బెంగళూరులోనే జగన్ మకాం.. శవం ఉంటేనే ఆంధ్రాకు!
posted on Jul 29, 2024 6:28AM
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి మానసిక స్థితి సరిగా లేనట్లు కనిపిస్తోంది. హత్యలు, దాడులతో ప్రజలను భయపెట్టి మళ్లీ అధికారంలోకి రావాలని భావించిన ఆయనకు ఎన్నికల్లో గట్టి షాక్ తగిలింది. ఐదేళ్ల అరాచక పాలనతో విసిగిపోయిన ప్రజలు ప్రతిపక్ష హోదాకు కూడా వైసీపీకి అర్హత లేదని నిర్ద్వంద్వంగా తేల్చేశారు. అధికారంలో ఉన్నప్పుడే జగన్ మానసిక పరిస్థితిపై కొందరు వైసీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఘోర ఓటమి తరువాత ఆయన ఎప్పుడు ఏం చేస్తున్నారో అర్థంకావడం లేదని ఆ పార్టీ నేతలు తలలుబాదుకుంటున్నారు. నూతనంగా అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వానికి పాలనాపరంగా సర్దుబాటు కావటానికి కొంత సమయం పడుతుంది. దీంతో ప్రతిపక్షంలో ఉన్న ఏ పార్టీ అయినా కనీసం ఓ ఆర్నెళ్లు తన రాజకీయ కార్యకలాపాలను ముమ్మరం చేసేందుకు సమయం తీసుకుంటుంది. తద్వారా ఆ సమయంలో అధికార పార్టీ వ్యవహారశైలిని బట్టి రాజకీయంగా ప్రతిపక్ష పార్టీ నేతలు వ్యూహాలకు పదునుపెడుతుంటారు. కానీ, జగన్ వ్యవహారశైలి సంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా ఉంది. అధికారం కోల్పోయిన నాటి నుంచి రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, వైసీపీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారంటూ జగన్ గగ్గోలు పెడుతున్నారు. ఓ పక్క రాష్ట్రంలో ప్రశాంత వాతావరణంతో ప్రజలు సంతోషంగా ఉంటే.. జగన్, కొందరు వైసీపీ నేతలు వ్యవహరిస్తున్న తీరు ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
అధికారం కోల్పోయిన తరువాత జగన్ మోహన్ రెడ్డిని భయం వెంటాడుతోంది. ఐదేళ్ల కాలంలో తానుచేసిన అరాచక పాలనను గుర్తుచేసుకుంటున్న జగన్.. కూటమి ప్రభుత్వంకూడా అదే పద్దతిని పాటిస్తుందని భయపడుతున్నారు. కానీ, సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో అభివృద్ధే లక్ష్యంగా పాలనపై దృష్టిపెట్టారు. రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం ఉంటే పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీల ప్రతినిధులు ముందుకొస్తారని, తద్వారా ఉపాధి అవకాశాలు పెరిగి, రాష్ట్ర ఆదాయం కూడా పెరుగుతుందని భావిస్తున్నారు. ఎన్డీయేలో భాగస్వామిగా ఉండటంతో కేంద్రం నుంచి వీలైనన్ని ఎక్కువ నిధులు తీసుకొచ్చి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి జరిగేలా చంద్రబాబు వేగంగా అడుగులు వేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 50 రోజుల్లోనే రాష్ట్రంలో అభివృద్ధిని చూసి తట్టుకోలేపోతున్న జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ లో ఉండలేక పోతున్నారు. దీంతో చీటికిమాటికి బెంగళూరులోని ఆయన ప్యాలెస్‌కు వెళ్తున్నాడు.
