నాకు రెస్పెక్ట్ కావాలి మొర్రో!
posted on Aug 1, 2024 @ 4:08PM
(శుభకర్ మేడసాని, ఇన్‌పుట్ ఎడిటర్, తెలుగువన్)
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో తనకు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేలా అసెంబ్లీ కార్యదర్శి, స్పీకర్ కార్యదర్శిని ఆదేశించాలంటూ వైసీపీ శాసనసభా పక్ష నేత వైఎస్ జగన్ దాఖలు చేసిన వ్యాజ్యం విచారణార్హతపై కౌంటర్ వేయాలని శాసన వ్యవహారాలు, న్యాయశాఖ ముఖ్యకార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది. ప్రతిపక్ష నేత హోదా కోసం స్పీకర్‌కి విజ్ఞప్తి చేసినట్లు జగన్ తరఫు సీనియర్ న్యాయవాది చెబుతున్నందున దీనిపై వివరాలు సమర్పించాలంటూ అసెంబ్లీ, స్పీకర్ కార్యదర్శులకు నోటీసులు జారీచేసింది. వ్యాజ్యం విచారణార్హతకు లోబడి ఈ ఉత్తర్వులుంటాయని పేర్కొంది. మరోవైపు వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా ఉన్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు, శాసన వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్‌కు నోటీసులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేస్తూ న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి మంగళవారం ఉత్తర్వులిచ్చారు.
అసెంబ్లీలో ప్రతి పక్ష నేత హోదా ఇచ్చేలా శాసనసభ కార్యదర్శి, స్పీకర్ కార్యదర్శిని ఆదేశించాలంటూ జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పైమంగళవారం జరిగిన విచారణలో ఆయన తరఫున న్యాయవాది ఎస్. శ్రీరామ్ వాదనలు వినిపించారు. ప్రతిపక్ష నేత హోదా పొందేందుకు పిటిషనర్ అర్హుడని చెప్పగా, న్యాయమూర్తి స్పందిస్తూ ఈ దశలో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాల్సిన అవసరం లేనందున, వ్యాజ్యంపై లోతైన విచారణ జరపాల్సి ఉందన్నారు. ప్రతివాదులు కౌంటర్ వేయాలని ఆదేశిస్తామన్నారు. శాసన వ్యవహారాలు, న్యాయశాఖ ముఖ్యకార్యదర్శి తరఫున అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ స్పందిస్తూ, 'అసలు ఈ వ్యాజ్యానికి విచారణార్హతే లేదు. కౌంటర్ వేసేందుకు మాకు సమయమివ్వండి. వ్యాజ్యం లోతుల్లోకి వెళ్లే ముందు విచారణార్హతను తేల్చాలన్నారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు, మంత్రి కేశవ్‌లను వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా చేర్చడం అభ్యంతరకరం' అని వాదించారు. ప్రతిపక్ష నేత హోదాపై నిర్ణయం తీసుకోవాల్సింది ఎవరని న్యాయమూర్తి ప్రశ్నించగా, 'స్పీకర్' అని ఏజీ బదులిచ్చారు. జగన్ తరపు న్యాయవాది శ్రీరామ్ వాదనలు
కొనసాగిస్తూ ప్రతిపక్ష నేత హోదా కల్పించాలని స్పీకర్‌కి వినతిపత్రమిచ్చాం. దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. స్పీకరుకు న్యాయస్థానం నోటీసు ఇవ్వడంపై ఎలాంటి నిషేధం లేదు. మహారాష్ట్రలో స్పీకరుకు సుప్రీం కోర్టు నోటీసు ఇచ్చిన సందర్భముంది. ఈ కేసులోనూ స్పీకర్ కార్యదర్శికి నోటీసు ఇచ్చి మా విజ్ఞప్తిపై ఏ నిర్ణయం తీసుకున్నారో స్పష్టత కోరాల'ని పేర్కొన్నారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయమూర్తి.. స్పీకర్‌కి జగన్ విజ్ఞప్తి చేసినట్లు చెబుతున్నందున ఏం నిర్ణయం తీసుకున్నారో చూద్దామన్నారు. అసెంబ్లీ కార్యదర్శి, స్పీకర్ కార్యదర్శికి నోటీసులు జారీచేశారు.
