నాగార్జుసాగర్ నిర్మాణానికి నారు, నీరు పోసిందెవరు?
posted on Aug 7, 2024 @ 2:07PM
(శుభకర్ మేడసాని, ఇన్‌పుట్ ఎడిటర్, తెలుగువన్)
నాగార్జున సాగర్ ప్రాజెక్టు రూపకర్త వాసిరెడ్డి రామగోపాలకృష్ణ మహేశ్వర ప్రసాద్ గురించి తెలుసుకోవాలంటే ఆయన కంటే ముందు తరాలకు చెందిన రాజా వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు గురించి తెలుసుకోవాలి! వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు 1761, ఏప్రిల్ 27న జగ్గ భూపతి, అచ్చమాంబ దంపతులకు జన్మించారు. క్రీస్తు శకం 1413 నుండి తీరాంధ్ర ప్రాంతంలో ఒక భాగాన్ని పాలించిన వాసిరెడ్డి వంశానికి చెందినవాడు వేంకటాద్రి నాయుడు. నేడు ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో జగ్గయ్యపేట అనేది తన తండ్రి పేరు జగ్గ భూపతి పేరు మీద నిర్మించిన పట్టణం. ఉమ్మడి గుంటూరు జిల్లాలో కృష్ణా నదికి కుడివైపున ఉన్న అచ్చంపేటను తన తల్లి అచ్చమాంబ పేరు మీద అచ్చంపేటగా నిర్మించాడు. నాటి అమరావతి నగర నిర్మాత కూడా వేంకటాద్రి నాయుడే! తన రాజధాని చింతపల్లి నుండి అమరావతికి మార్చి అమరావతి శివాలయంతో పాటు మొత్తం 108 దేవాలయాలు కట్టించాడు. మంగళగిరి నరసింహ స్వామి గుడి గోపురం కట్టించింది కూడా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడే! ఆ గోపురం దేశంలోనే రెండో అతి పెద్ద గోపురంగా నిలిచింది అని చెబుతారు. అమరావతి అమరలింగేశ్వర స్వామి సేవలో గడుపుతూ 1817, ఆగష్టు 17న శివైక్యం చెందారు.
ఆ రాజవంశానికి చెందిన వాసిరెడ్డి రామగోపాలకృష్ణ మహేశ్వర ప్రసాద్ ఆయనే ముక్త్యాల రాజాగా ప్రసిద్ధి. నాగార్జునసాగర్ కథలో ఆయనే హీరో..! జగ్గయ్యపేట అసెంబ్లీ నియోజకవర్గ నుంచి 1972లో స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు వాసిరెడ్డి రామగోపాలకృష్ణ మహేశ్వర ప్రసాద్ అలియాస్ ముక్త్యాల రాజా. ముక్త్యాల రాజాని ప్రాజెక్టుల ప్రసాద్ అని కూడా పిలిచేవారు. ప్రజలకు శాశ్వితంగా ఉపయోగేపడే పని చేయాలన్న తపనతో తలంపుతో నాగార్జున సాగర్ డాం నిర్మాణానికి ప్రసాద్ అహర్నిశలూ శ్రమించారు. కృష్ణా నదిపై పులిచింతల ప్రాజెక్తు నిర్మాణం ఆలోచన వాసిరెడ్డి ప్రసాద్‌దే కావడం విశేషం. మనం ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో తమిళులతో కలసి వుండగా కృష్ణానది నీటిని తమిళ ప్రాంతానికి తీసుకుపోవడానికి నాటి తమిళ కాంగ్రేస్ నాయకులు ప్రయత్నాలు మొదలు పెట్టారు. అందులో భాగంగా కృష్ణా, పెన్నా నదులను అనుసంధానం చేయడానికి తీవ్ర ప్రయత్నాలు మొదలు పెట్టారు. విషయం తెలుసుకున్న వాసిరెడ్డి మహేశ్వర ప్రసాద్ ఆంధ్రలో తొమ్మిది జిల్లాలలో ప్రతి వూరు తిరిగి నాగార్జునసాగర్ నిర్మాణానికి సంతకాలు సేకరించి కేంద్ర ప్రభుత్వానికి పంపారు.
మాచర్ల నుండి దట్టమయిన అడవుల గుండా నందికొండ వరకు వెళ్ళి! డ్యాంకు అనువైన స్థలం చూశాడు. సొంత డబ్బుతో రిటైరయిన ఇంజినీర్లను ఒక టీంగా తయారు చేసి వారిచేత ప్రాజెక్టుకు కావల్సిన ప్లానులు, డిజైనులు చేయించాడు. కానీ మద్రాసు ప్రభుత్వం ప్రసాద్ ప్రయత్నాలకు అన్నివిధాలుగా అడ్డుపడింది. వాసిరెడ్డి మాత్రం పట్టువదలని విక్రమార్కుడిలా కృష్ణా రైతుల వికాస సంఘం స్థాపించి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చాడు. అప్పుడు ప్రభుత్వం ఖోస్లా కమిటీ ఏర్పాటు చేసింది. కానీ ఆ కమిటీ సభ్యులు అడవులల్లో పడి మేం నందికొండకు చేరుకోలేం! కార్లు కనీసం జీపులో వెళ్ళటానికి అనువైన దారి కూడా లేదు అనే సాకుతో పక్కన పడేశారు. వాళ్ళు అలా చేయడానికి వారిని ఎవరు ప్రభావితం చేసి వుంటారు? తమిళ కాంగ్రెస్ నాయకులు.
మరి నాటి మన సీమ సింహాలు ఏం చేశాయి? ప్రత్యేక తెలుగు రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు అనే మహానీయుడు 56 రోజులు కూడు లేకుండా అమరణ నిరాహార దీక్ష చేసి అమరజీవి అయ్యే వరకు సీమసింహాలు ఏం చేసాయో నాగార్జున సాగర్ ప్రాజెక్టును పక్కన పెట్టినప్పుడు కూడా అదే చేసాయి. పౌరహక్కులు, అందరికీ చదువు, నీరు పారి బీడు భూములు పచ్చటి పంట పొలాలుగా మారిపోతే ప్రజలు బాగుపడిపోతారు. పెత్తందార్ల ఆటలు సాగవు కదా! పచ్చటి పంట పొలంలో పేదలకు వ్యవసాయ కూలిపని దొరికితే వారి పిల్లలు బడికి పోతారు! మరి పెత్తందార్లకు పాలేర్లు దొరకరు. ఒక్కపూట జొన్న రాగి ముద్ద కోసం పెత్తందార్ల వెంట కత్తులు పట్టుకుని ఎవరు నిలబడతారు! అందుకోసం మనకు పోలవరం వద్దు పులిచింతల వద్దు సాగర్ వద్దు ఇదీ అనాటి పెత్తందార్ల కాలకూట వికృత రాజకీయం.
రాజా వాసిరెడ్డి ప్రసాద్ పిచ్చోడు కదా! వేల రూపాయల తన సొంత డబ్బు ఖర్చు పెట్టి ఇరవై ఐదు గ్రామాలనుండి ప్రజలను స్వచ్చంద్ర సామాజిక కార్యక్తర్తలను సమీకరించి వారం రోజులు రాత్రింబగళ్ళు కష్టపడి కార్లు వెళ్ళటానికి వీలుగా దారి ఏర్పాటు చేయించాడు. ఖోస్లా కమిటీ సభ్యులు నందికొండ ప్రదేశం చూసి ప్రాజెక్టు కట్టడానికి ఇంతకన్నా మంచి చోటు వుండదని తేల్చారు . ఢిల్లీ వెళ్లి ఆనాటి ప్రధాని నెహ్రు, పటేల్ వంటి పెద్దలను కలిసి ప్రాజెక్ట్ గొప్పతనం వివరించి, నాగార్జున సాగర్ నిర్మాణంపై ప్రభుత్వ పెద్దల దృష్టి పడేటట్లు చేశారు. ఖోస్లా కమిటీ రిపోర్టును తొక్కిపెట్టాడానికి ఢిల్లీలో ప్రయత్నాలు మొదలైయ్యాయి. వాసిరెడ్డి ప్రసాద్ పలుమార్లు ఢిల్లీ వెళ్ళి ఆచార్య ఎన్.జి.రంగా, మోటూరు హనుమంతరావు, కొత్త రఘురామయ్య లాంటి వారిని ఇతర పార్లమెంటు సభ్యులను కలిసి, ఖోస్లా కమిటీ రిపోర్టు ప్రతులను అందరికి పంచిపెట్టి, ప్లానింగ్ కమిషను సభ్యులందరినీ విసిగించే పనిలో పడ్డాడు. అప్పటి ఆంధ్రప్రదేశ్ గవర్నరు చందూలాల్ త్రివేది ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూను ఖోస్లా కమిటీ రిపోర్టు ఆమోదించమని విజ్ఞప్తి చేశాడు. ఎట్టకేలకు 1954లో నాగార్జునసాగర్ నిర్మాణానికి ఆమోదముద్ర లభించింది. 1955 డిసెంబరు 10వ తేదీ ప్రాజెక్టుకు నాగార్జునసాగర్ శంకుస్థాపన జరిగింది.
