లిటిగేషన్ క్వీన్ పూజా ఖేడ్కర్!

తప్పుడు సర్టిఫికెట్లతో ఐఏఎస్ అయి, ఆ తర్వాత సర్వీసులో వుండగా ఓవర్ యాక్షన్ చేసి, ప్రస్తుతం పరారీలో వున్న పూజా ఖేడ్కర్ పెద్ద లిలిగేషన్ క్వీన్ మాదిరిగా వుంది. చట్టంలో వున్న లొసుగులను ఎలా ఉపయోగించుకోవాలి, పై పదవులలో వున్నవారిని ఎలా ప్రభావితం చేయాలనే పాయింట్లలో పూజా ఖేడ్కర్ పీహెచ్‌డీ చేసినట్టుంది. అందుకే వేలికి వేస్తే కాలికి వేసి, కాలికి వేస్తే వేలికి వేసి ఐఏఎస్ అయింది. అనుకున్నది సాధించినప్పటికీ, పద్దతిగా వుండకపోవడంతో అమ్మగారి గుట్టు రట్టయిపోయింది. ఆమె ఐఏఎస్ హోదా రద్దు కావడంతోపాటు భవిష్యత్తులో కూడా ఆమె యూపీఎస్సీ నిర్వహించే పరీక్షలలో హాజరు కావడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. ఇక ఆమెని అరెస్టు చేయడం ఒక్కటే మిగిలి వుంది. అయితే పరారీలో వున్న పూజా ఖేడ్కర్‌ తన లాయర్ల ద్వారా గేమ్ నడిపిస్తోంది. 

తన అభ్యర్థిత్వాన్ని రద్దు చేయడం మీద పూజా ఖేడ్కర్ ఢిల్లీ కోర్టుని ఆశ్రయించింది. ఈ సందర్భంగా ఆమె లాయర్ కోర్టులో వాదన వినిపిస్తూ, ‘‘పూజా ఖేడ్కర్ యూపీఎస్సీ అభ్యర్థిత్వాన్ని రద్దు చేసిన విషయం ఇంతవరకు నా క్లయింట్‌కి తెలవదు. దానికి సంబంధించిన ఉత్తర్వులు నా క్లయింట్‌కి అందలేదు. మీడియా ద్వారా మాత్రమే ఈ విషయం తెలిసింది. తనకు ఉత్తర్వులు అందిన తర్వాత నా క్లయింట్ ట్రైబ్యునల్‌ని ఆశ్రయిస్తుంది’’ అని అన్నాడు.

ఇక్కడే పూజా ఖేడ్కర్ అతి తెలివితేటలు బయటపడుతున్నాయి. ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వుంది. ఆమె ఎక్కడ వుందో తెలియదు. అభ్యర్థిత్వాన్ని రద్దు చేసినట్టు నోటీసులు ఇద్దామంటే ఆమె పత్తాయే లేదు. ఈ లిటిగేషన్ క్వీన్ ఒకపక్క తప్పించుకుని తిరుగుతుంది.. మరో పక్క తనకు నోటీసులు అందలేదని కోర్టుకు చెబుతుంది. పాప తెలివితేటలు మామూలుగా లేవు!