ఏపీలో పారని బీజేపీ పాచికలు కేంద్రంతో జగన్ బంధమే కారణమా?
posted on Sep 16, 2022 8:29AM
దక్షిణాదిలో పాగా వేయాలన్న బీజేపీ ప్రయత్నాలు మిగిలిన దక్షిణాది రాష్ట్రాలలో ఎలా సాగుతున్నా.. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు పడటం లేదు. ఏపీలో బీజేపీకి ఆదరణ నానాటికీ తీసికట్టు నాగంభోట్లు అన్నట్లుగా దిగజారిపోతున్నది. ఇందుకు కారణం అధికార వైసీపీ, బీజేపీల మధ్య రహస్య ఒప్పందాలు, పొత్తులు ఉన్నాయన్న భావన ప్రజలలో గట్టిగా ఏర్పడటమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన తరువాత జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ, తెలుగుదేశం పార్టీలు పొత్తు పెట్టుకుని ఎన్నికలలో పోటీ చేశాయి. అయితే పునర్విభజన సమయంలో ఏపీ ప్రయోజనాల పరిరక్షణ కోసం పార్లమెంటులో బీజేపీ ప్రయత్నించిందన్న భావన ఉండటంతో తెలుగుదేశం పార్టీతో పొత్తును ఏపీ ప్రజ హర్షించింది. ఆదరించింది. దాంతో ఏపీలో బీజేపీకి ఓ నాలుగు అసెంబ్లీ స్థానాలు దక్కాయి. అయితే ఆ తరువాత ఐదేళ్లూ విభజన చట్టం ప్రకారం ఏపీకి రావలసిన ప్రయోజనాలకు మోడీ సర్కార్ గండి కొట్టిందన్నభావన ప్రజలలో గట్టిగా కలిగింది. ప్రత్యేక హోదా, పోలవరం నిధులు, విశాఖ రైల్వే జోన్ ఇలా ఒకటి అనేమిటి, విభజన సందర్భంగా ఏపీకి ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటీ నెరవేరని పరిస్థితిపై ప్రజలు బీజేపీ పట్ల తీవ్ర ఆగ్రహంతో ఉండటంతో 2019 ఎన్నికలలో బీజేపీకి అసెంబ్లీలో స్థానం లేకుండా పోయింది. ఇక వైసీపీ అధినేత జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ మూడేళ్లలో ఏపీ ప్రయోజనాల విషయంలో ఆయన కేంద్రాన్ని కోరింది లేదు.. కేంద్రం పట్టించుకున్నది లేదు.ఏపీలో జగన్ సర్కార్ కు ప్రజాదరణ వేగంగా తగ్గిపోవడాన్ని గమనించిన బీజేపీ.. రాష్ట్రంలో తన పట్టు పెంచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శల బాణాలు ఎక్కు పెట్టడం ప్రారంభించింది. అయితే ఈ వ్యవహారమంతా నువ్వు కొట్టినట్టు చేయి నేను ఏడ్చినట్లు చేస్తాను అన్న చందంగా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ బీజేపీ జగన్ ప్రభుత్వంపై పోరాడి ప్రజల్లో పలుకుబడి పంచుకోవాలని చూస్తుంటే.. కేంద్రం మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని విధాలుగా అండగా నిలుస్తూ వస్తోంది. ఆంద్రప్రదేశ్ బీజేపీ ఇటీవల యువ సంఘర్షణ యాత్రలను నిర్వహించింది. ప్రజాపోరు పేరుతో ఐదు వేల సభలు ఏర్పాటు చేసిప్రజలలో ఆదరణ పెంచుకోవాలని నిర్ణయించింది. కానీ బీజేపీ యాత్రలు పర్యటనలు.. ప్రసంగాలు, విమర్శలను ఏపీ జనం ఇసుమంతైనా పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. జగన్ సర్కార్ కు కేంద్రంలో మోడీ ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుంటే.. ఇక్కడి బీజేపీ నేతలు విమర్శిస్తున్నాం, పోరాడుతున్నాం అంటే చేస్తున్న విన్యాసాలను ప్రజలు విశ్వసించకపోవడమే ఏపీలో బీజేపీని జనం పట్టించుకోకపోవడానికి కారణంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