అధికారం కోల్పోయిన తరువాత జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికే రెండు సార్లు బెంగళూరులోని ఆయన ప్యాలెస్‌కు వెళ్లారు. కొద్దిరోజులు అక్కడే ఉన్నారు. ఇటీవల రాష్ట్రానికి వచ్చిన ఆయన.. శవ రాజకీయం పూర్తయిన తరువాత.. మళ్లీ సతీసమేతంగా బెంగళూరు వెళ్లారు. బెంగళూరులో జగన్ వెళ్లేది ఆయన సొంత ఇంటికే అయినా.. అధికారంలో ఉన్న సమయంలో ఒక్కసారి కూడా అక్కడకు వెళ్లని జగన్ ఇప్పుడు చిటికీ మాటికీ బెంగళూరు వెళ్లడానికి కారణం ఏమిటన్న చర్చ ఏపీ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. అందుకు అనేక కారణాలు ఉన్నాయి. ప్రజలు ఘోరంగా ఓడించటాన్ని జగన్ జీర్ణించుకోలేకపోతున్నారు.. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన 50రోజుల్లోనే రాష్ట్రాన్ని అభివృద్ధిలో ఉరుకులు పెట్టిస్తున్నారు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వంలో అమరావతి రాజధాని నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. తాడేపల్లిలోని జగన్ ప్యాలెస్ కూడా అమరావతి రాజధాని ప్రాంతంలోనే ఉంది. ప్రస్తుతం ఆ ప్రాంతం నిత్యం రద్దీగా మారింది. తనకు నచ్చని అమరావతి రాజధాని పనులు తన కళ్లముందే వేగంగా జరుగుతుండటంతో జగన్ ఓర్వలేకపోతున్నారు. అందుకే అక్కడ ఉండలేకపోతున్నారని వైసీపీ నేతలే చెబుతున్నారు. ఈ కారణంగా జగన్ బెంగళూరులో ప్యాలెస్ లోనే మకాం వేస్తున్నారు. బెంగళూరు నుంచే రాష్ట్రంలో ఘర్షణలకు జగన్ ప్లాన్ చేస్తున్నారని తెలుగుదేశం కూటమి పార్టీల్లోని నేతలు ఆరోపిస్తున్నారు. తద్వారా శవ రాజకీయాలతో రాష్ట్రంలో అరాచక పాలన జరుగుతోందని దేశ ప్రజలను నమ్మించేందుకు వ్యూహాత్మకంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీల ప్రతినిధులు ఏపీ వైపు చూడకుండా జగన్ ప్రణాళికలు రచిస్తున్నారు.
జగన్ కు తాడేపల్లితోపాటు హైదరాబాద్ లోనూ ఓ ప్యాలస్ లాంటి నివాసం ఉంది. గతంలో ఎక్కువగా జగన్ హైదరాబాద్ లోనే నివాసం ఉండేవారు. కానీ, ప్రస్తుతం హైదరాబాద్ వెళ్లేందుకు కూడా జగన్ ఇష్టపడటం లేదు. ఎందుకంటే.. తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉండటమే కారణం. రేవంత్ రెడ్డిని చంద్రబాబు నాయుడు శిష్యుడిగా జగన్ భావిస్తున్నారు. ఈ క్రమంలో పలు సందర్భంగాల్లో రేవంత్ ప్రభుత్వంపై జగన్ విమర్శలు చేస్తూ వచ్చారు. ప్రస్తుతం గత ఐదేళ్ల జగన్ పాలనలో జరిగిన అవినీతి, అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తుండటంతో ఎప్పుడైనా తనను అరెస్టు చేయొచ్చని కూడా జగన్ భయపడుతున్నారు. ఏపీలో ఉన్నా.. హైదరాబాద్ లో ఉన్నా తనకు ఇబ్బంది ఉంటుందని భావిస్తున్న జగన్.. బెంగళూరులో ఉండటమే సేఫ్ గా భావిస్తున్నారు. బెంగళూరులోనూ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అయితే, అక్కడి డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ ఉన్నారు. డీకేతో వైఎస్ కుటుంబానికి మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ కారణంగా జగన్ బెంగళూరులోనే ఎక్కువ సమయం గడిపేందుకు ఇష్టపడుతున్నారు. ఏపీకి కేవలం శవ రాజకీయాలు చేయడానికే మాత్రమే జగన్ వస్తారన్న చర్చ ఏపీ రాజకీయ వర్గాల్లో జరుగుతున్నది.