ఒకే గూటి పక్షులు..ఒకే రాగం!
posted on Sep 15, 2022 @ 11:59AM
రోడ్డుమీద ఇద్దరు తాగి గొడవపడుతూ ఛండాలంగా తిట్టుకుంటున్నారు...తలుపులు భడాల్న మూసేసి ఎదురింటావిడ ఇంట్లోకి వెళ్లింది. మధ్యాన్నం టీవీ పెట్టగానే ఒక ఛానల్లో ఒక ప్రజాప్రతినిధి తిట్ల దం డకం వస్తోంది...వంటింట్లోంచి పరుగున వచ్చి ఓ క్షణం చూసి, విని.. పొద్దుటవాడే నయం అనుకుం దామె! అదీ మన భాషా ప్రయోగం తాలూకు ఎఫెక్ట్! చదువు, సంస్కారం, భాషా ప్రయోగాలకు బొత్తిగా సంబంధమేలేని కాలంలో ఉన్నామన్నది మన ప్రజాప్రతినిధులే రుజువు చేస్తున్నారు. చాలా రోజుల క్రితమే వైసీపీ మాజీ మంత్రి కోడాలి నాని మాంఛి సంస్కృతంలో ఎవర్నో తిట్టారు. అది తెలుగే అని అర్ధ మయ్యేసరికి చెవులు చిల్లులు పడి, టీవీ కట్టేసి తిండి సయించక ఓ పెద్దామె ఈయనకా ఓటు వేసింది అనుకుందామె. ఇలాంటి వారిని తోబుట్టువులా ఇపుడు వెనకేసుకొచ్చారు మంత్రి రోజా.
రాంగ్‌రూట్‌లో ఎమ్మెల్సీ అయిన లోకేష్, సీఎం జగన్‌పై అవాకులు చెవాకులు పేలారట. అవాకులు చెవాకులకీ పచ్చి బూతులకీ తేడా తెలీని స్థితిలో ఉన్నారు మంత్రి రోజా. అధికారపక్షంవారు, విపక్షాల వారూ ఒకరిపై ఒకరు మాటల యుద్ధం చేయడం మామూలే. ఇది అనాదిగా ఉన్నదే.కానీ కాలక్రమంలో వారి భాషా ప్రయోగంలో సరదాలు పోయి దారుణంగా మారి బయటకనపడితే కొట్టుకు చచ్చేంతగా కొత్త రంగులోకి మారడమే ఎవ్వరూ భరిచలేకపోతున్నారు. ప్రజాప్రతినిధులుగా అసెంబ్లీలోకి అడుగుపెట్టి నపుడు ఆ హుందాతనం, గౌరవం ఇచ్చిపుచ్చుకోవడం పోతున్నాయన్నది ఓటరు బాధ. ఓటు వేసిన తర్వాత మర్చి పోయేలా ప్రజాప్రతినిధులే చేసుకుంటున్నారు.
గతంలో వైసీపీ విపక్ష స్థానంలో ఉండగా, ఆర్.కె.రోజా అసెంబ్లీలో చాలా అసహ్యకర భాషా ప్రయోగమే చేశారు. అది చూసి, వినీ మహిళలే తిట్టుకున్నారు. ఒక మహిళ మంత్రిగా ఇంత ఛండాలమయిన భాష మాట్లాడందేమిటా అని ఆశ్చర్యపోయారు, అసహ్యించుకున్నారు. ఇటీవలి కాలంలో రోడ్డుషోల్లో, మీడియా సమావేశాల్లోనే కొడాలి నాని విపక్షాల మీద ఆయనే మాట్లాడగలిగిన భాషతో విరుచుకుపడటం మరి ఆర్.కె. రోజా వంటివారికి పెద్ద ఘోరంగా ఏమీ అనిపించదు. ఒకే రకంగా ఆలోచించేవారు, ఒకే రకంగా మాట్లాడేవారు ఇలా ఒకే పార్టీలో ఉండడం ఆశ్చర్యకరమే. అందువల్ల, ఒకరి భాష ఒకరికి తప్పకుండా నచ్చుతుంది. వారి అధినేతకీ నచ్చవచ్చు. అంచేత, వారి దృష్టిలో టీవీ ప్రేక్షకులకు, అందునా ఓటరుకి నచ్చాలని ఉండదు. ఉండాలనీ అనుకోరు.