ప్రాజెక్టుకు నాగార్జున అని ఎందుకు పెట్టారు.? అక్కినేని నాగేశ్వర్రావు కొడుకు పేరు అని కొందరు అనుకునే ప్రమాదం వుంది. ఒకటి 2వ శతాబ్దాలలో ఇక్ష్వాకు రాజవంశం తూర్పు దక్కన్‌లోని శాతవాహనుల రాజధానిగా ఉన్న నాగార్జునకొండ పురాతన బౌద్ధ క్షేత్రం. త్రవ్వకాల్లో 30 బౌద్ధ విహారాలు, వేల సంవత్సరాల చారిత్రక ప్రాముఖ్యత కలిగిన కళాఖండాలు శాసనాలు లభించాయి. కొన్నింటిని ఇప్పుడు సాగర్ జలాశయం మధ్యలో ఉన్న దీవిగా ఉన్న నాగార్జునకొండకు తరలించారు. మరి కొన్నింటిని సమీపంలోని ప్రధాన భూభాగమైన అనుపు గ్రామానికి తరలించారు. ఇది బౌద్ధ ఆచార్యుడు నాగార్జునుడు నడయాడిన ప్రాంతం. గౌతమి పుత్ర శాతకర్ణికి రాజగురువు ఆచార్య నాగార్జునుడు. ఆయన పేరు మీద నాటి నెహ్రు ప్రభుత్వం నాగార్జున సాగర్ అని పేరు పెట్టింది.
శంకుస్థాపన సమయంలో నెహ్రూ మాట్లాడుతూ ఇటువంటి సాగునీటి ప్రాజెక్టులు భారతదేశానికి ఆధునిక దేవాలయాలు అని వ్యాఖ్యనించారు. పాపం పిచ్చోడు నెహ్రు ఒక భారీ గుడి కట్టి ఈ దేశానికి ఇది చాలు ఇంకేం అవసరం లేదు అని చెప్పకపోవడం అమాయకత్వం కాక మరేమిటి? ఎవరి కావాలండీ ప్రాజెక్టులు, అభివృద్ది ! మనకు మన కులపోడు ముఖ్యం మన మత పోడు ముఖ్యం అదే కదా నడుస్తున్న భారత దేశ చరిత్ర! సరే అసలు విషయానికి వద్దాం. వాసిరెడ్డి ప్రసాద్ యాభై రెండు లక్షల రూపాయలు మాచింగ్ గ్రాంటుగా ప్రాజెక్టు నిర్మాణానికి విరాళం ఇచ్చాడు. 55 వేల ఎకరాలు పాజెక్టు కోసం దానం ఇచ్చాడు . నాటికి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రాతి ఆనకట్ట... నాగార్జున సాగర్ డ్యామ్. ఇంజనీర్ కానూరి లక్ష్మణరావు. కేఎల్ రావ్‌గా ప్రసిద్ది. ఆయన పర్యవేక్షణలో పూర్తిగా స్థానిక పరిజ్ఞానంతో నిర్మించబడిన సాగర్ 1967న 4 ఆగస్టు నాటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ కుడి ఎడమ కాలువలకు రిజర్వాయర్ నీటిని విడుదల చేశారు. రాజా వాసిరెడ్డి రామగోపాలకృష్ణ మహేశ్వర ప్రసాద్ కల సాకారం అయి 57 సంవత్సరాలు పూర్తయింది. ఈ స్క్రిప్ట్ రాసే సమయంలో ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గారు ఫోన్ చేశారు . ఏం చేస్తున్నారు మిత్రమా అని అడిగితే నాగార్జునసాగర్ నిర్మాణం జరిగి నేటికి 57 సంవత్సరాలు రాజు గారు వార్త ప్రిపేర్ చేస్తున్నాను అని చెబితే ! సాగర్ నిర్మాణంలో కమ్మవారి పాత్ర చెప్పొద్దు! నా ఫ్రెండ్ జగన్ రెడ్డికి తెలిస్తే తెలిస్తే సాగర్ కూల్చే ఏర్పాటు చేస్తాడు అని కామెంట్ చేశారు.