దూకుడు పెంచిన రేవంత్ సర్కార్.. మరో కీలక నిర్ణయం!
posted on Aug 11, 2024 6:41AM
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం దూకుడు పెంచింది. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కీలక నిర్ణయాలు తీసుకుంటూ ప్రజలకు శుభవార్తలు అందిస్తోంది. రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. అగ్రరాజ్యంలో ప్రముఖ కంపెనీల సీఈవోలు, పారిశ్రామికవేత్తలతో వారు భేటీ అవుతున్నారు. తద్వారా తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా రేవంత్ ముందుకు సాగుతున్నారు. మరోవైపు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలపైనా ప్రభుత్వం వేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహజ్యోతి కింద ప్రతీ కుటుంబానికి రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అమలు, రూ. 500కే గ్యాస్ సిలీండర్ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోంది. లబ్ధిదారులు పథకాల ఫలాలను అందుకుంటున్నారు. దీనికితోడు రూ.లక్షన్నర లోపు రుణాలు కలిగిన రైతులకు ఇటీవల ప్రభుత్వం రుణమాఫీ చేసింది. ఆగస్టు 15వ తేదీ నాటికి రూ.లక్షన్నర నుంచి రూ. 2లక్షల రుణాలు కలిగిన రైతులకు రుణమాఫీని చేసేందుకు రెడీ అయ్యింది. ఇందుకు సంబంధించి నిధుల సమీకరణా పూర్తయ్యింది. ఇప్పుడు తాజాగా మరో కీలక పథకానికి శ్రీకారం చుట్టేందుకు రేవంత్ సర్కార్ వేగంగా అడుగులు వేస్తోంది.
రాష్ట్రంలో ఏళ్లుగా తెల్ల రేషన్ కార్డుకోసం ఎదురు చూస్తున్న ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రేషన్ కార్డుల జారీ ప్రక్రియను వేగవంతం చేసింది. అర్హులందరికీ తెల్ల రేషన్ కార్డులు మంజూరు చేస్తామని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. తాజాగా ఇదే అంశంపై రాష్ట్ర కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయింది. పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షత జరిగిన ఈ సమావేశంలో ఇతర మంత్రులు, సంబంధిత శాఖా అధికారులు హాజరయ్యారు. రాష్ట్రంలో అర్హులైన ప్రజలందరికీ తెల్ల రేషన్ కార్డు జారీ చేస్తామని చెప్పారు. తెల్లరేషన్ కార్డు పొందేందుకు విధివిధానాలను ప్రతిపాదించారు. గ్రామీణ ప్రాంతాలలో వార్షిక ఆదాయం లక్షన్నర, మాగాణి 3.50 ఎకరాలు, చెలక 7.5 ఎకరాలు. అలాగే పట్టణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం రెండు లక్షలుగా నిర్ణయించారు. కాగా, రేషన్ కార్డుల పంపిణీలో లబ్దిదారుల ఎంపికకు విధివిధానాల రూపకల్పనలో రాజకీయాలకు అతీతంగా ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయనున్నట్లు మంత్రివర్గ ఉపసంఘం తెలిపింది. లోక్‌సభ, రాజ్యసభ, శాసనసభ, శాసనమండలి సభ్యుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. తాజాగా ప్రభుత్వం నిర్ణయంతో తెల్ల రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకొని ఏళ్లుగా ఎదురు చూస్తున్న అర్హులకు త్వరలో కార్డులను అందనున్నాయి.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారెంటీలను అర్హులైన లబ్ధిదారులకు అందించేలా రేవంత్ సర్కార్ ఒక్కో అడుగు వేస్తోంది. ఈ క్రమంలోనే మరో హామీకి ప్రభుత్వం త్వరలో శ్రీకారం చుట్టనుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకివస్తే మహాలక్ష్మీ పథకం కింద ప్రతీ మహిళలకు రూ. 2,500 చొప్పున ప్రతీనెలా ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ హామీని అమలు చేసేందుకు కార్యాచరణను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. తెల్ల రేషన్ కార్డు ఉన్న మహిళలను మహాలక్ష్మీ పథకానికి అర్హులుగా ఎంపిక చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. వచ్చే రెండు నెలల్లో ఈ ప్రక్రియను పూర్తిచేసి లబ్ధిదారులకు ప్రతీనెలా రూ. 2500 ప్రభుత్వం అందించనుంది. అయితే, ఈ పథకంపై పూర్తిస్థాయిలో చర్చించిన తరువాత అమలు దిశగా విధివిధానాలు ప్రభుత్వం ప్రకటించనుంది. మొత్తానికి ఒకవైపు రాష్ట్రంలో ప్రముఖ కంపెనీలు పెట్టుబడులు పెట్టేలా ప్రయత్నాలు చేస్తున్న ప్రభుత్వం.. మరోవైపు ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతీ హామీని అమలు దిశగా కూడా వేగంగా అడుగులు వేస్తోంది.