సిఎం మాటంటే మాటే...అస్సలు మాటే మార్చరు?

రాష్ట్రముఖ్యమంత్రి (సిఎం) కిరణ్‌కుమార్‌రెడ్డి మాటంటే మాటే...అస్సలు మాట మార్చరు...అని ఉభయగోదావరి జిల్లాల నేతలు కసిగా పెదవులు కొరుక్కుంటున్నారు. గత నెలలో తూర్పుగోదావరి జిల్లాలో సిఎం పర్యటించి నప్పుడు, తిరుపతి ఎయిర్‌పోర్టులో చిత్తూరు నేతలతో మాట్లాడినప్పుడు సిఎం ఒకనెల రోజుల్లోపు స్థానికసంస్థల ఎన్నికలు పూర్తిచేసేద్దాం అని బలమైన హామీ ఇచ్చారు. ఈ భరోసాతో ఎదురు చూస్తూ నెల ఇట్టే గడిచిపోయింది. కానీ, ఇంకా స్థానిక సంస్థల ఎన్నికలు జరగలేదు. కనీసం నోటిఫికేషను ఎప్పుడిస్తారు? ఎన్నికల్లో ఎంతమందికి అవకాశం ఉంటుంది? పార్టీ పదవులకు ఎంతమందిని తీసుకుంటున్నారు? వంటి అంశాలపై కూడా స్పష్టత లేదు. తాజాగా సిఎం పశ్చిమగోదావరి జిల్లాలో ఇందిరమ్మ బాట కార్యక్రమానికి వచ్చారు. ఆ కార్యక్రమానికి మర్యాదపూర్వకంగా తూర్పుగోదావరి జిల్లా నుంచి నేతలు వెళ్లారు. అప్పుడు అన్ని అంశాలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల గురించి కూడా ప్రస్తావించారు. అప్పుడు కూడా సిఎం తూర్పుగోదావరి జిల్లాలో చెప్పినట్లే ఇంకో నెలలోపు ఈ ఎన్నికలు పూర్తిచేస్తామని ప్రకటించారు. దీంతో ఉభయ గోదావరిజిల్లా నేతలు నోరెళ్లబెట్టాల్సి వచ్చింది. సిఎం మాటంటే మాటే ఎప్పుడు ఎవరు స్థానిక ఎన్నికల గురించి ప్రస్తావించినా ఒక నెలలోపు పూర్తి చేసేస్తామంటారని ప్రతిపక్షాలు కిసుక్కుమంటున్నాయి. ఇదే స్థానిక ఎన్నికల ద్వారా తమ పార్టీని బలోపేతం చేసుకోవాలని కోరుకుంటున్న తెలుగుదేశం నేతలు కూడా సిఎం మాట గురించి తెలిసి ఆశ్చర్యపోయారు. విషయమేమిటంటే ఇంకా స్థానిక ఎన్నికల నగారాకు కాంగ్రెస్‌ హైకమాండ్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వలేదని తెలుస్తోంది.

గౌహతిలో గ్యాంగ్ రేప్!

గౌహతిలో మరో అమ్మాయికి అన్యాయం జరిగిపోయింది. ఓ యువతిపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారం చసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది, పబ్ లో నుంచి బయటికొచ్చిన ఓ అమ్మాయిని ఆకతాయిలు అవమానించిన ఘటన మాసిపోకముందే మరో దారుణం జరిగిపోయింది. ఉజాన్ బజార కి చెందిన ఓ అమ్మాయి సాయంత్రంవేళ ట్యూషన్ కి వెళ్తుండగా నలుగురు యువకులు దారికాశారు. బలవంతంగా కారులో ఎత్తుకెళ్ళి నగరశివారులో సామూహిక అత్యాచారం జరిపారు. ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారు. భయపడుతూనే ఆ పిల్ల జరిగిన దారుణాన్ని తలిదండ్రులకు చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే బాధితురాలి తల్లిదండ్రులు పోలీసుకేసు పెట్టారు.

