బీహార్ సీఎం నితీష్ కు..మోడీషా జోడీ మరో ఝలక్
ఈ ఇంటికి ఆ ఇల్లు ఎంత దూరమో, ఆ ఇంటికి ఆ ఇల్లు అంటే దూరం,ఇప్పుడు మోడీ షా జోడీ రాజకీయాలు కూడా అంతే. నువ్వు నాతో మంచిగా ఉంటే నేను నీతో మంచిగా ఉంటా, కాదని నువ్వు కయ్యానికి కాలు దువ్వితే, నేను కత్తులు తీస్తా.. ఇదీ మోడీ షా జోడీ రాజకీయం. అవును, చాలా మంది విపక్ష నేతలు, విశ్లేక్షకులు ఆరోపించే విధంగా అటల్జీ అద్వానీ జోడీ బీజేపీ సారధులుగా ఉన్న రోజులు వేరు,ఇప్పుడున్నబీజేపీ వేరు. ఇప్పటి దాకా ఒక లెక్క ఇప్పుడు వేరే లెక్క. ఇందులో దాపరిమూ లేదు. దాచుకునేదీ లేదు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు కూడా అదే మాట అంటున్నారు. ఒకప్పుడు బీజేపీ విభిన్నమైన పార్టీ, మడికట్టుకున్న పార్టీ, నిజాయతీకి నిలబడి ఒక్క ఓటు తేడాతో ప్రభుత్వాన్ని జార విడుచుకున్న పార్టీ, అని గొప్పలు చెప్పుకున్న, పార్టీ నాయకులు. కార్యకర్తలు ఎవరూ కూడా ఇప్పడు అలాంటి విశేషణాల జోలికి వెళ్లడం లేదు. కాలర్లు ఎగరేయడం లేదు.
నువ్వు గిచ్చితే నేను గిల్లుతా, నువ్వు గోకితే నేను బరుకుతా అనే ధోరణికి పార్టీ శ్రేణులు చేరుకున్నాయి. అయితే, ప్రతిపక్ష పార్టీలు మాత్రం ఇంకా, మోడీ షా బీజేపీని అటల్జీ, అద్వానీ బీజేపీ అనే భ్రమల్లో ఉన్నారు, లేదంటే, అలా ఉండాలని కోరుకుంటున్నారు. కానీ, అది ముగిసిన అధ్యాయం. బీజేపీ విభిన్న పార్టీ కాదు. కొద్ది నెలల క్రితం మహారాష్ట్రలో ఏమి జరిగిందో చూశాం.మూడేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కమల దళంతో కలిసి పోటీ చేసిన శివసేన, ఫలితాలు వెలువడిన తర్వాత, ముఖ్యమంత్రి పీఠం ఆశించి, కమలానికి కటీఫ్ చెప్పి,కాంగ్రెస్,ఎన్సీపీలతో జట్టుకట్టింది. ముఖ్యమంత్రి పీఠం దక్కించుకుంది.
అయితే, ఇదే పరిస్థితి ఆటల్జీ అద్వానీల రోజుల్లో వస్తే, ఏమి జరిగేదో ఏమో కానీ, మోడీ షా జోడి మాత్రం, మాజీ మిత్ర పక్షం అని అయినా చూడకుండా, శివసేనలో చిచ్చుపెట్టింది. కొంత ఆలస్యం అయితే అయిందేమో కానీ, చివరకు శివసేనను చీల్చి, ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేని గద్దె దించింది. అదలా ఉంటే, ఇప్పుడు బీహారులోనూ బీజేపీతో కలిసి పోటీ చేసి, కమల దళంతో కయ్యానికి కాలు దువ్వి విడిపోయిన జేడీయు అధినేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు కూడా మోడీ షా జోడీ పొగ పెట్టడం స్టార్ట్ చేసింది.
ఆఫ్కోర్స్, ఆర్జేడీ, కాంగ్రెస్ తో జట్టు కట్టిన నితీష్ కుమార్ సర్కార్ కు ఇప్పటికిప్పుడు వచ్చిన ప్రమాదం లేక పోవచ్చును, కానీ, మోడీషా జోడీ ఆట అయితే మాత్రం ఆట ఆరంభించేసింది. తమతో మైత్రీ బంధం తెంచుకున్న నేపధ్యంలో, మోడీషా జోడీ, జేడీయూకు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తూ షాక్ ట్రీట్మెంట్ స్టార్ చేసింది. అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్ రాష్ట్రాలలో జేడీయు ఎమ్మెల్యేలు మొత్తానికి మొత్తంగా బీజేపీ గూటికి చేరారు. 2019 అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏడుగురు జేడీయూ ఎమ్మెల్యేలు విజయం సాధించగా వారందరూ ఆ పార్టీకి గుడ్ బై చెప్పి కాషాయ కండువాలు కప్పుకున్నారు.అలాగే, మణిపూర్ లో జేడీయూకు ఆరుగురు ఎమ్మెల్యేలు ఉండగా, ఐదుగురు బీజేపీలోకి ఫిరాయించారు. అంతే కాదు, చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలనే, సూత్రాన్ని పాటిస్తూ, మోడీషా జోడీ ఎమ్మెల్యేలు, ఎంపీలనే కాదు, స్థానిక సంస్థల సభ్యులనూ వదలడం లేదు.
డయ్యూ డామన్ ప్రాంతంలో జేడీయూకు 17 మంది పంచాయతీ సభ్యులుండగా వారిలో 15 మంది కాషాయ కండువాలు కప్పుకున్నారు. మరో వైపు డయ్యూ డామన్ జేడీయూ నేతలు కూడా బీజేపీ తీర్థం స్వీకరించారు. బీజేపీతో మైత్రిబంధాన్ని తెంచుకున్న నితీష్ కుమార్ అవినీతి పార్టీ ఆర్జేడీతో కలిశారని, దానికి వ్యతిరేకంగానే తాము బీజేపీలో చేరుతున్నట్లు డయ్యూడామన్ జేడీయూ నేతలు ప్రకటించారు. నిజానికి, బీజీపీ గడచిన ఎనిమిది సంవత్సరాలలో ఎనిమిది తొమ్మిది రాష్టాలలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను కూల్చి బీజేపీ ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకుందని విపక్షాలు, ముఖ్యంగా కేసేఆర్ ఆరోపిస్తున్నాయి.
అందులో కొంత నిజం లేక పోలేదు. బీజేపీ ప్రభుత్వాలను కూలిస్తే, కేసీఆర్ అదే ఎనిమిదేళ్ళలో, టీడీపీ, వైసీపీ, సిపిఐ, కాంగ్రెస్ ఇంకా ఇతర పార్టీల టికెట్ పై గెలిచిన ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎంతమందిని, తమ పార్టీలో చేర్చుకున్నారో లెక్కలేదు. రాజీకీయ పునరేకీకరణ పేరున ఒక్క బీజేపీ, మిత్ర పక్షం ఎంఐఎం మినాహా, మిగిలిన అన్ని పార్టీల ప్రజా ప్రతినిధులను కారెక్కించి ఆ పార్టీలను నిర్వీర్యం చేశారు. ఒక్క కేసీఆర్, తెరాస అనే కాదు, కాంగ్రెస్ మొదలు అన్ని జాతీయ, ప్రాంతీయ పార్టీలు ఫిరాయింపులకు పాల్పడుతూనే ఉన్నాయి. సో .. ఇప్పడు బీజేపీ ని తప్పు పట్టాలంటే ... ముందుగా రాయి విసిరేది ఎవరు? ఆ అర్హత ఎవరికుంది?