అమరావతి నా వల్ల కాదు.. అసెంబ్లీ సాక్షిగా చేతులెత్తేసిన జగన్
posted on Sep 16, 2022 9:01AM
ముఖ్యమంత్రి జగన్ అమరావతి నిర్మాణం తన వల్ల కాదని చేతులెత్తేశారు. కేవలం పదివేల కోట్ల రూపాయలతో విశాఖను ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చేయవచ్చని మూడేళ్ల తరువాత కనిపెట్టిన ఆయన అమరావతి అభివృద్ధి చేయాలంటే వందేళ్లు పడుతుందని చెప్పారు. పాలనా వికేంద్రీకరణపై అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చలో మాట్లాడిన జగన్ అమరావతి కట్టాలంటే లక్షల కోట్లు అవసరమంటూ పాత పాటనే పల్లవించారు.
అంత డబ్బు లేదని బేలగా చెప్పారు. ఏపీ బీద రాష్ట్రం అని, రాష్ట్రంలో 80శాతం మంది జనం తెల్ల రేషన్ కార్డుదారులేననీ జగన్ చెప్పారు. ఇంత పేద రాష్ట్రానికి రాజధాని అవసరమేముందన్న అర్ధం వచ్చేలా ఆయన ప్రసంగం సాగింది. అమరావతిని నిర్వీర్యం చేయడానికి అధికారం చేపట్టిన మూడేళ్లలో జగన్ చేయని ప్రయత్నం లేదు. మూడు రాజధానులంటూ మొదలు పెట్టి అమరావతిలో అభివృద్ధి పనులను నిలిపివేశారు. తన కేబినెట్ మంత్రుల చేత అది ఒక శ్మసానం అంటూ వ్యాఖ్యలు చేయించారు. వరద వస్తే మునిగిపోతుందని ప్రచారం చేయించారు. అమరావతి రైతుల ఆందోళనను పట్టించుకోలేదు. ఇప్పుడు మూడేళ్ల తరువాత అమరావతి భూముల విషయంలో జగన్ నమ్మశక్యం కాని లెక్కలు చెప్పారు. అమరావతిలో ఉన్న భూములు విలువ లేనివని సూత్రీకరించి ప్రజలను నమ్మించాలని ప్రయత్నించారు.
మూడేళ్ల పాటు అమరావతి అభివృద్ధిని నిర్వీర్యం చేసి, అమరావతిని స్మశానంగా అభివర్ణించి.. ఇప్పుడు ఆ భూములను అమ్మకానికి పెట్టి ఎవరూ కొనడం లేదు కనుక అవి విలువలేనివని సూత్రీకరించడానికి జగన్ అసెంబ్లీ సాక్షిగా ప్రయత్నించారు. అసెంబ్లీ సాక్షిగా జగన్ ఈ మూడేళ్లలో గ్రామ, వార్డు సచివాలయాలు వినా తాను సాధించినదేమీ లేదని అంగీకరించేశారు. అంతకు మించి ఏపీకి ఇంకేం అభివృద్ధి కావాలి అన్న చందంగా ఆయన ప్రసంగం సాగింది. మొత్తం మీద అసెంబ్లీ సాక్షిగా రాజధాని నిర్మాణం తన వల్ల కాదని చేతులెత్తేశారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధికీ కట్టుబడి ఉన్నానని చెప్పిన జగన్ అందు కోసం ఈ మూడేళ్లలో తాను చేసిందేమిటో చెప్పలేకపోయారు.
అన్నిటికీ మించి తన ప్రసంగంలోని డొల్ల తనాన్ని తెలుగుదేశం సభ్యులు సభలోనే ఎత్తి చూపుతారన్న అనుమానమో, భయమో కానీ, జగన్ ప్రసంగం ప్రారంభించే సమయానికి విపక్ష సభ్యులను సభ నుంచి సస్పెండ్ అయిన తరువాతనే ఆయన మైక్ అందుకున్నారు. టీడీపీ సభ్యులు ఉన్నప్పుడు సభ సజావుగానే వైసీపీ సభ్యుల ప్రసంగాలు, వాటికి తెలుగుదేశం కౌంటర్లు ఇలా సభ ఎలాంటి అవాంతరాలూ లేకుండానే జరిగింది. అయితే జగన్ ప్రసంగించే సమయంలో ఆయన ప్రసంగానికి తెలుగుదేశం సభ్యులు కౌంటర్ ఇవ్వకూడదనో, లేక వారి ప్రశ్నలకు తాను సమాధానం ఇచ్చుకోలేనో జగన్ వారిని సభ నుంచి బయటకు పంపిన తరువాతే మాట్లాడటం మొదలు పెట్టారు.