విద్యుత్‌కోతలపై పారిశ్రామిక వేత్తల ఆగ్రహం

ఇటీవల పెరిగిన విద్యుత్‌ కోతలకు ఇప్పటికే కుదేలయిన పారిశ్రామిక వేత్తలు కోలుకోలేని దెబ్బతింటున్నామన్నారు. ముందు చూపు లేకుండా  ప్రభుత్వం తమను ఆర్ధికంగా దెబ్బతీసిందని వారు వాపోతున్నారు.హైదరాబాద్‌ నగర శివార్లలోని పారిశ్రామిక వాడలో ఎడతెరిపిలేకుండా అమలవుతున్న కరెంటు కోతలకు పారిశ్రామిక వేత్తలు,కార్మికులు కళ్లెర్ర చేశారు.ఇప్పటికే చిన్న పరిశ్రమలను మూసుకున్నారని ఇకపై పెద్ద పరిశ్రమలు కూడా అదే బాటన పడుతున్నాయంటున్నారు. కరెంటు సబ్సిడీపై  ఆశలు పెట్టుకొని పరిశ్రమలు ప్రారంభించిన వారంతా ఇప్పుడు దారుణంగా మోసపోయారని అంటున్నారు.ప్రభుత్వ పని తీరుతో రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇంతకు ముందు తెలుగుదేశం హయాంలోకూడా ఇదే జరిగితే తర్వాతి ఎన్నికల్లో వారు ఓడి పోయారని ప్రజలు చెబుతున్నారు. అంతులేని గ్యాసు నిల్వలు మన రాష్ట్రంలోనే ఉన్నా అసమర్ధ ప్రభుత్వం వల్ల పరిశ్రమలు ఖాయిలా పడి కార్మికులు వీధిన పడుతున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.  

అ‘ధర్మాని’కి కొమ్ముకాస్తున్న కిరణ్‌!

తుమ్మితే ఊడిపోయే ముక్కులా మన రాష్ట్రానికి మూడోకృష్ణుడుగా వచ్చిన ముఖ్యమంత్రి కిరణ్‌ ప్రభుత్వం అధర్మానికి కొమ్ము కాస్తోందంటూ ప్రతిపక్షాలన్నీ ముక్తకంఠంతో విమర్శిస్తున్నాయి! అప్పటి వై.ఎస్‌ ప్రభుత్వానికి కొనసాగింపుగా రోశయ్య, అనంతరం కిరణ్‌ మంత్రి వర్గాల్లో అత్యధిక మంత్రులు వై.ఎస్‌. అనుచరగణమే! సోనియమ్మతో జగడానికి దిగిన పాపానికి జగన్‌ ఆస్తుల కేసు విచారణకు రావడంతో ఒక్కొక్కటిగా అసలు నిజాలు వెలుగు చూస్తున్నాయి. పుత్రప్రేమతో ప్రజల సొమ్మును ఇష్టం వచ్చినట్లుగా ధారదత్తం చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తడం, విచారణలో ఆ ఆరోపణలు నిజాలేనని తేలుతుండటంతో సిబిఐ వరుసగా నాలుగు ఛార్జిషీట్లు దాఖలు చేసింది.     దొడ్డిదారిన సొమ్ము చేసుకున్న జగన్‌తో బాటు, బడాబడా పారిశ్రామిక వేత్తలు, ఐఎఎస్‌ అధికారులు మంత్రులు కూడా ఈ పాపంలో పాలు పంచుకున్నారని సిబిఐ తన ఛార్జిషీట్లలో పేర్కొంది. ప్రాథమిక సాక్ష్యాధారాలు లభించిన అనేక మంది చంచల్‌గూడా జైల్లో రిమాండ్‌ ఖైదీలుగా ఉన్నారు. అప్పటి వైఎస్‌ సర్కారులో మంత్రులుగా పనిచేసి, ఇప్పటి కిరణ్‌ సర్కారులోనూ మంత్రులుగా కొనసాగుతున్న వారిలో ఆరుగురు మంత్రులపై అభియోగాలు వచ్చాయి. అందులో మోపిదేవి ఇప్పటికే జైలుకెళ్ళారు. ఇప్పు డుధర్మాన వంతువచ్చింది. ఛార్జిషీటులో ఎ5 ముద్దాయిగా పేర్కొనడంతో ఆయన తానెంత ధర్మాత్ముడో నిరూపించుకోడానికన్నట్లుగా వెంటనే రాజీనామా చేసేశారు. తలపట్టుకోవడం కిరణ్‌వంతయ్యింది. మంత్రుల్ని రక్షించుకోడానికి ఎత్తులు పైఎత్తులు వేస్తూ కిరణ్‌ కాలం గడిపేస్తున్న తీరును చూస్తుంటే`ఈ పాపంలో కిరణ్‌కు కూడా భాగం ఉందేమోనన్న అనుమానాలను దేశం వర్గాలు, వామపక్షాలు, ఇతర ప్రజాసంఘాలు వ్యక్తం చేస్తున్నాయి. అభియోగాలు ఉన్న మంత్రులనూ, అధికారులనూ తక్షణమే సిబిఐ అదుపులోకి తీసుకుని విచారణ చేపడితే` అవినీతి అసలు మూలాలు వెలుగులోకి వస్తాయని ప్రజలు అభిప్రాయ పడుతున్నారు. ధర్మాన రాజీనామా లేఖను గవర్నరుకు పంపకుండా తాత్సారం చెయ్యడం తప్పును కప్పిపుచ్చే చర్యగా భావిస్తూ గవర్నర్‌ తనదైన చర్యలు తీసుకుంటే మంచిదన్న అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి!

