జగన్ వ్యూహం ఇదేనా? కాంగ్రెస్ తో దోస్తీ కవచం అవుతుందా?
posted on Aug 17, 2024 @ 10:11AM
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ అధికారంలో ఉండగా ప్రజాపీడన పాలన సాగించారు. అందుకు ఫలితంగా అధికారం కోల్పోయారు. కనీసం విపక్ష హోదా కూడా దక్కకపోయినా వైసీపీ విధానాలు మాత్రం మారలేదు. జగన్ అదే ప్రజా పీడన పంధాతో అధికారం లేకపోయినా రాష్ట్రా అభివృద్ధిని అడ్డుకోవడానికి తనదైన శైలిలో పావులు కదుపుతున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టవద్దంటూ ప్రముఖ పారిశ్రామిక సంస్థలను ట్యాగ్ చేస్తూ వైసీపీ సోషల్ మీడియా నెగటివ్ క్యాంపెయిన్ నిర్వహిస్తోంది.
ఇక మరో వైపు తన మెడపై వేళాడుతున్న కేసుల నుంచి బయటపడేందుకు జగన్ వ్యూహాలు పన్నుతున్నారు. ముందు చూపుతో జాతీయ స్థాయిలో పావులు కదుపుతున్నారు. ఆయన ఇండియా కూటమి పార్టీలతో టచ్ లోకి వెళ్లడం వెనుక ఉన్నది ఇదే వ్యూహమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి అధ్వానంగా ఉందంటూ ఆయన ఇటీవల ఢిల్లీలో చేపట్టిన ధర్నాకు ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీలైన సమాజ్ వాదీ, తృణమూల్, శివసేనలకు చెందిన నాయకులు హాజరై జగన్ కు మద్దతు పలికారు. ఒక వైపు బీజేపీతో తన రహస్య మైత్రిని కొనసాగిస్తూనే.. మరో వైపు విపక్ష కూటమితో కూడా చేతులు కలిపేందుకు జగన్ చేస్తున్న ప్రయత్నాల వెనుక ఉన్న వ్యూహం ఒక్కటే. రాజకీయంగా అధికారం అన్నది ఇప్పట్లో కనీసం ఆలోచించడానికి కూడా వీల్లేని పరిస్థితి ఉండటంతో కనీసం కేసుల నుంచైనా రక్షణ ఉంటే చాలన్న భావనతో జగన్ జాతీయ స్థాయిలో పావులు కదుపుతున్నారని అంటున్నారు.
దీనికి తోడు బీజేపీకి రాజ్యసభలో బలం లేదు కనుక తన పార్టీ సభ్యుల మద్దతు కోసం ఆ పార్టీ తన విషయంలో అంటే తన కేసుల విషయంలో దూకుడుగా వెళ్లదన్న ధీమా జగన్ లో కనిపిస్తోంది. కొద్ది రోజుల కిందట ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి బీజేపీకి వైసీపీ అవసరం ఉంది అనడం ఇందులో భాగమే. రాజ్యసభలో అవసరమైన ప్రతి సందర్బంలోనూ మద్దతు ఇస్తాం.. అందుకు ప్రతిగా మా అధినాయకుడి కేసుల విషయంలో మీ సహకారం కావాలన్న ప్రతిపాదనే ఉందని పరిశీలకులు అంటున్నారు. తెలుగుదేశం పార్టీకి పార్లమెంటులో 16 మంది ఎంపీలుంటే.. వైసీపీకి15 మంది ఎంపీలు ఉన్నారు. (రాజ్యసభలో 11, లోక్ సభలో 4) మేం ఎక్కడా తక్కువ కాదు అన్న సాయిరెడ్డి వ్యాఖ్యల వెనుక బీజేపీపై ఒత్తిడి తీసుకువచ్చే వ్యూహమే ఉందని చెబుతున్నారు. రాజ్యసభలో ఎన్డీయేకు అవసరమైన బలం లేనందున సహజంగానే వైసీపీకి కలుపుకొని వెళ్లేందుకు బీజేపీ ప్రయత్నిస్తుంది. స్పీకర్ ఎన్నిక సమయంలో బీజేపీ నుంచి వైసీపీకి ఫోన్ రావడానికి కారణం కూడా ఇదే. అయితే ఈ పరిస్థితి ముందు ముందు ఉండే అవకాశం లేదు. ఎందుకంటే వచ్చే నెలలో 12రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. ఆ ఎన్నికలలో బీజేపీ సునాయాసంగా 11 స్థానాలను గెలుచుకుంటుంది. అప్పుడు ఇక కేంద్రంలోని మోడీ సర్కార్ కు జగన్ పార్టీ ఎంపీల అవసరం ఉండదు. ఇక జగన్ క్విడ్ ప్రోకో ప్రతిపాదనలను లెక్క చేయాల్సిన అవసరం ఉండదు.
దీంతో జగన్ ఇక పూర్తిగా కాంగ్రెస్ కూటమితో చెట్టాపట్టాలేసుకుని బీజేపీకి వ్యతిరేకంగా నిలవడం ఒక్కటే మార్గం. తన కేసుల విషయంలో సత్వర విచారణ ఆరంభమైతే కాంగ్రెస్ కూటమిలో భాగస్వామిని కావడం వల్లనే రాజకీయ వేధింపులు అంటూ ఎదురు దాడికి అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఆయన కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్తో భేటీ లో కాంగ్రెస్ హైకమాండ్ తో సంప్రదింపులకు మార్గం సుగమం చేసుకున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే జగన్ వ్యూహాలు సక్సెస్ అవుతాయా లేదా? అన్న సంగతి ముందు ముందు తేలుతుంది. మొత్తం మీద ఏపీలో అధికారం కోల్పోయిన తరువాత తన కేసుల విషయంలో రాజకీయ కవచం లేకపోవడంతో జగన్ ఉక్కిరి బిక్కిరి అవుతున్నారనీ, బయటపడే మార్గం కోసం డిస్పరేట్ గా వెతుకుతున్నారని పరిశీలకులు అంటున్నారు.