అయితే ఈ వ్యవహారంలో న్యాయ నిపుణులు ఆశ్చర్యపోతున్నారు. న్యాయవ్యవస్థ తన పరిధి దాటి శాసన వ్యవస్థలోకి ఎలా చొచ్చుకు రాగలుగుతుంది అనేది ప్రశ్న..! అసెంబ్లీకి అధిపతి స్పీకర్. శాసన వ్యవస్థ అనేది ఒక ఇండిపెండెంట్ వ్యవస్థ. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో జ్యూడిషరీ శాసన వ్యవస్థ నిర్ణయాలని తప్పుపడుతుంది అది ఎప్పుడూ... ప్రాథమిక హక్కులకు భంగం కలిగింది అని అనుకున్నప్పుడు. ఇక్కడ ఆ ప్రశ్న ఉత్పన్నం కాలేదు . జగన్ పిటిషన్‌కు అసలు విచారణ అర్హత లేదు అనేది ఏజీ దమ్మాలపాటి వాదన. స్పీకర్ చేయాల్సిన నిర్ణయాన్ని కోర్టే చేసి జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా కల్పించండి అని స్పీకర్ ను ఆదేశిస్తుందా..? ఒకవేళ ఆదేశిస్తే స్పీకర్ ఆ అంశాన్ని పక్కన పెడితే ఏమవుతుంది ? స్పీకర్‌ని హైకోర్టు బోనులోకి పిలిపించి నిల్చోపెడుతుందా? అంటే అది రాజ్యాంగ సంక్షోభం దిశగా అడుగులు పడ్డట్టే లెక్క.
ప్రతిపక్ష నాయకుడు అనేది చట్టబద్ధమైన స్థానం తప్ప 10% రూల్ అనేది చట్టంలో లేదు. భారత పార్లమెంటు సభలలో ప్రతిపక్ష నాయకుడు అనేది ఒక చట్టబద్ధమైన పదవి. ఈ పోస్ట్ పార్లమెంట్ చట్టం, 1977లో ప్రతిపక్ష నాయకుల జీతభత్యాల కోసం ప్రతిపక్షంలో సంఖ్యాపరంగా అతిపెద్ద పార్టీ నాయకుడిని ప్రతిపక్ష నాయకుడు హోదాగా నిర్వచించింది. ఆ గుర్తింపు స్పీకర్ లేదా చైర్మన్ ద్వారా గుర్తించబడుతుంది. మోడీ మొదటిసారి ప్రధాని అయిన 2014 నుంచి 2019 వరకు రెండోసారి ప్రధాని అయిన 2019 నుండి 2024 వరకు నాటి పార్లమెంట్ స్పీకర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు! పది సంవత్సరాల పాటు కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా లేకుండానే ప్రజా క్షేత్రంలో పోరాటం చేసింది. మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కాంగ్రెస్ సాధించింది. రాహుల్ గాంధీ నాకు రెస్పెక్ట్ కావాలి అని గోల గోల చేయలేదే! కోర్టు మెట్లు ఎక్కలేదే! కాని ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం జగన్ రెడ్డి నాకు రెస్పెక్ట్ కావాల్సిందే అని కోర్టుకు ఎక్కారు. ప్రజలే ఇవ్వని రెస్పెక్ట్ కోసం కోర్టు ద్వారా రెస్పెక్ట్ కోరుకుంటున్నారు. రెస్పెక్ట్ అనేది కొనుక్కుంటేనో కోరుకుంటేనో వచ్చేది కాదు! అది ఎదుటి వారు ఇచ్చేది అనే సూక్ష్మం జగన్మోహన్ రెడ్డి గ్రహించలేకపోవటం విషాదం. అదేదో సినిమాలో బ్రహ్మానందం నాకు రెస్పెక్ట్ కావాలని ప్రేక్షకులను నవ్విస్తాడు. జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా దానికి ఒక పక్కా లెక్క ముందస్తు ప్రణాళిక వ్యూహం ఉంటాయి. దీంట్లో జగన్ ఎత్తులు పై ఎత్తులు ఏంటో జరగబోయే పరిణామాలేంటో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు.