జగన్‌తో అంటకాగారుగా.. అనుభవించండి!

(శుభకర్ మేడసాని, ఇన్‌పుట్ ఎడిటర్, తెలుగువన్)

జగన్ ప్రభుత్వ హయాంలో వైసీపి అరాచకాలకు కొమ్ముకాశారనే ఫిర్యాదులున్న రాజంపేట, తుళ్లూరు డివిజన్ల డీఎస్పీలు వీఎన్కే చైతన్య, ఈ.అశోక్ కుమార్ గౌడ్లపై రాష్ట్ర ప్రభుత్వం బదిలీవేటు వేసింది. ఇద్దరికీ ఎక్కడా పోస్టింగు ఇవ్వలేదు. డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. పోలీసు ఎస్టాబ్లిష్మెంట్ బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు డీజీపీ సీహెచ్. ద్వారకాతిరుమలరావు మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలపై భౌతికదాడులకు దిగారని విమర్శలున్నాయి. తాడిపత్రిలో బాధితులు చైతన్యపై 23 ప్రైవేటు కేసులు దాఖలు చేశారు. రాజంపేటకు బదిలీపై వెళ్లి, అక్కడా అదే అరాచకాలు కొనసాగించారు. అర్ధరాత్రి వేళ తాడిపత్రిలో టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసంలోకి చొరబడి టీడీపీ కార్యకర్తలపై లాఠీలతో దాడి చేశారు. సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. జేసీ ఇంట్లో పనిచేసే దళితుడు, దివ్యాంగుడైన కిరణ్‌కుమార్‌ని ఇష్టానుసారం కొట్టారు. 

ఇటువంటి రాక్షస పోలీసులపై చర్యలకు ఎన్ని రోజులు పడుతుంది.  చంద్రబాబుకు వున్న సహనం బాధిత ప్రజలకు  కూటమి కార్యకర్తలకు లేదు.  తప్పుడు అధికారులపై  కఠినంగా  ఉక్కుపాదం మోపి, ఒంటి మీద  ఖాకీ యునిఫాం తీయించకపోతే  రాక్షస పోలీసులకు  సాదారణ పోలీసులకు  తేడా ఏంటి  అని  ప్రజలు  ప్రశ్నిస్తున్నారు.  డీఎస్పీచైతన్యను కేవలం బదిలీ చేయడానికి  50 రోజుల సమయమా?  పైగా  ఆ నిర్ణయం  పోలీసు ఎస్టాబ్లిష్మెంట్ బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు చైతన్యను బదిలీ చేశారు. పోలీసు ఎస్టాబ్లిష్మెంట్ బోర్డు సమావేశం అవటానికి  50 రోజులు సమయం పట్టిందన్నమాట.  అంటే  అర్థం ఏంటి?  డీజీపీ  ద్వారకా తిరుమలరావు ప్రజలు ఆశించినంత వేగంగా పని చేయడంలేదు  అని అనుకోవాల్సిన పరిస్థితికి  అద్దం పడుతోంది.  

మరో డీఎస్పి అశోక్ కుమార్ గౌడ్ నూజివీడు డీఎస్పీగా పనిచేసిన సమయంలో  వైసీపీకి కొమ్ముకాశారనే ఫిర్యాదులున్నాయి. టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ని తీవ్రంగా వేధించారు. ఆయన్ని బహిరంగంగా హెచ్చరించారు. ఎన్నికలకు కొద్ది రోజులు ముందు అశోక్ కుమార్ గౌడ్ తుళ్లూరు డీఎస్పీగా నియమితులయ్యారు. ఎన్డీయే విజయం సాధించిన నేపథ్యంలో మందడంలో అమరావతి రైతులు బాణాసంచా కాల్చగా వారిపట్ల అశోక్ కుమార్ గౌడ్ దురుసుగా ప్రవర్తించారన్న ఫిర్యాదులున్నాయి. గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై 2021లో వైసీపీ మూకల దాడిపై కేసు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఒక సీఐ, మరో ఇద్దరు ఎస్ఐలపై సస్పెన్షన్ వేటు పడింది. అప్పటి మంగళగిరి రూరల్ సీఐ భూషణంతోపాటు అప్పట్లో రూరల్ ఎస్సైలుగా పని చేసిన లోకేశ్, క్రాంతికిరణ్‌ను కూడా సస్పెండ్ చేస్తూ గుంటూరు రేంజి ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. మంగళగిరిలోనే రెండు నెలలకు పైగా ఎస్సైలుగా పనిచేసిన విజయకుమార్ రెడ్డి, రమేష్ బాబులపై క్రమశిక్షణ చర్యలకు ఐజీ ఆదేశించారు. కేసు నమోదులోనే ఎన్నో లోపాలున్నాయని ఉన్నతాధికారులు గుర్తించారు. నాటి రూరల్ సీఐ భూషణం దర్యాప్తును అసలు పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. ఇప్పటిదాకా 18 మందిని అరెస్టు చేశారు. కొత్తగా వచ్చిన ఎస్పీ సతీష్ కుమార్ ఇటీవల మంగళగిరి రూరల్ స్టేషన్‌కి వెళ్లి సమగ్రంగా పరిశీలించి, లోపాలను గుర్తించారు. దాడి జరగ్గానే పోలీసులు ఆధారాలను పూర్తిస్థాయిలో సేకరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని, అనంతరం దర్యాప్తులోనూ జాప్యం ప్రదర్శించారని ఆయన తేల్చారు. ప్రత్యక్ష సాక్షులుగా కూరగాయలు అమ్ముకునేవారి పేర్లను సీఐ భూషణం, పెట్టారని తెలుసుకుని ఉన్నతాధికారులు అవాక్కయ్యారు. 2021లో కేసు నమోదైతే నిందితులను గుర్తించి, అరెస్టు చేయకుండా సీఐ భూషణం ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఎస్పీ తన నివేదికలో తప్పు పట్టినట్లు తెలిసింది.