సంబంధించిన తీర్మానాన్ని కూడా తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానించింది కూడా. ఇదే విషయమై నేను భారత ప్రధానికి త్వరలో స్వయంగా లేఖ కూడా రాస్తాను. తెలంగాణ ప్రభుత్వం డిమాండును పరిగణలోకి తీసుకుని నూతనంగా నిర్మిస్తున్న భారత పార్లమెంటు భవనానికి డా. బిఆర్ .అంబేద్కర్ పేరును పెట్టాలని నీను మరోసారి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను.'' అని పేర్కొన్నారు. తెలంగాణ సెక్రటేరియెట్ కు అంబేడ్కర్ పేరు పెట్టాలని కేసీఆర్ నిర్ణయం ఆయన రాజకీయ ప్రత్యర్థులను నిరుత్తరులను చేసిందనే చెప్పవచ్చు. ఇప్పుడు నిర్ణయం కేంద్రం చేతుల్లో ఉంది. అన్ని వర్గాల నుంచీ నూతన పార్లమెంటుకు అంబేడ్కర్ పేరు పెట్టాలన్న డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉంది.
ఆ డిమాండ్ కు తలొగ్గి కేంద్రం నూతన పార్లమంటు భవనానికి అంబేడ్కర్ పేరు పెడితే.. కేసీఆర్ ఒత్తడి కారణంగానే కేంద్రం దిగి వచ్చిందని అంతా అంటారు. అలా కాకుండా నూతన పార్లమెంటు భవనానికి అంబేడ్కర్ పేరు పెట్టేందుకు కేంద్రం ముందుకు రాకపోయినా..కేసీఆర్ చేయగలిగింది మోడీ చేయలేకపోయారన్న విమర్శలను ఎదుర్కొనవలసి వస్తుంది. చీటికీ మాటికీ, తెలంగాణ సర్కార్ ప్రతి నిర్ణయంపైనా విమర్శలతో విరుచుకుపడే తెలంగాణ బీజేపీ నేతలకు కూడా ఇకపై ఏ విమర్శ చేసినా ముందు పార్లమెంటు భవనానికి అంబేడ్కర్ పేరు పెట్టి ఆ తరువాత మాట్లాడండి అంటూ తెరాస నేతలు గట్టిగా ఎదురు దాడి చేసే అవకాశం లభించినట్లైంది.అలాగే కేసీఆర్ సచివాలయానికి అంబేడ్కర్ పేరు పెట్టాలని తీసుకున్న నిర్ణయంతో దేశ వ్యాప్తంగా దళిత బాంధవుడి గుర్తింపు వచ్చే అవకాశం లభించింది. ఈ ఇమేజ్ తో ఆయన జాతీయ రాజకీయ ప్రవేశానికి ఒక విధంగా మార్గం సుగమం చేసుకున్నారని కూడా భావించవచ్చు.