గురివింద అమెరికా!

గురివింద గింజ సామెత చాలామందికి తెలిసే వుంటుంది. ‘‘అబ్భ.. నేనెంత ఎర్రగా వున్నానో’’ అని గురివింద గింజ అనుకుంటూ వుంటుందట. కానీ, తన డాష్ కింద ఏముందో తనకి తెలియదట. అగ్రరాజ్యంలాగా ప్రపంచం మీద ఆధిపత్యం చేయాలని చూసే అమెరికా పరిస్థితి కూడా గురివింద గింజ మాదిరిగానే తయారైంది. తమ దేశంలో తప్ప మిగతా ప్రపంచంలో ఎక్కడా భద్రత వుండదని భావిస్తూ వుంటుంది. అందుకే, అప్పుడప్పుడు వివిధ దేశాలలో వున్న తన పౌరులకు భద్రతపరమైన సూచనలు ఇస్తూ వుంటుంది. ఆ సూచనలు ఎలా వుంటాయంటే, అమెరికా చాలా సేఫెస్ట్ ప్లేస్... మిగతా ప్రపంచం అంతా దారుణాలకు నిలయం అన్నట్టుగా వుంటాయి.

లేటెస్ట్.గా ఇండియాలో వున్న తమ పౌరులకు అమెరికా కొన్ని భద్రతాపరమైన సూచనలు చేసింది. ఇండియాలో ఏయే ప్రాంతాలకు అమెరికా పౌరులు వెళ్ళొద్దో సూచిస్తూ ఒక పెద్ద లిస్టు విడదల చేసింది. ఆ లిస్టుని ఎవడైనా ఎరగని వాడు చూశాడంటే, ఇండియాకి రావడానికి కూడా భయపడిపోతాడు. అమెరికా రిలీజ్ చేసిన లిస్టు ప్రకారం దేశంలోని చాలా రాష్ట్రాలకు అమెరికా పౌరులు వెళ్ళకూడదు. వెళ్ళాల్సివస్తే రాజధానులకు మాత్రమే వెళ్ళాలి. ఈ స్టేటు, ఆ స్టేటు అని కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలనూ అమెరికా తన లిస్టులో పేర్కొంది. కొన్ని రాష్ట్రాలకు వెళ్తే తీవ్రవాదుల సమస్యట, మరికొన్ని రాష్ట్రాల్లో మావోయిస్టు సమస్య వుందట. అదే విధంగా ఈశాన్య రాష్ట్రాల్లో ఎప్పుడూ గొడవలు జరుగుతూ వుంటాయి కాబట్టి అటువైపు వెళ్ళనే వెళ్ళొద్దట... అంత దారుణంగా వుంది ఈ లిస్టు. 

నిజానికి అమెరికా పౌరులు ఇండియాలో ఏ రాష్ట్రానికైనా నిస్సంకోచంగా వెళ్ళవచ్చు.. తమదేశం అమెరికా వెళ్ళడానికే భయపడాలి.. ఆలోచించాలి. ఎందుకంటే, అమెరికాలో గన్ కల్చర్ విపరీతంగా వుంది. ఎవడికి ఎప్పుడు బుద్ధి పుట్టినా, తన జేబులోంచి రివాల్వర్ తీసి ఎవరు కనబడితే వాళ్ళని కాల్చిపారేస్తూ వుంటాడు. మొన్నీమధ్యే మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మీద హత్యాయత్నం కూడా జరిగింది. ప్రపంచంలో కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు వుంటాయేమో.. అమెరికాలో అణువణువునా ఉద్రిక్తమే. జేబులో రివాల్వర్ వున్న ప్రతి ఒక్కడూ ఉగ్రవాదే. అందువల్ల ఇతర దేశాలకు భద్రత విషయంలో సర్టిఫికెట్లు ఇవ్వడం మానుకుని, తమ దేశంలో భద్రత గురించి అమెరికన్లు ఆలోచించుకుంటే మంచిది.