ఎందుకీ మౌనం.. షర్మిల విమర్శలపై తెరాస సైలెన్స్ కు కారణమేమిటి?
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి, కుమార్తె, అవశేష ఆంధ్ర ప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల తెలంగాణలో వైఎస్సార్ టీపీ పార్టీ స్థాపించి సంవత్సరం దాటింది. గత సంవత్సరం (2021) జులై 8 న, ఆమె పార్టీని స్థాపించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు, ఆమె రాజకీయాల్లో కొంత క్రియాశీలంగానే ఉన్నారు. అయినా ఇంకా పార్టీకి ఒక స్వరూపం, స్వభావం అంటూ ఏదీ ఏర్పడలేదు. నిజానికి, ఆమె పార్టీలో ఇతర నాయకులు ఎవరన్నా ఉన్నారో లేదో కూడా తెలియదు. ఒక విధంగా షర్మిల సింగిల్ విమెన్ ఆర్మీగానే పార్టీని నడుపుతున్నారు.
షర్మిలకు రాజకీయాలు కొత్త కాదు. రాజశేఖర రెడ్డి కుమార్తేగానే కాదు, జగన్ రెడ్డి సోదరిగానూ, ఆమె రాజకీయ ఆటు పోట్లను రుచి చూశారు. రాజశేఖర రెడ్డి ఉన్నంతవరకు ప్రత్యక్ష రాజకీయాల్లో కనిపించక పోయినా, ఆయన మరణం తర్వాత, మరీ ముఖ్యంగా జగన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి వైసీపీ, స్థాపించిన తర్వాత షర్మిల పార్టీ వ్యవహరాల్లో చురుకైన పాత్రను పోషించారు. నిజానికి ఈ రోజు ఏపీలో వైసీపీ అధికారంలో ఉందంటే అందుకు కొంతవరకు షర్మిల కుడా కారణం. జగన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల్లో జైలుకు వెళ్ళిన సందర్భంలో అంతవరకు ఆయన సాగిస్తున్న పాదయాత్రను షర్మిల కొనసాగించారు. జగనన్న వదిలిన బాణం అంటూ దూసుకు పోయారు. ఒక విధంగా జగన్ రెడ్డి జైల్లో ఉన్న 16 నెలల కాలంలో వైసీపీని విజయమ్మ చేదోడుగా షర్మిల బతికించారు.
అయితే, ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చి, జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఏమైందో ఏమో కానీ, అన్నా చెల్లీ మధ్య దూరం పెరిగింది. నిజానికి అన్నాచెల్లీ మధ్యనే కాదు, తల్లీ కొడుకు మధ్య కూడా దూరం పెరిగింది. ఈ నేపధ్యంలోనే షర్మిల నిరీక్షించినంత కాలం నిరీక్షించి, ఇక లాభం లేదని అనుకున్నారో ఏమో కానీ, చివరకు జగన్ రెడ్డితో రక్త బంధాన్ని కాకపోయినా, రాజకీయ బంధాన్ని తెంచుకున్నారు. పుట్టింటి నుంచి మెట్టినింటికి చేరి, తెలంగాణలో, వైఎస్సార్ టీపీ ( వైఎస్సార్ తెలంగాణ పార్టీ) స్థాపించారు.
అయితే ఆమె ఏపీలో కాకుండా తెలంగాణలో పార్టీ ఎందుకు పెట్టారు ? అన్న జగన్ రెడ్డితో ఆస్తి తగవో, రాజకీయ వివాదమో ఏదైనా ఉంటే,ఆయన్ని రాజకీయంగా ఎదుర్కోవాలని అనుకుంటే, ఆమె పార్టీ పెట్ట వలసింది, అన్నతో పోరాడ వలసింది, ఏపీలో కదా? తెలంగాణ రాజకీయాలకు పూర్తిగా గుడ్ బై చెప్పిన తెలంగాణలో పార్టీ పెట్టడంలో ఆమె ఉద్దేశం ఏమిటి? ఇలాంటి ప్రశ్నలు అప్పుడూ ఇప్పుడు కూడా అక్కడక్కడా వినిపిస్తూనే ఉన్నాయి. అలాగే, ఆమె తెలంగాణలో పార్టీ పెట్టడం వెనక,ఎ వరెవరిదో ప్రమేయం, ఏవేవో వ్యూహాలు ఉన్నాయని అనేక కథనాలు కూడా మీడియాలో వినిపించాయి. నిజానిజాలు ఎలా ఉన్నప్పటికీ ఆమె పార్టీ వెనక అంతర్జాతీయ క్రైస్తవ సంస్థలు మొదలు తెరాస, బీజేపీ పార్టీల వరకు ఎవరి హస్తమో ఉందని, అసలు జగన్ రెడ్డే, ఆమె వెనక ఉన్నారనే ప్రచారం కూడా జరిగింది, ఇప్పటికీ జరుగుతోంది.
