ఇరాక్‌లో ఇక చిన్నారి పెళ్ళికూతుళ్ళు!

ఇరాక్‌లో అమ్మాయిలకు పెళ్ళి చేయడానికి కనీస వయసును 9 సంవత్సరాలుగా నిర్ణయిస్తూ బిల్లు ఆమోదించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ వివాదాస్పద బిల్లును ఇరాక్ న్యాయ మంత్రిత్వ శాఖ పార్లమెంటులో ప్రవేశపెట్టింది. పర్సనల్ స్టేటస్ ‘లా’ను సవరించే ఉద్దేశంతో ఈ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు మీద ఇరాక్‌లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అయినప్పటికీ ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు. కొన్ని సంవత్సరాల క్రితం ఇలాంటి బిల్లునే ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పుడు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో ప్రభుత్వం వెనక్కితగ్గింది. ఈసారి మాత్రం వెనక్కి తగ్గే ఉద్దేశంలో వున్నట్టు లేదు. ప్రస్తుతం ఇరాక్‌లో అమ్మాయిల వివాహానికి కనీస వయసు 18 సంవత్సరాలుగా వుంది. ఇప్పుడు ఈ బిల్లుకు ఆమోదం లభించినట్టయితే, అమ్మాయిల పెళ్లి వయసు 9 ఏళ్ళకు, అబ్బాయిల పెళ్ళి వయసు 15 ఏళ్ళకు తగ్గుతుంది. అప్పుడు ఇరాక్‌లో బాల్య వివాహాలు చేసుకోవడానికి చట్టపరంగా ఎలాంటి అభ్యంతరం వుండదు. ఇది బాల్య వివాహాలు పెరగడానికి కారణం కావడంతోపాటు, మహిళల హక్కుల విషయంలో ఇంతకాలం సాధించిన అభివృద్ధి కుంటుపడుతుందని ఈ బిల్లును వ్యతిరేకిస్తున్న మానవ హక్కుల సంఘాలు, మహిళా సంఘాలు అంటున్నాయి. అంతే కాకుండా ఈ బిల్లు ఆమోదం పొందితే బాలికల విద్య, ఆరోగ్యం మీద తీవ్ర ప్రభావం పడుతుందని, చదువు మధ్యలో ఆపే ఆడపిల్లల సంఖ్య పెరుగుతుందని అంటున్నాయి. చిన్న వయసులోనే గర్భందాల్చడం, గృహహింస వంటివి పెరుగుతాయని ఉద్యమకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.