బంగ్లాదేశ్‌లో విధ్వంసం వెనుక పాక్.. భారత్‌కు ఎదురుదెబ్బే!
posted on Aug 6, 2024 6:02AM
బంగ్లాదేశ్‌లో విధ్వంసం వెనుక పాకిస్థాన్ కుట్ర ఉందా.. రిజర్వేషన్ల వివాదంపై నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థుల ఆందోళనల్లోకి ప్రతిపక్ష పార్టీనే కాకుండా పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు చేరిపోయారా.. రాడికల్స్, పాకిస్థాన్ అనుకూల ఇస్లామిక్ గ్రూప్స్ విద్యార్థుల రూపంలో ఆందోళనలను డైవర్ట్ చేసి వందలాది మంది చావుకు కారణమయ్యారా.. అంటే అవుననే వాదన బలంగా వినిపిస్తోంది. పాకిస్థాన్ అనుకూల ఉగ్రవాద సంస్థలు రిజర్వేషన్ నిరసనల వెనుక దేశంలో విద్వంసం సృష్టించడంతో శాంతిభద్రతలు అదుపుతప్పాయి. దీంతో బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా దేశం వదిలి పారిపోవాల్సి వచ్చింది. అయితే, బంగ్లాదేశ్‌లో తాజా పరిణామాలు భారత్ కు ఎదురుదెబ్బేనని అంటున్నారు. ఎందుకంటే.. అధికారంలో ఉన్న షేక్ హసీనా ఆధ్వర్యంలోని బంగ్లాదేశ్ అవామీ లీగ్ పార్టీ భారత్ దేశానికి అనుకూలంగా ఉంటూ వస్తున్నది. ఈ కారణంగా పాక్ టెర్రరిస్ట్ సంస్థ ఐఏఎస్ రంగంలోకి దిగి పాకిస్థాన్‌కు అనుకూలంగా ఉండే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ, జమాత్ ప్రభుత్వ ఏర్పాటు కావాలని కుట్రలను అమలు చేసింది. ఇదే సమయంలో తెరపైకి వచ్చిన రిజర్వేషన్ల అంశాన్ని అవకాశంగా మలుచుకుంది. ఇప్పుడు సైనిక పాలన రావడంతో, బీఎన్‌పీ, జమాత్ పార్టీ బంగ్లాదేశ్‌లో అధికారంలోకి రావడానికి అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు. అదే జరిగితే.. పాకిస్థాన్, చైనాతోపాటు బంగ్లాదేశ్ కూడా భారత్ దేశానికి శత్రు దేశంగా, పక్కలో బల్లెంగా మారే అవకాశాలు ఉన్నాయి.
బంగ్లాదేశ్ లో ఈ పరిస్థితి తలెత్తడానికి రిజర్వేషన్ల అంశం కారణం. 1971లో బంగ్లాదేశ్ స్వాతంత్ర్యంకోం పోరాడినవారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 30శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ హసీనా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వివాదాస్పదం అయింది. స్వాతంత్ర్య పోరాటంలో కీలకంగా వ్యవహరించిన అవామీ లీగ్ పార్టీ (హసీనా పార్టీ) మద్దతుదారులకే అది ప్రయోజనం చేకూరుస్తుందనే వాదన మొదలైంది. దీంతో రిజర్వేషన్లు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఆందోళన బాటపట్టారు. రిజర్వేషన్లు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నెలరోజులుగా విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వం ఈ నిరసనలను లైట్‌గా తీసుకోవడంతో అవి దేశం మొత్తం విస్తరించాయి.
ప్రతిపక్ష పార్టీ మద్దతుతో దేశ వ్యాప్తంగా ప్రజలు రోడ్లపైకివచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు ఉధృతం చేశారు. ఈ క్రమంలోనే పాకిస్థాన్ అనుకూల ఉగ్రవాద సంస్థలు రంగంలోకి దిగి నిరసనల మాటున విధ్వంసానికి పాల్పడ్డారు. దీంతో అధికార పార్టీ కార్యకర్తలు, నిరసనకారుల మధ్య ఘర్షణలు తలెత్తాయి. నెల రోజుల ఈ ఘర్షణల్లో దాదాపు 300 మందికి పైగా మరణించారు. ఈ క్రమంలో బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని రిజర్వేషన్లు 30శాతం నుంచి 5శాతంకు తగ్గించాలని ప్రభుత్వానికి సూచించింది. హసీనా ప్రభుత్వంకూడా అందుకు అంగీకరించినప్పటికీ.. నిరసనకారులు శాంతించ లేదు. హసీనా రాజీనామా చేయాలని పట్టుబడుతూ పెద్ద ఎత్తున అల్లర్లకు పాల్పడ్డారు. ఈ తతంగం మొత్తాన్ని వెనకనుండి నడిపించింది పాకిస్థాన్ అనుకూల ఉగ్రవాద సంస్థలేనని అనుమానాలు బలంగా వ్యక్తమౌతున్నాయి.
ప్రధాని హసీనా ఇటీవల మాట్లాడుతూ.. రిజర్వేషన్లకు నిరసనగా ఆందోళనకారుల విధ్వంసం వెనుక ఉగ్రవాదుల ప్రమేయం ఉందని పేర్కొన్నారు కూడా. ఉగ్రవాదులతో కలిసి బంగ్లాదేశ్ ప్రదాన ప్రతిపక్ష నేషనలిస్ట్ పార్టీతో పాటు, ఇటీవల నిషేధానికి గురైన జమాతే ఇస్లామి పార్టీ దేశంలో విధ్వంసానికి కారణమని హసీనాతోపాటు ఆమె పార్టీ ప్రతినిధులు కూడా చెబుతూ వచ్చారు. అయినా, దేశంలో జరుగుతున్న ఆందోళనలు కట్టడి చేయడంలో ప్రభుత్వం విఫలం కావడంతో.. నిరసనకారుల హింసాకాండ మరింత పెచ్చరిల్లింది. ఏకంగా ప్రధాని ఇంటిని ముట్టడించేవరకూ వెళ్లింది. పరిస్థితి చేయి దాటి పోవడంతో చివరకు షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేశారు. తన సోదరి షేక్ రెహానాతో కలసి ఆర్మీ హెలికాప్టర్‌లో దేశం విడిచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు. మొదట భారత్ వచ్చిన ఆమె.. తరువాత లండన్ వెళ్లిపోయారు. ప్రస్తుతం బంగ్లాదేశ్ లో దేశంలో సైనిక పాలన నడుస్తున్నది. ఈ విషయాన్ని ఆర్మీ చీఫ్ జనరల్ వకార్ ఉజ్ జమాన్ అధికారికంగా ప్రకటించారు. తమ దేశంలో సైనిక పాలన ఉంటుందని, త్వరలోనే తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటు కృషి చేస్తామని తెలిపారు.
హసీనా దేశం విడిచి వెళ్లిపోవడంతో ఆమె కుమారుడు సాజీబ్ వాజెద్ జాయ్ స్పందించారు. భద్రతా కారణాల దృష్ట్యా కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకే హసీనా దేశం విడిచినట్లు వెల్లడించారు. తిరిగి ఆమె రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదని చెప్పారు. హసీనా దేశం విడిచి వెళ్లిన తరువాత ప్రధాని అధికారిక నివాసమైన గణభాబన్ ను ఆందోళనకారులు ముట్టడించి విధ్వంసం సృష్టించారు. ఫర్నీచర్ ధ్వంసం చేశారు. బంగ్లా పరిణామాలపై భారత్ నిశితంగా పరిశీలిస్తుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ అత్యవసర భేటీ అయింది. పొరుగుదేశంలో తాజా పరిస్థితులు, స్థానికంగా చేపట్టాల్సిన భద్రతా చర్యలపై సమీక్ష జరిపినట్లు తెలిసింది బంగ్లాదేశ్ లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులతో భారత్ - బంగ్లాదేశ్ మధ్య వాణిజ్యానికి తాత్కాలికంగా బ్రేక్ పడింది. నిత్యావసరాలు మినహా మిగిలిన వాణిజ్యం నిలిచిపోయింది.