తెలంగాణ తెలుగుదేశం సారథి ఎవరు?

తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎవరు? ఈ ప్రశ్న ఇప్పటి నుంచి కాదు.. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అందరి మనసులను తొలిచేస్తోంది. అప్పటి వరకు తెలుగుదేశం పార్టీ తెలంగాణ అధ్యక్ష పదవిని చాలా లైట్‌గా తీసుకున్నవారి లైమ్‌లైట్ ఈ పదవి మీద పడింది. తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం వచ్చే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిపిస్తూ వుండటంతో ఇలాంటి సమయంలో పార్టీ బాధ్యతలు అందుకునే అదృష్టవంతుడు / అదృష్టవంతురాలు ఎవరు అనే క్వశ్చన్ మార్కు అందరిలోనూ వుంది. ఎవరికికి తోచినట్టుగా వాళ్ళు తమ ఊహల్లో వున్న వ్యక్తి అధ్యక్ష పదవిని చేపడతారని అనుకుంటున్నారు. కానీ, పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మనసులో ఏముంది అనేది ఇంతవరకు బయటకు రాలేదు. తాజాగా శనివారం (10-08-2024) నాడు చంద్రబాబు నాయుడు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కార్యాలయం అయిన ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు రావడంతో మరొక్కసారి పార్టీ అధ్యక్ష పదవి అంశం చర్చనీయాంశంగా మారింది. మరి, ఊహాగానాల్లో ఎవరున్నారు? ఆశావహుల్లో ఎవరున్నారనే అంశంలోకి వెళ్ళేముందు, గతంలోకి కొంత వెళ్ళి రావడం సమంజసం.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ అండ్ గ్యాంగ్ తెలుగుదేశం పార్టీ మీద తమకు సాధ్యమైనంత విషప్రచారం చేశారు. తెలంగాణ అభివృద్ధికి కృషి చేసింది తెలుగుదేశం పార్టీ... తెలంగాణలో బాంచెన్ దొరా సంస్కృతికి చరమగీతం పాడింది తెలుగుదేశం పార్టీ.. తెలంగాణలో బలహీన వర్గాలు రాజకీయాల్లో ముందడుగు వేయడానికి తోడ్పాటు అందించింది తెలుగుదేశం పార్టీ.  అలాంటి తెలుగుదేశం పార్టీ మీద ‘ఆంధ్ర’ ముద్ర వేసింది కేసీఆర్ గ్యాంగ్. ఆ తర్వాత ఎన్నికలలో గెలిచిన కొద్దిమంది తెలుగుదేశం ఎమ్మెల్యేలను తన పార్టీలోకి లాక్కుంది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేశామని సంబరపడింది. తెలంగాణలో తెలుగుదేశం నాయకులు పార్టీ మారిపోయారుగానీ, కార్యకర్తలు మాత్రం తెలుగుదేశం పార్టీని గుండెల్లో పెట్టుకుని పూజిస్తూనే వున్నారు. తెలంగాణ ప్రజల్లో కూడా తెలుగుదేశం పార్టీ అంటే మంచి అభిమానం వుంది. అయితే పరిస్థితుల కారణంగా వారి అభిమానాన్ని బయటకి వ్యక్తం చేసే అవకాశం లేకుండా పోయింది.

అప్పుడు తెలుగుదేశం పార్టీకి ఊహించని ద్రోహం జరిగింది. ఎల్.రమణ అనే ఒక సాధారణ కార్యకర్తని నాయకుడిని చేసి, పార్టీ అధ్యక్షుడిని చేసి గౌరవిస్తే, ఆయన పార్టీ కష్టకాలంలో వున్నప్పుడు ద్రోహం చేసి కేసీఆర్‌తో చేతులు కలిపారు. ఆ తర్వాత కాసాని జ్ఞానేశ్వర్‌ని పార్టీ అధ్యక్ష పీఠం మీద కూర్చోబెట్టారు. ఆయనకు పార్టీని బలోపేతం చేయడం కంటే, ఎప్పడు ఎన్నికలలో పోటీచేద్దామా.. ఎమ్మెల్యే అయిపోదామా.. ఇదే ధ్యాస. తెలుగుదేశం పార్టీని వాడుకుని పదవులు సంపాదించుకుందామనే ధ్యాసే తప్ప, తెలుగుదేశం పార్టీని బలోపేతం చేస్తే పదవులు వాటంతట అవే వస్తాయన్న ఆలోచన ఆయనకు లేదు. మొన్నటి తెలంగాణ ఎన్నికలలో పోటీ చేయకూడదని చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా ప్రకటిస్తే, కాసాని జ్ఞానేశ్వర్‌కి ఎక్కడలేని ఆవేశం వచ్చింది. ఎన్నికలలో పోటీ చేయకపోతే పార్టీలోనే వుండనని చెప్పి ఆయన బంగారం లాంటి, బాధ్యతాయుతమైన అధ్యక్ష పదవిని వదిలి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆయన వేరే పార్టీలో చేరడం, ఎన్నికలలో పోటీ చేయడం, దారుణంగా ఓడిపోవడం.. అవన్నీ మనకి అనవసరం..