బీజేపీ యేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలలో అక్కడి ప్రభుత్వాలను కేంద్రం తన అధికారాలను ఉపయోగించి ఎలా ఇబ్బందుల పాలు చేస్తున్నదో కళ్ల ముందు ప్రత్యక్షంగా కనిపిస్తున్న నేపథ్యంలో ఒక్క ఏపీకి మాత్రమే కేంద్రం అన్ని రకాలుగా సహకరించడమే..ఇందుకు కారణం. అసలు ఏపీలో ఉన్నది బీజేపీయేతర ప్రభుత్వం కాదా అన్న అనుమానం కలిగేలా కేంద్రం నుంచి సహకారం అందుతోందన్న విమర్శలు విపక్షం నుంచే కాదు..సామాన్య జనం నుంచి కూడా వినవస్తున్నాయి. జగన్ హయాంలో అభివృద్ధి అడుగంటిపోయినా, అన్ని వర్గాలలో అసంతృప్తి ప్రబలుతున్నా..ఆర్థిక అరాచకత్వం పరాకాష్టకు చేరినా కేంద్రం నుంచి మాత్రం ఆయనకు సంపూర్ణ సహకారం అందడం పట్ల జనబాహుల్యంలో ఆగ్రహం వ్యక్తమౌతోందని అంటున్నారు.
అందుకే ఏపీలో బీజేపీ ఏ కార్యక్రమం చేపట్టినా ప్రజలు పట్టించుకోవడం లేదని విశ్లేషిస్తున్నారు. బీజేపీ అమరావతి యాత్రలో జనం ఆ పార్టీ నేతలను నిలదీయడాన్ని ఇందుకు ఉదాహరణగా చెబుతున్నారు. కేంద్రంలోని మోడీ సర్కార్ ఇక్కడి వైసీపీ సర్కార్ కు అన్ని విధాలుగా సహకరిస్తున్నదన్న భావన కారణంగానే ఇక్కడి జగన్ సర్కార్ పై ఉన్న వ్యతిరేకతే బీజేపీపై కూడా వ్యక్తమౌతోందని పరిశీలకులు అంటగున్నారు. ఈ పరిస్థితి మారాలంటే.. జగన్ సర్కార్ నిబంధనల ఉల్లంఘధనపై కేంద్రం చర్యలకు ఉపక్రమించడం ఒక్కటే మార్గమని పరిశీలకులే కాదు, బీజేపీ ఏపీ నేతలు కూడా అంటున్నారు.
నిబంధనలను తుంగలో తొక్కి చేసిన అప్పుల లెక్కలను బయటపెట్టాలని ఏపీ సర్కార్ ను ఆదేశించకుండా, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐకి అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తూ.. సీబీఐ అధికారులపైనే ఎదురు కేసులు పెట్టి దర్యాప్తు ముందుకు సాగకుండా చేస్తున్నా పట్టించుకోకుండా కేంద్రం చోద్యం చూడడాన్ని జనం ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వంపై ఏపీ బీజేపీ విమర్శలతో విరుచుకుపడడాన్ని రాజకీయ డ్రామాగా జనం భావిస్తున్నారు. అందుకే ఏపీలో బీజేపీ నేతలు జగన్ సర్కార్ పై చేస్తున్న విమర్శలకు, ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా చేపడుతున్న ఆందోళనలకు ప్రజలు స్పందించడం లేదు. పట్టించుకోవడం లేదు. ఆ కారణంగానే దక్షిణాది రాష్ట్రాలలో పాగా వేయాలన్న బీజేపీ పాచికలు ఏపీలో పారడం లేదు.