దివ్య వాణి దారెటు..?
ఏ మాటకు ఆ మాటే చెప్పు కోవాలి, దివ్యవాణి ఓ చక్కని నటి . అందులో అనుమానం లేదు. ఇప్పుడంటే ఏదో అలా తయారయ్యారు కానీ, ఒకనొకప్పుడు ఆమె సన్నగా, నాజుగ్గా ఉండేవారని, సినిమా లోకం ఇప్పటికీ చెప్పుకుంటుంది. రాజేంద్ర ప్రసాద్ తో కలిసి నటించిన పెళ్లి పుస్తకం సినిమా ఇప్పటికీ పాపులర్ మూవీస్ లో ఒకటిగా మిగిలిపోయిందని అంటారు. అయితే,ఆ తర్వాత ఆమె ఎన్ని సినిమాల్లో నటించారు, ఏమిటీ అంటే మాత్రం మనకే కాదు, సినిమా పండితులకు కూడా అంతగా తెలియదు. అయినా, ఒకటి మాత్రం నిజం ఆమె సినిమాల్లో అంతగా రాణించలేదు. ఆమె సినిమా రంగంలో చెల్లని కాసులా మిగిలి పోయారు. అందుకే, సినిమా రంగం వదిలి, రాజకీయ అరంగేట్రం చేశారు.
అయితే, అదేమిటో కానీ, రాజకీయల్లోనూ ఆమె రాణించలేక పోవడమే కాకుండా, నవ్వుల పాలయ్యారు. తెలుగు దేశం పార్టీలో ఉన్నంతవరకు ఆమెకు కొంచెం చాలా ఎక్కువ ప్రాధాన్యతే ఉండేది. 2019 ఎన్నికలకు ముందు, టీడీపీ అధ్వర్యంలో ఢిల్లీలో నిర్వహించిన, ‘ధర్మ పోరాట సభ’ లో ఆమె అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్, ఆనాటి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సిపిఎం నేత సీతారాం ఏచూరి వంటి మహాముహుల సమక్షంలో ప్రసంగించారు. అంటే, టీడీపీ ఆమెకు ఎంత ప్రాధాన్యత ఇచ్చిందో వేరే చెప్పనక్కరలేదు. అలాగే, అనంతర కాలంలోనూ, టీడీపీ ఆమెకు ఏదీ తక్కువచేయలేదు. నిజానికి, ఆమె వలన పార్టీకి పెద్దగా ప్రయోజనం లేక పోయినా, పార్టీ ఆమెకు సముచిత స్థానమే కల్పించింది. అయితే, ఎప్పుడో ఎక్కడో ఆమెకు మాట్లాడేందుకు మైక్ ఇవ్వలేదని.. అవమానాలకు గురి చేశారని ఒక సాకు చూపించి టీడీపీకి గుడ్ బై చెప్పారు.
ఇక అక్కడ మొదలైంది దివ్యవాణి అసలు కథ. నిజానికి, దివ్యవాణికి ఎర వేసింది వైసీపీ... ఆ పార్టీ నాయకుల మాయ మాటలు విని, ఆమె ఉచ్చులో చిక్కుకున్నారు. వైసీపీ నేతల డైరెక్షన్ లో టీడీపీని బద్నాం చేసే ప్రయత్నం చేశారు. అయితే, జగనన్న పార్టీ, ఆమెను పావుగా చేసి ఆడుకున్నంత ఆడుకుని, ఆ పైన హ్యాండ్ ఇచ్చింది. అయితే, తిరిగే కాలు తిట్టే నోరు ఉరుకోవు కదా, అందుకే, ఆమె బీజేపీ తలుపు తట్టారు.
అది కూడా ఏపీలో కాదు, తెలంగాణ బీజేపీ తలుపులు తట్టారు. బీజేపీ చేరికల కమిటీ ఇంచార్జ్ ఈటల రాజేందర్‌తో సమావేశమయ్యారు. బీజేపీలో చేరేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. అయితే ఈటల రాజేందర్ హైకమాండ్‌తో మాట్లాడి చెబుతానని తప్పించుకున్నారు. కానీ, ఆమెకు బీజేపీలో ఎంట్రీ ఉండదని, ఆమె గతంలో ప్రధాని మోడీపై చేసిన వ్యక్తిగత దూషణలు, ఆమె మరిచి పోయినా, బీజేపీ నాయకులు కార్యకర్తలు మరిచి పోలేదని అంటున్నారు. ఆవిధంగా దివ్యవాణి.. రెంటికీ చెడిన రేవడిలా మిగిలిపోయారని అంటున్నారు.