అబ్దుల్ కలామ్ కంటే జగనే గొప్పా?.. వీళ్లింక మారరా?

వైసీపీ నేత‌ల‌కు, కార్య‌క‌ర్త‌ల‌కు పిచ్చి ప‌రాకాష్ట‌కు చేరింది. ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు ఓటు ద్వారా గ‌ట్టి గుణ‌పాఠం చెప్పినా వారిలో ఇసుమంతైనా మార్పు రాలేదు. ప్ర‌పంచంలో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కంటే గొప్ప‌వారు ఎవ‌రూ ఉండ‌ర‌న్న రీతిలో కొంద‌రు వైసీపీ నేత‌లు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. దీంతో తాజాగా ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం తీసుకున్న కీల‌క నిర్ణ‌యం ప‌ట్ల వారు అభ్యంత‌రం తెలుపుతున్నారు. గత ప్రభుత్వ  హయాంలో విద్యాశాఖ‌లో అమ‌లు చేసిన ప‌థ‌కాల‌కు జ‌గ‌న‌న్న పేరు పెట్టిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం కూట‌మి ప్ర‌భుత్వం ఆ ప‌థ‌కాల పేర్లు మార్చేసింది. కొత్త పేర్లు పెట్టింది. దేశంలో, రాష్ట్రంలో ప‌లు రంగాల్లో గుర్తింపు పొందిన ప్ర‌ముఖుల పేర్ల‌ను ఆ ప‌థ‌కాల‌కు పెడుతూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. కూట‌మి ప్ర‌భుత్వం నిర్ణ‌యంతో ఏపీ ప్ర‌జ‌లు హ‌ర్షాతిరేకాలు వ్య‌క్తం చేస్తున్నారు. కానీ, కొంద‌రు వైసీపీ నేత‌లు మాత్రం ప్ర‌భుత్వ నిర్ణ‌యం ప‌ట్ల అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. దేశంలోని ప‌లు రంగాల్లో గుర్తింపు పొందిన ప్ర‌ముఖుల కంటే మా జ‌గ‌న‌న్నే గొప్ప‌.. మా జ‌గ‌న‌న్న పేరుపై ఉన్న ప‌థ‌కాన్ని ఎందుకు తీసేశారంటూ గగ్గోలు పెడుతున్నారు. మా ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌రువాత మ‌ళ్లీ జ‌గ‌న‌న్న పేరుతో ప‌థ‌కాలు అమ‌లు చేస్తామంటూ   వివిధ ఛాన‌ళ్ల డిబేట్ల‌లో  ఆవేశపడిపోతున్నారు.   వైసీపీ నేత‌ల తీరు పట్ల ప్రజలలో అసహనం వ్యక్తం అవుతోంది. 

వైసీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో విద్యాశాఖ‌లో జ‌గ‌న‌న్న అమ్మఒడి, జ‌గ‌న‌న్న విద్యాకానుక‌, జ‌గ‌న‌న్న గోరుముద్ద‌, మ‌న‌బ‌డి నాడు- నేడు, స్వేచ్ఛ‌, జ‌గ‌న‌న్న ఆణిముత్యాలు వంటి ప‌థ‌కాల‌ను అమ‌లు చేసింది. ప్ర‌స్తుత కూట‌మి ప్ర‌భుత్వం ఆ ప‌థ‌కాల‌కు పేర్ల‌ను మార్పు చేసింది. దేశానికి విశేష సేవ‌లందించిన ప‌లువురు భార‌త‌మాత ముద్ద‌బిడ్డ‌ల పేర్లతో ఆ పథకాలకు నామకరణం చేసింది.  స‌ర్వేప‌ల్లి రాధాకృష్ణ‌న్‌, అబ్దుల్ క‌లాం, డొక్కా సీత‌మ్మ తదితర గొప్పగొప్ప వారి పేర్లను ఆయా పథకాలకు పెట్టింది.   జ‌గ‌న‌న్న అమ్మఒడి పథకానికి త‌ల్లికి వంద‌నంగానూ  , జ‌గ‌న‌న్న విద్యాకానుక‌ పథకానికి స‌ర్వేప‌ల్లి రాధాకృష్ణ‌న్ విద్యార్థి మిత్రగానూ పేర్లు మార్చింది. అలాగే  జగనన్న గోరు ముద్ద పథకాన్ని  డొక్కా సీత‌మ్మ మ‌ధ్యాహ్న బ‌డి భోజ‌నంగా మార్పు చేసింది, మ‌న బ‌డి నాడు- నేడు పథకానికి మ‌న బ‌డి - మ‌న భ‌విష్య‌త్తు గా పేరు మార్చింది. స్వేచ్ఛ పథకం పేరును బాలికా రక్షగా మార్చింది.  జగనన్న ఆణిముల్యాలు పథకం పేరును అబ్దుల్ క‌లాం ప్ర‌తిభ పుర‌స్కారంగా మార్పు చేసింది. ఈ విష‌యాన్ని విద్య, ఐటీ శాఖ‌ల‌ మంత్రి నారా లోకేశ్ ఎక్స్ ద్వారా తెలియ‌జేశారు.

ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్నిప్ర‌జ‌లు స్వాగతిస్తున్నారు. విద్యాశాఖ‌కు సంబంధించిన ప‌థ‌కాల‌కు ప్ర‌ముఖుల పేర్లు పెట్ట‌డం ముదావహం, శుభపరిణామం అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇలా గోప్పవారి పేర్లు ఆయా పథకాలకు పెట్టడం ద్వారా  వారి జీవిత చ‌రిత్ర‌ల గురించి విద్యార్థుల‌కు పూర్తి అవ‌గాహ‌న ఏర్ప‌డుతుంద‌ని విద్యావేత్త‌లు అభిప్రాయ ప‌డుతున్నారు. తెలుగుదేశం కూట‌మి ప్ర‌భుత్వం నిర్ణ‌యం ప‌ట్ల అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల నుంచి హ‌ర్షాతిరేకాలు వ్య‌క్తం అవుతున్నా కొంద‌రు వైసీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేరు తొల‌గించార‌ని తెగ‌బాధ‌ప‌డిపోతున్నారు. అబ్దుల్ క‌లాం, స‌ర్వేప‌ల్లి రాధాకృష్ణ కంటే జ‌గ‌న్ గొప్ప‌వాడు అన్న‌రీతిలో మాట్లాడుతున్నారు. 

విద్యాశాఖ‌లోని ప‌థ‌కాల‌కు పేర్లు మార్పుపై జ‌న‌సేన అధినేత‌, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ సంతోషం వ్య‌క్తం చేశారు. త‌న సంతోషాన్ని ఎక్స్ ద్వారా తెలియ జేశారు. భావి తరాలకు స్ఫూర్తిని అందించే సమాజ సేవకులు, శాస్త్రవేత్తలు, విద్యావేత్తల పేర్లతో ప్రభుత్వ పథకాలను అమలు చేయడం హర్షణీయమని అన్నారు. ప‌థ‌కాల‌కు డా.సర్వేపల్లి రాధాకృష్ణన్, డొక్కా సీతమ్మ, అబ్దుల్ కలాం పేర్లు పెట్ట‌డం ప‌ట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ కు  జనసేనాని అభినందనలు తెలిపారు. గత ప్రభుత్వ పాలనలో అన్ని పథకాలకు ముఖ్యమంత్రి తన పేరే పెట్టుకున్నారు. ఆ దుస్సంప్రదాయానికి మంగళంపాడి విద్యార్థులలో స్ఫూర్తిని కలిగించేలా గొప్పగొప్ప మహానుభావుల పేర్లతో పథకాలు అమలు చేయడం మంచి పరిణామం అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ తో పాటు ప‌లువురు రాజ‌కీయ ప్ర‌ముఖులు చంద్ర‌బాబు, లోకేశ్ నిర్ణ‌యాన్ని ప్ర‌శంసిస్తున్నారు. అయితే ఊరందరిదీ ఒకదాని.. ఉలిపికట్టది ఒక దారి అన్నట్లుగా కొంద‌రు వైసీపీ నేత‌లు మాత్రం ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని త‌ప్పుబ‌డుతున్నారు.  మా జ‌గ‌న‌న్న పేరును ఎందుకు తొల‌గించారంటూ ప్ర‌శ్నిస్తున్నారు. కొంద‌రు వైసీపీ కార్య‌క‌ర్త‌లు ఓ అడుగు ముందుకేసి మ‌ళ్లీ మా ప్ర‌భుత్వ‌మే అధికారంలోకి వ‌స్తుంది. అప్పుడు మ‌ళ్లీ జ‌గ‌న‌న్న పేర్లు పెడ‌తామంటూ చెబుతున్నారు. వైసీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌ల విచిత్ర ప్ర‌వ‌ర్త‌న‌ను జనం చీద‌రించుకుంటున్నారు.