సరే, అదంతా ఒకెత్తు అయితే, తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానంటూ బయలు దేరిన షర్మిల రాష్ట్రంలో అంచెలంచెలుగా పాదయాత్ర చేస్తున్నారు. ఇప్పటి వరకు ఆమె అలా మూడు విడతల్లో కలిపి 2000 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేశారు. ఇంకా కొనసాగిస్తున్నారు. అయితే, ఆమె పాద యాత్ర చేయడం ఒకెత్తు అయితే, పాద యాత్ర పొడుగునా ఆమె తెరాస ప్రభుత్వం పై కత్తులు దూస్తున్నారు. శూలాల్లా గుచ్చుకునే పదునైన బాణాలు సంధిస్తున్నారు. ముఖ్యమత్రి కేసీఆర్,మంత్రి కేటీఆర్ వీళ్ళు వాళ్ళని కాదు, మంత్రులు తెరాస నాయకులు ఎవరినీ వదిలి పెట్ట కుండా, అందరినీ టార్గెట్ చేస్తున్నారు. వ్యక్తీ గత విమర్శలూ గుప్పిస్తున్నారు.
అయితే చిత్రం ఏమిటంటే, దేశ ప్రధాని, రాష్ట్ర గవర్నర్ సహా తమకు ప్రత్యర్ధులు అనుకున్న ప్రతి ఒక్కరినీ, పొట్టు పొట్టున ఎండగట్టే తెరాస నాయకులు, ఆమె ఎవరని ఎంత దూషించినా దుర్భాషలాడినా పెదవి విప్పడం లేదు. చివరకు ముఖ్యమంత్రి కేసేఆర్ ని దూషించినా తెరాస నాయకులు ఎవరూ ఆమె విమర్శలకు సమాధానం కూడా ఇవ్వడం లేదు. కొద్ది రోజుల క్రితం మంత్రి నిరంజన రెడ్డి నియోజకవర్గం వనపర్తికి వెళ్లి మరీ, మత్రిని, ముఖ్యమంత్రిని కలిపి, చాలా తీవ్రమైన విమర్శలు చేశారు.ఆ ఇద్దరిదీ మందు బంధమని, ఒకరు పోసే వారు ఒకరు తాగేవారు, అంటూ తీవ్ర ఆరోపణ చేశారు.గతంలో మంత్రి తనను ఉద్దేశించి ‘మంగళవారం మరదలు’ అంటూ చేసిన వ్యాఖ్యలకు, అప్పుడే ఆయన క్షమాపణలు చెప్పినా, వదలకుండా ‘ఎవడ్రా మరదలు, చెప్పు దెబ్బలు తింటావ్’ అంటూ ఘాటుగా మండిపడ్డారు.అయినా, మంత్రి సహా తెరాస నాయకులు ఆ స్థాయిలో రీయాక్ట్ కాలేదు. అందుకే అందరినీ ఎండగట్టే కేసీఆర్, కీటీఆర్ సహా తెరాస నాయకులు ఒక్క షర్మిల విషయంలో మాత్రమే ఎందుకు, ‘మర్యాద’ పాటిస్తున్నారు? అంటే, షర్మిల వలన తెరాసకు వచ్చే నష్టం ఏమీ ఉండదు.
ఆమెకు ఓట్లే తప్ప సీట్లు వచ్చే అవకాశం లేదు. ఒక వేళ ఒకటో రెండో సీట్లు వచ్చినా, గతంలో జగనన్న పార్టీ వైసీపీ టికెట్ పై ఖమ్మం జిల్లానుంచి గెలిచిన ఒక ఎంపీ, ఒకరో, ఇద్దరో ఎమ్మెల్ల్యేలకు గులాబీ కండువా కప్పినట్లే ఆ ఒకరిద్దరిని కుడా తమ గూటికి తెచ్చుకోగాలమనే ధైర్యం కావచ్చును, ఆమె విమర్శలను అంతగా పట్టిచుకోవడం లేదని అంటున్నారు. అలాగే, ఆమెకు వచ్చే ఓట్లు కూడా, తెరాస వ్యతిరేక ఓట్లే. అంటే ప్రతిపక్ష ఓటును షర్మిల చీల్చి పరోక్షంగా తెరాసకే మేలు చేస్తారు. అందుకే., ఆమె తిట్లను, విమర్శలను తెరాస నాయకులు దీవెనలుగా తీసుకుంటున్నారని, అంటున్నారు. ఎంతవరకు నిజమో ఏమో కానీ, ఆమె పాదయాత్రకు స్పాన్సర్లను స్పాన్సర్ చేసింది కూడా .. తెరాస నాయకులే అని,అంటున్నారు.