ఇలాంటి నేపథ్యంలో ఈసారి పార్టీ అధ్యక్ష స్థానంలో కూర్చునే వ్యక్తి పార్టీని మరింత బలోపేతం చేసే వ్యక్తి అవ్వాలే తప్ప, పార్టీ నెత్తిన ఎక్కి కూర్చునే వ్యక్తం కాకూడదు. పార్టీకి నేనేమి ఇవ్వాలి అని ఆలోచించే వ్యక్తి అవ్వాలే తప్ప.. పార్టీ నాకు ఏమిస్తుంది అని ఎదురుచూసే వ్యక్తి కాకూడదు. అందుకే, ఈసారి చంద్రబాబు నాయుడు తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించే వ్యక్తి విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. 

మరి చంద్రబాబు మనసులో ఏముందోగానీ, ఎవరి ఊహాగానాల్లో వారున్నారు. తెలుగుదేశానికి ద్రోహం చేసి, ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో బొక్కబోర్లా పడివున్న మల్లారెడ్డి పార్టీ అధ్యక్షుడు కాబోతున్నారని కొంతకాలం పుకార్లు షికార్లు చేశాయి. అయితే మల్లారెడ్డి లాంటి ముళ్లకంపని తెచ్చి నెత్తిన పెట్టుకోవడం మంచిది కాదన్న అభిప్రాయం పార్టీలో ఏకగ్రీవంగా వినిపిస్తోంది. 

ఇక అధ్యక్ష పదవికి వినిపిస్తున్న పేర్లను పరిశీలిస్తే, కొంతమంది నారా బ్రహ్మణి పార్టీ అధ్యక్షురాలు కావాలని ముచ్చటపడుతున్నారు. మరికొందరు హరికృష్ణ కుమార్తె సుహాసిని కన్ఫమ్ అని తమకు తెలిసినట్టే చెబుతున్నారు. అలాగే, తెలంగాణలో రాజకీయ ఉద్ధండుడు, ఎలాంటివారినైనా నోరు మూయించగల శక్తి వున్న గోనె ప్రకాశరావు అధ్యక్షుడు కాబోతున్నారన్న ఊహాగానాలు ఈమధ్యకాలంలో బలంగా వినిపిస్తున్నాయి. ఇంకా పొగాకు జయరాం చందర్, అరవింద్ కుమార్ గౌడ్, మాటల తూటాలు పేల్చే నన్నూరి నర్సిరెడ్డి, బక్కని నర్సింహులు, సామ భూపాల్‌రెడ్డి, కాట్రగడ్డ ప్రసూన, భవనం షకీలా రెడ్డి, పద్మావతి, ఆనంద్, తెలుగుదేశం పార్టీ వాయిస్‌ని ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాలో బలంగా వినిపించిన జ్యోత్స, ఏఎస్ రావు పేర్లు కూడా వినిపిస్తున్నాయి. 

ఉన్నది ఒక్క అధ్యక్ష పదవి.. ఇంతమంది ఊహావహులు, ఆశావహులు ఏంటబ్బా అని ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. తెలుగుదేశం పార్టీ నాయకులను తయారుచేసే పార్టీ.. తెలంగాణ తెలుగుదేశంలో పార్టీ అధ్యక్ష పదవికి అర్హులైన వాళ్ళు ఇంతమంది వున్నారు. ఇది చాలా సంతోషించాల్సిన విషయం. మరి ఇంతమంది అర్హులున్నారు.. పార్టీ అధ్యక్షుడయ్యే అదృష్టం ఎవరికి వుందో, అవకాశం ఎవరికి దక్కుతుందో, బాధ్యతలు ఎవరు మోయాల్సి వస్తుందో... మొత్తమ్మీద పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మదిలో ఏముందో.. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సింది ఒక్కటే... అదేమిటో మీకు కూడా తెలుసు.... కాలం!