ప్రహసనంగా కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక.. సర్వాధికారాలూ సోనియాకే..!?
posted on Sep 15, 2022 @ 11:09AM
అవున్రా..ఇంతకీ పిల్లడికి ఏం పేరుపెట్టాలనుకుంటున్నావ్? అని అడిగారు ఆ యింటి పెద్దామె. మెగాస్టార్ పేరు.. అన్నాడు మనవడు విసుగ్గా..ఇంతపనీ చేస్తాడని పెద్దామె వంటింట్లోకి వెళ్లి వాళ్ల బంధువులందరికీ ఫోన్ చేసింది.. నా మునిమనవడి పేరు మా ఆయన పేరే ఉండేట్టు ఫోన్ చేసి మరీ చెప్పమని! ఎంతయినా ఇంత పెద్ద కుటుంబాన్ని నిలబెట్టినోడుగదా.. అందుకు అంది పెద్దామె ఆనక. ఈలోగా బంధువర్గం అంతా తలా ఒక పేరు కాయితాల మీద రాసేసుకుని ఫోన్ చేసి చెప్పాలని సిద్ధపడ్డారు. ఇంతలో ఒకరితర్వాత ఒకరికి పెద్దామె ఫోన్ రావడంతో సదరు కాయితాలన్నీ బుట్టదాఖలయ్యాయి. ఇక చేసేదేముంది.. డివివి బిఎస్‌వి..అంటూ పేద్ధపేరు ఆ బుడ్డోడికి పెట్టాల్సి వచ్చింది. దీంతో ఆ పిల్లాడి నామకరణ మహోత్సవం కాస్తా ఒక ప్రహసనంగా మారిపోయింది.
సరిగ్గా అలాగే కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక వ్యవహారం ఒక ప్రహసనంగా సాగుతోంది. పార్టీ అధ్యక్షుడి ఎన్నికకు ఇప్పటికే షెడ్యూల్ విడుదల అయ్యింది. నామినేషన్ల ప్రక్రియ ఈ నెల 24 నుంచి ప్రారంభం కానుంది. పోటీ అనివార్యమైతే వచ్చే నెల 17న జరుగుతుంది. దీంతో గ్రాండ్ ఓల్డ్ పార్టీ అధ్యక్షుడిగా గాంధీ నెహ్రూ కుటుంబం బయటి నుంచి ఎన్నికయ్యేది ఎవరన్న ఆసక్తి కాంగ్రెస్ లోనే కాదు.. దేశ వ్యాప్తంగా అందరిలోనూ నెలకొంది. వాస్తవానికి 2019 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష అధ్యక్ష పదవికి రాజీనామ చేసినప్పటి నుంచి, ఆ పార్టీ అధ్యక్ష స్థానం ఖాళీగానే వుంది. అనివార్య పరిస్థితుల్లో సోనియా గాంధీ తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టినా, ఆమె ఆ బాధ్యతలను తాత్కాలికంగానే, తప్పని సరి పరిస్థితుల్లోనే చేపట్టారు. వయో భారం, మ అనారోగ్యం కారణంగా ఆమె తాత్కాలిక అధ్యక్ష బాధ్యతలను కూడా సంపూర్ణంగా న్యాయం చేయలేకపోయారని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. మరో వంక పార్టీ సీనియర్ నాయకులు ఒకరొకరుగా పార్టీని వదిలి పోతున్నారు.
ఈ పరిస్థితుల్లోనే పార్టీ అధ్యక్ష ఎన్నిక అనివార్యమైంది. అధ్యక్ష ఎన్నికల్లో అర్హులైన పార్టీ సభ్యులు ఎవరైనా పోటీ చేయవచ్చని, పార్టీ అధిష్టానం స్పష్టం చేసింది. అయితే ఎవరు పోటీ చేస్తారు? అసలు ఎవరైనా పోటీ చేస్తారా? అనే విషయంలో ఇంతవరకు అయితే స్పష్టత లేదు. ఓ వంక కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ సహా మరికొందరు పోటీ చేసే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వినవస్తున్నా, అందుకు సంబంధించిన స్పష్టత అయితే లేదు. ఇక గత సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పరాజయానికి బాధ్యత వహిస్తూ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన రాహుల్ మరో సారి పార్టీ అధ్యక్ష పగ్గాలు అందుకోవాలన్న డిమాండ్ పార్టీలో గట్టిగా వినిపిస్తున్నా.. ఆ విషయంలో ఆయన సుముఖత వ్యక్తం చేయడం లేదని అంటున్నారు. అయితే రాహుల్ గాంధీ వ్యవహార శైలిపై మాత్రం పార్టీలోనే కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు.
ముఖ్యంగా జీ23 నేతలు ఈ విషయంలో సీరియస్ గా విమర్శలు చేస్తున్నారు. జీ 23 నేతలకు నాయకత్వం వహించిన గులాం నబీ ఆజాద్ ఇటీవలే పార్టీకి గుడ్ బై చెప్పి సొంత పార్టీ పెట్టుకునే హడావుడిలో ఉన్నారు. ఇప్పటికైనా రాహుల్ గాంధీ తెగించి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించేందుకు, సై అంటే అధ్యక్ష ఎన్నిక అవసరమే ఉండదు. కానీ ఇప్పటికీ అయన దాగుడు మూతలు ఆడుతూనే ఉన్నారు. తాజాగా, భారత్ జోడో యాత్రలో ఉన్న రాహుల్ గాంధీ విలేకరుల సమవేశంలో మాట్లాడుతూ... అదే సందిగ్ధత, అదే సస్పెన్స్ కొనసాగించారు. దీంతో అంతటా కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే
కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాల అధ్యక్షులు, ఏఐసీసీ సభ్యులను నామినేట్ చేసే అధికారం తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీకే కట్టబెట్టేలా తీర్మానాలు చేయాలని అన్ని రాష్ట్రాల శాఖలకు పార్టీ అగ్రనాయకత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో పార్టీ అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ అంతా నామమాత్రంగా మారిపోయింది. గాంధీయేతరులకు పార్టీ పగ్గాలు అప్పగించాలని అగ్రనాయకత్వం యోచిస్తోంది. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లోత్ వంటి విధేయులకు పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని భావిస్తోంది. ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీ తదుపరి అధ్యక్షుడిని ప్రకటించే అధికారాన్ని సోనియా గాంధీకి కట్టబెడుతూ రాష్ట్రాల ప్రతినిధులు తీర్మానం చేయడం అంటే.. సోనియాగాంధీ అభీష్టం మేరకు ఆమె ఆశీస్సులు ఉన్న వారే పార్టీ అధ్యక్షపగ్గాలను అందుకుంటారు. పోటీ ఉండదు.
కొత్త అధ్యక్షుని హయాంలో కూడా గాంధీ, నెహ్రూ కుటుంబం ఆధిపత్యం ఇప్పటిలాగే కొనసాగుతుంది. ఆపలేరని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెల 22న విడుదల కానుంది. 24 నుంచి 30 వరకు నామినేషన్లు దాఖలుకు గడువు ఉంది. అక్టోబరు 17న ఎన్నిక జరుగుతుంది. అయితే ఈ నెల 20లోగానే సర్వ అధికారాలనూ తీర్మానాలు చేయాలని అన్ని పీసీసీలకు అగ్రనాయకత్వం ఆదేశించింది.