ఉచిత విద్య ఇచ్చేవారికే మద్దతు..?!

విద్య వ్యాపారంగా మారిపోయిన ప్రస్తుత రోజుల్లో సామాన్యుడి చదువు ప్రశ్నార్థకంగా మారింది. ప్రజలకు సౌకర్యాలు కల్పించాల్సిన ప్రభుత్వం విద్యను వ్యాపారం చెయ్యడంతో కార్పొరేట్‌ స్కూళ్ళు, కాలేజీలు, ఇంజనీరింగ్‌ మెడికల్‌ కళశాలలు ప్రజలను నిలువునా దోచుకుంటున్నాయని ‘సామాన్య, మధ్యతరగతి వర్గాలు మండిపడుతున్నాయి! పదిహేను సంవత్సరాల కిందటి వరకూ‘విద్య’ పూర్తిగా ప్రభుత్వ అధీనంలోనే ఉండేది! ప్రభుత్వ పెద్దలు తమ స్వార్థం కోసం విద్యారంగంలో ప్రయివేటుకు అవకాశాలు కల్పించడంతో వటుడిరతై... అంతై..అంతంతై..అన్నట్లుగా విద్యారంగాన్ని పూర్తిగా తమ చెప్పు చేతుల్లో పెట్టుకుని ‘తాము ఆడిందల్లా ఆట పాడిందల్లా పాట’గా ఫీజుల్ని ఆకాశమంత ఎత్తుకుపెంచేశాయి!     అంతేకాకుండా పుస్తకాలు, డ్రస్సులు, బస్సులు ఇంకా మెటీరియల్స్‌ అంటూ దండుకుంటున్నాయి! విద్యా శాఖాధికారుల నియంత్రణ పర్యవేక్షణ పూర్తిగా కొరవడటంతో ఎల్‌కేజి ఫీజులుగా కూడా పదివేల నుంచి పాతిక వేలకు పైగానే వసూలు చేస్తూ, ప్రయివేటు పాఠశాలు హవా చేస్తున్నాయి? ఇదే క్రమంలో సాంకేతిక విద్యకు అగ్రతాంబూలం అంటూ ప్రయివేటు ఇంజనీరింగ్‌ మెడికల్‌ కాలేజీలకు ఇష్టం వచ్చినట్లుగా అనుమతులు ఇచ్చెయ్యయంతో క్వాలిటీ విద్యకు కాలం చెల్లిపోయిందని విశ్లేషకులు విమర్శిస్తున్నారు. క్వాలిఫైడ్‌ లెక్చరర్లు లేకుండా, సరైన లేబ్‌, లైబ్రరీ సౌకర్యం లేకుండా, సాంకేతిక విద్యామండలి ప్రమాణాలు పాటించకుండా ఉండే ఇంజనీరింగ్‌, మెడికల్‌ కళాశాలలలో ఇంతంత ఫీజులెందుకుంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. డిమాండుకు మించిన కళాశాలల ఏర్పాటు వల్ల డిగ్రీ సర్టిఫికేట్‌తో బయటకొచ్చిన విద్యార్థికి ఎక్కడా సరైన ఉద్యోగం కూడా రావటం లేదని, పెరిగిపోతున్న నిరుద్యోగుల సమస్యను పరిశీలిస్తే అర్థమౌతుంది. రాజకీయ నాయకులు తమ అధికారం కోసం ప్రజల్ని ఓ పావుల్లా చేస్తూ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పేరుతో విద్యార్థుల్ని బిచ్చగాళ్ళుగా చేస్తున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. ఏఏటికాఏడు ఫీజురీయింబర్స్‌మెంటు కోసం ఎదురుచూస్తూ తమ చదువు ముందుకు సాగుతుందో లేదోనన్న భయాందోళనలతో విద్యార్థినీ విద్యార్థులు కాలం గడపవలసి రావడం నిజంగా శోచనీయమంటున్నారు. కేజీ నుంచి పీజీ వరకూ, ఇంజనీరింగ్‌ మెడికల్‌ వంటి అన్ని రకాల కళాశాలల్నీ పూర్తిగా ప్రభుత్వమే స్వాధీన పరచుకునే విధంగా విద్యారంగాన్ని జాతీయం చెయ్యవలసిన అవసరం ఎంతైనా ