తెలంగాణ భారత్ లో లేదా?
తెలంగాణ ఏ దేశంలో ఉంది? .. ఇదేం ప్రశ్న ... అనుకోవచ్చును. కానీ, (విమోచనమో, విలీనమో పేరు ఏదైనా) తెలంగాణ ప్రాంత ప్రజలు స్వాతంత్రం పొంది 75 సంవత్సరాలు నిండిన తర్వాత, తొలి సారిగా, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్న వేళ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరికి వారు, ఎవరి దారిన వారు వేడుకలను జరుపుకున్న తీరును చూస్తే, ఎవరికైనా, ఇదే అనుమానం వస్తుంది. రావాలి కూడా. కేంద్రంలో, రాష్ట్రంలో వేర్వేరు పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పొరపొచ్చాలు, మాట పట్టింపులు, తూతూ ..మై మై విమర్శలు సహజం . కానీ, జాతీయ వేడుకల విషయాలోనూ గిల్లి కజ్జాలు పెట్టుకునే ధోరణి, చూస్తే, తెలంగాణ దేశంగా భావిస్తున్నారా అనే అనుమానం కలగడం కూడా అంతే సహజం అంటున్నారు.
నిజానికి, నిజాం నవాబు అకృత్య పాలన అంతమై 75 ఏళ్ళు పూర్తయ్యాయి. అయినా ఇంకా ఆ బానిస మనస్తత్వం నుంచి పాలకులు బయటకు రాలేదు. అందుకే, ఉమ్మడి రాష్టంలో రాష్ట్రాన్ని పాలించిన పాలకులు, నిజాం నవాబ్ భారత తొలి హోం మంత్రి సర్దార్ వల్లభభాయి పటేల్ ముందు తలవంచి లొంగిపోయిన సెప్టెంబర్ 17 న స్వాతంత్ర జెండాను సగౌరవంగా ఎగరేసే సాహాసంచేయలేక పోయారు. ఉమ్మడి రాష్ట్ర పాలకుల దుర్నీతిని ఎండగట్టి, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన/ విలీన దినోత్సవాని ఘనంగా నిర్వహిస్తామని మాటిచ్చి అధికారంలోకి వచ్చిన తెరాస పాలకులు,, ఎనిమిదేళ్ళు, ఆ ఉసే ఎత్తలేదు. ఉద్యనేతగా గర్జించిన కేసీఆర్, ముఖ్యమంత్రిగా ఎందుకు పిల్లి కూతలు కూశారు? ఎవరికి భయపడి దాసోహం అన్నారు? ఐదు వేల మంది ప్రాణాలొడ్డి ప్రసాదించిన. ‘తెలంగాణ స్వాతంత్ర ‘ దినాన్ని, జరిపే సాహసం ఎందుకు చేయలేక పోయారు? అవును, ఉద్యమ నేతగా గర్జించిన కేసీఆర్, ఈ ఎనిమిదేళ్ళు ఎందుకు తెలంగాణ స్వాతంత్ర దినాన్ని, ఎందుకు విస్మరించారో, ఎవరికీ భయపడి నోరు మెదపలేదో, వేరే చెప్పనక్కరలేదు. అది అందరికీ తెలిసిన విషయమే.
అయితే ఇప్పుడు అది కాదు ప్రశ్న ... ఇన్నేళ్ళకు అయినా, కేంద్ర ప్రభుత్వం కదలికతో రాష్ట్ర ప్రభుత్వం కూడా, జాతీయ సమైక్యత పేరున, తెలంగాణ స్వాతంత్ర దినాన్ని జరుపుకోవడం గుడ్డిలో మెల్ల అన్నట్లు కొంతలో కొంత మేలు. అయితే, అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన వేడుకల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యహరించిన తీరు, ముఖ్యమంత్రి కేసీఆర్, తెలంగాణ రాష్ట్రం భారత దేశంలో అంతర్భాగం కాదనే భావనతో ఉన్నారా? అనే అనుమానాలకు తావిచ్చే విధంగా ఉందని, అనుకోవాల్సి వస్తుందని అంటున్నారు.
కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన తెలంగాణ విమోచన వేడుకల్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. రాష్ట్రంలో నిర్వహించే కేంద్ర ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన కేంద్ర హోం మంత్రిని, ప్రోటోకాల్ నిబంధనల ప్రకారం ముఖ్యమంత్రి కాదంటే మరో మంత్రి రిసీవ్ చేకోవాలి, కానీ, రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎవరూ కేంద్ర్ర మంత్రిని రిసీవ్ చేసుకోలేదు. నిజానికి కేంద్ర ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని ప్రకటించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అందుకు పోటీగా, సమాంతరంగా మరో కార్యక్రమాన్ని నిర్వహించడం, ముఖ్యంత్రి ప్రతి రోజు ప్రవచించే, ఫెడరల్ స్పూర్తికే కాదు, ప్రజాస్వామ్య స్పూర్తికి విరుద్ధం. ఇంకా కొంచెం గట్టిగా రాజ్యంగం పట్ల అపచారం. ముఖ్యంగా జాతీయ స్పూర్తికి ప్రతీకగా నిలిచే స్వతంత్ర దినోత్సవం, గానతంత్ర దినోత్సవం వంటి స్పూర్తి దాయక కార్యక్రమాల విషయంలో ఇలాటి,పోకడలు ఎ విధంగానూ సమర్ధనీయం కాదని విజ్ఞులు భావిస్తున్నారు,
అదొకటి అలా ఉంటే, సికింద్రాబాద్ పరేడ్’ గ్రౌండ్’లో జరిగింది, బీజేపీ కార్యక్రమం కాదు, కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం, కేంద్ర హోం మంత్రి మాత్రమే కాదు, కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా సహా, అనేక మంది కేంద్ర ప్రభుత్వ అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. కానీ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపే సహా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఎవరు అటు వైపు కన్నెత్తి చూడలేదు. ర్రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిర్వహించిన కార్యక్రమంలో మాత్రం సీఎస్,డీజీపీనే కాదు, ఇతర అధికారులు కూడా పాల్గొన్నారు.ఇది ఒక విధంగా, రాజకీయ పరిభాషలో చెప్పాలంటే,రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ విధులను బహిష్కరింఛి నట్లే అవుతుందని అధికారులు భావిస్తున్నారు. రాజకీయ పరిబాషను పక్కన పెట్టి, అధికారిక పరిభాషలో చెప్పాలంటే, ‘ అధికారిక విధులకు గైర్హాజర్’ (డుమ్మా కొట్టడం) అంటారు. అంతే కాదు, కేంద్ర హోం శాఖ కార్యదర్శి రాష్ట్ర ప్రభుత్వ అధికారులపై చర్యలు తీసుకున్నా తీసుకోవచ్చని అధికార వర్గాలు భావిస్తున్నాయి.
అదలా ఉంటే, ముఖ్యమంత్రి కేసీఆర్, నిజాం నవాబు మైండ్ సెట్’ తో వ్యవహరిస్తున్నారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. భారత దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత, నిజాం నవాబు, హైదరాబాద్ సంస్థానాన్ని భారత దేశంలో విలీనం చేసేందుకు ససేమిరా అన్నారు. బ్రిటీష్ పాలకులు పోతూ పోతూ, దేశంలోని 500లకు పైగా సంస్థానాలు భారత దేశంలో కలవాలా వద్దా అనేది వారే, నిర్ణయించుకోవాలని పుల్ల పెట్టి పోయారు. ఇదే సాకుగా తీసుకుని నిజాం నవాబు హైదరాబాద్ సంస్థానాన్నిపాకిస్థాన్’లో కలిపే ప్రయత్నం చేశారు. కాదంటే, స్వతంత్ర రాజ్యంగా కొనసాగుతామని ప్రకటించారు.ఆ నేపధ్యంలోనే సర్దార్ పటేల్, ఆపరేషన్ పోలో నిర్విహించి నాలుగు రోజుల్లో నిజాం నవాబును కాళ్ళ బేరానికి తెచ్చారు. నవాబు రాక్షస పాలనా నుంచి తెలంగాణకు విమోచన కల్పించారు.
ఈ నేపధ్యంలో, తెలంగాణ విమోచన దినోత్సవం విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్, తెరాస ప్రభుత్వం వ్యవహరించిన తీరు గమించిన వారు ముఖ్యమంత్రి కేసేఆర్, నిజాం నవాబు ఆలోచనలు తిరగ తోడుతున్నారా,అనే అనుమానాలను వ్యక్తపరుస్తున్నారు. నిజానికి, ఈ విషయంలోనే కాదు, ఆజాదీ కా అమృత మహోత్సవ్’ కార్యక్రమం విషయంలోనూ తెలంగాణ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా నిర్వహించిన కార్యక్రమాలకు భిన్నంగా, ప్రత్యేకంగా సొంత కార్యక్రమాలు నిర్వహించిన విషయం తెలిసిందే.కేంద్రంలో అధికారంల ఉన్న బీజేపీతో, ప్రధాని నరేంద్ర మోడీతో ముఖ్యమంత్రి కేసీఆర్’కు రాజకీయ విబేధాలు ఉంటే ఉండవచ్చును,
కానీ, కేంద్ర ప్రభుత్వాన్ని బేఖాతర్’ చేస్తానంటే మాత్రం, మళ్ళీ ఆపరేషన్ పోలో వంటి ఆపరేషన్’ అవసరం కావచ్చునని,రాష్ట్ర ప్రభుత్వం ప్రతి విషంలో, ఇదీ ధోరణి కొనసాగిస్తే రాష్ట్రంలో రాష్ట్రపతిటి పాలన అనివార్యమయినా కావచ్చిని అంటున్నారు. ముఖ్యమంత్రి కేసేఆర్ బహుశా అదే కోరుకుంటున్నారు, కావచ్చును అందుకే కేంద్ర రాష్ట్ర సంబంధాల విషయంలో విద్వేషాన్ని రగిల్చే ప్రయత్నం చేస్తున్నారని, తానే రాజు, తానె మంత్రి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు.