పీకే, నితీష్ తిట్టుకున్నారు ..కలుసు కున్నారు!
posted on Sep 15, 2022 @ 2:10PM
రాజకీయాల్లో ఎప్పుడైనా, ఏదైనా జరగవచ్చును. ఎవరు ఎవరితో అయినా చేతులు కలపవచ్చును. కొత్త కాపురం పెట్టవచ్చును. అలాగే, ఎవరు ఎవరితో అయినా, ఎప్పుడైనా, ఎక్కడైనా తలాక్ చెప్పి విడాకులూ తీసుకోవచ్చును. నిజనికి, నడుస్తున్న చరిత్రలో ఇలాంటి ఉదంతాలు ఒకటీ రెండు కాదు, కోకొల్లలుగా వినిపిస్తున్నాయి.
అలాంటిది, ఇక్కడ ఎన్నికల వ్యూహాలు అమ్మబడున అని బోర్డు పెట్టుకుని రాజకీయ వ్యాపారం చేస్తున్న ప్రశాంత్ కిశోర్ నిన్నటి వరకు బీహారు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ను విమర్శించి, ఈరోజు అదే నితీష్ కుమార్ తో భేటీ ఏమిటి, అంటే. అది అస్సలు .. బాగోదు. ఇక విషయంలోకి వస్తే గత కొంత కాలంగా,ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ బీహారు ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీష్ కుమార్ పై వరస విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా నితీష్ కుమార్ బీజేపీతో తెగతెంపులు చేసుకుని, కాంగ్రెస్, ఆర్జేడీ కూటమితో జట్టు కట్టిన తర్వాత, ప్రశాంత్ కిశోర్, చీటికి మాటికి పొత్తులు మార్చే ఆయన (నితీష్), రేపు మళ్ళీ బీజేపీ పంచన చేరరని గ్యారెంటీ ఏమిటని ప్రశ్నించారు. అంతే కాదు, నితీష్ కుమార్ అసెంబ్లీ ఎన్నికల నాటికి ఖాయంగా మళ్ళీ పొత్తులు మారుస్తారని బల్ల గుద్ది మరీ చెప్పుకొచ్చారు,. కాంగ్రెస్, ఆర్జేడీ కూటమితో నితీష్ వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లే అవకాశం లేదని కూడా స్పష్ట చేశారు. భవిష్యవాణి వినిపించేశారు. అయితే, తమలపాకుతో నీవొకటిస్తే తలుపు చెక్కతో నే రెండిస్తా’ అన్నట్లు నితీష్ కుమార్ కూడా పీకేని ఓ రేంజిలో ఏకి పారేశారు. తన నాయకత్వంలో ప్రభుత్వ పాలన గురించి కానీ, చేసిన పనుల గురించి కానీ ఏబీసీలు కూడా ప్రశాంత్ కిషోర్‌కు తెలియవని నితీష్ విమర్శించారు.
దీనిపై పీకే వెంటనే కౌంటర్ ఇచ్చారు. బహుశా ఆయన ఒక్కరే చదువుకున్న వ్యక్తి కావచ్చని, అందువల్లే తన వంటి వాళ్లకు ఏబీసీలు తెలియవంటున్నారని, బహుశా ఆయనకు ఏ టు జడ్ తెలిసి ఉండొచ్చని అన్నారు. అభివృద్ధి పరంగా అట్టడుగు స్థానంలో బీహార్ ఉందని లెక్కలు చెబుతున్న నీతి ఆయోగ్‌తో ఆయన తెలివితేటలు పంచుకుంటే బాగుంటుందంటూ నితీష్‌పై సెటైర్లు వేశారు. ఇలా ఒకరిపై ఒకరిపై విమర్శలతో విరుచుకు పడిన నితీష్ కుమార్, ప్రశాంత్ కిశోర్ ఇద్దరు కలిసి మాట్లాడుకున్నారు. అది కూడా అనుకోకుండా, యాదృచ్ఛికంగా కాదు. ముందుగా అనుకుని, ముహూర్తం కుదుర్చుకుని మరీ పాట్నాలో భేటి అయ్యారు.
ఇంచు మించుగా రెండు గంటలకు పైగా, ఆ ఇద్దరూ ముచ్చట్లాడుకున్నారు. ఆ ఇద్దరితొ పాటుగా మాజీ ఎంపీ పవన్ వర్మ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నట్టు చెబుతున్నారు. వీరి సమావేశం ఎజెండా కానీ, ఏ అంశాలు ప్రస్తావనకు వచ్చాయనేది కానీ వెంటనే తెలియలేదు. పవన్ వర్మ ఇటు నితీష్ కుమార్ కు అటు ప్రశాంత్ కిశోర్ కు చాలా చాలా సన్నిహితుడని అంటారు. వర్మ పౌరోహిత్యంలోనే ఈ భేటి జరిగి ఉంటుందని అంటున్నారు. నిజానికి, ఒక్కప్పుడు జేడీయూలో కీలక బాధ్యతలు నిర్వహించిన వర్మ, ఆ తర్వాత జేడీయూ, బీజేపీతో జట్టు కట్టడంతో బయటకు వెళ్ళిపోయారు. ఆ తర్వాత తృణమూల్ కాంగ్రెస్ లో చేరారు. అయితే, నితీష్ కుమార్ బీజేపీతో తెగతెంపులు చేసుకున్న తర్వాత, తృణమూల్ కు రాజీనామా చేసి మళ్ళీ, నితేష్ చెంతకు చేరారు. ఇంకా జేడీయూలో చేరారో లేదో తెలియదు కానీ, నితీష్ కుమార్ కు మాత్రం దగ్గరయ్యారు.
ప్రశాంత్ కిషోర్ కూడా గతంలో జేడీయూ తరఫున ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించి 2015 అసెంబ్లీ ఎన్నికల్లో నితీష్ విజయానికి దోహదపడ్డారు. జేడీయూలో చేరి కొద్దికాలం తర్వాత ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇప్పుడు ముగ్గురు మాజీ మిత్రులు కలిసి మంత్రాంగం సాగిస్తున్నారు. అయితే, ఇంతకీ ఆ ముగ్గురు ఏమి చర్చించారు? ఏమి చేయబోతున్నారు? అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్.. అంటున్నారు, అయితే ఇప్పడు బీజేపీ వ్యతిరేక పార్టీలకు చెందిన ఏ ఇద్దరు రాజకీయ నాయకులు కలిసినా వారు మాట్లాడుకుంది ఒకటే ఉంటుంది. 2024 ఎన్నికల్లో బీజేపీని ఓడించడం ఎలా? మోడీని గద్దెదించడం ఎలా? నితీష్, కేసీఆర్ కలిసినా, నితీష్ పీకే కలిసినా, లేదా మరో ఇద్దరు మహా నాయకులు కలిసినా మోడీ చుట్టూనే మంతనాలు సాగుతాయి. అనేది వేరే చెప్పనకరలేదు.