ఐపీఎస్ లకు పనిష్మెంట్ ఓకే.. ఐఏఎస్ లను వదిలేశారా ఎంటి?

ఆంధ్రప్రదేశ్ లో జగన్ హయాంలో  రాజారెడ్డి రాజ్యాంగం అమలయ్యిందే తప్ప భారత రాజ్యాంగం కాదు అనేలా పాలన సాగింది. జనం జగన్ పాలనకు తమ ఓటుతో చరమగీతం పాడడానికి అది ఒక ప్రధాన కారణం.  చరిత్రలో ఇంత వరకూ ఏ పార్టీకీ ఎదురు కానటువంటి ఘోర పరాజయాన్ని జగన్ కు అందించి ఇంటికి సాగనంపారు.  సర్వ వ్యవస్థలనూ నిర్వీర్యం చేసి జగన్ సాగించిన అరాచక పాలనకు కొందరు ఐఏఎస్ లు, ఐపీఎస్ లు వంత పాడారు. సరే జగన్ సర్కార్ పతనమై.. ప్రస్తుతం రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చింది. జగన్ హయాంలో  నిబంధనలను తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా వ్యవహరించిన పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు పోస్టింగులు ఇవ్వకుండా చంద్రబాబు సర్కార్  దూరంగా పెట్టింది.  జీఏడీలో రిపోర్టు చేయమని ఆదేశించింది. సరే పని అప్పగించకుండా అప్పనంగా జీతం ఇచ్చేసి ఊరుకుంటుందా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్న తరుణంలో జగన్ తో  అంటకాగి పోస్టింగులు లభించక వెయిటింగ్ లో ఉన్న 16 మంది ఐపీఎస్ లకు రోజూ ఆఫీసుకు వచ్చి సంతకాలు పెట్టాలఆదేశాలు అందాయి. అంటే వారు ప్రతి రోజూ ఆఫీసుకు వచ్చి సంతకం చేయాలి. డ్యూటీ అవర్స్ ముగిసే వరకూ పని లేకుండా కార్యాలయంలో కూర్చుని సాయంత్రం వెళ్లే ముందు మరోసారి సంతకం చేయాలి. 

ఏదైనా కేసులో నిందితుడికి కోర్టు బెయిలు మంజూరు చేస్తూ పెట్టే కండీషన్లు కూడా దాదాపు ఇలాగే ఉంటాయి. సాక్షులను ప్రభావితం చేయరాదు. కేసుకు సంబంధించి బయట ఎక్కడా నోరు విప్పకూడదు. నిత్యం అందుబాటులో ఉండాలి. అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లకూడదు అన్నది సాధారణంగా కండీషన్డ్ బెయిలు నిబంధనలుగా ఉంటాయి. ఇప్పుడు పోస్టింగ్ లు లేని ఐపీఎస్ లకు కూడా పోలీస్ బాస్ జారీ చేసిన ఆదేశాలు ఆ కండీషన్డ్ బెయిలులాగే ఉన్నాయి. ఇదే విషయాన్ని తెలుగుదేశం సీనియర్ నాయకుడు జేసీ చెప్పారు. వారిని చూసి జాలి పడ్డారు.  ఇప్పుడు జగన్ తో అంటకాగి నిబంధనలకు తిలోదకాలిచ్చేసిన 16 మంది ఐపీఎస్ లకు  ఈ శిక్ష సమంజసమేనంటున్నారు ప్రజలు.  ఇక శాఖాపరమైన విచారణకు కూడా ఉపక్రమించాలని డిమాండ్ చేస్తున్నారు. ఐపీఎస్ ల విషయంలో తీసుకున్న చర్యను అభినందిస్తునే .. ఐఏఎస్ ల విషయం ఏమిటంటూ సర్కార్ ను జనం నిలదీస్తున్నారు.  నిబంధనలకు పాతరేసిన ఐఏఎస్ లపై చర్యలెప్పుడని ప్రశ్నిస్తున్నారు. 

ఎందుకంటే ఐఏఎస్ అయినా, ఐపీఎస్ అయినా సర్వీసు నిబంధనలలో  తేడాలు ఉండవు. వెయిటింగ్‌లో ఉన్న అంటే పోస్టింగులు ఇవ్వని ఐపిఎస్‌లను రోజూ ఆఫీసుకు రావాలని పోలీసు బాసు ఆదే శించారు. మరి పోస్టింగులు ఇవ్వని, వెయిటింగ్ లో ఉన్న ఐఏఎస్ల విషయంలో సీఎస్ ఎందుకు ఉదాశీనంగా వ్యవహరిస్తున్నారని సందేహం వ్యక్తం చేస్తున్నారు.  

జగన్ సర్కారుతో అంటకాగిన 16 మంది ఐపిఎస్ అధికారులను ప్రతిరోజూ హెడ్‌క్వార్స్‌కు హాజర వాలన్న డీజీపీ నిర్ణయాన్ని.. ఐఏఎస్‌ల విషయంలో సీఎస్ ఎందుకు పాటించడం లేదంటూ తెలుగుదేశం శ్రేణులు కూడా నిలదీస్తున్నాయి.  జగన్ జమానాలో ఒక వెలుగు వెలిగి, ఇప్పుడు వెయిటింగ్‌లో ఉన్న ఐఏఎస్‌ల పట్ల ప్రత్యేక అభిమానం ఏమిటన్న సందేహాలు అధికార వర్గాలలో కూడా వ్యక్తం అవుతున్నాయి. 

 నిబంధనలను తుంగలోకి తొక్కి జగన్ కు వంత పాడిన  ఐఏఎస్ అధికారులు శ్రీలక్ష్మి, ప్రవీణ్ ప్రకాష్, రజత్‌భార్గవ్, గోపాలకృష్ణ ద్వివేదీ, ముత్యాలరాజు, మురళీధర్‌రెడ్డి, నారాయణ్‌భరత్ గుప్తా, మాధవీలత, అనిల్‌కుమార్‌రెడ్డి, నీలకంఠారెడ్డి, హరితకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా వెయిటింగ్‌లో పెట్టారు. వీరిలో ప్రవీణ్ ప్రకాష్ కు మాత్రం వీఆర్‌ఎస్ ఇచ్చారు. మిగిలిన వారంతా జీఏడీకి రిపోర్టు చేసి, దర్జాగా వేతనంతో కూడిన సెలవలను ఎంజాయ్ చేస్తుంటే సీఎస్ ఎందుకు ఉలుకూ పలుకూ లేకుండా ఉన్నారన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. ఈ ఐఏఎస్ లలో కొందరు ఇప్పటికీ వైసీపీ అగ్రనేతలతో టచ్ లో ఉన్నారన్న ఆరోపణలు తెలుగుదేశం నుంచే వస్తున్నాయి.   ఈవెయిటింగ్ ఐఏఎస్ లను కూడా ప్రతి రోజూ సెక్రటేరియెట్ కు వచ్చి సంతకాలు పెట్టాలన్న ఆదేశాలు వెంటనే జారీ చేయాలన్న డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది.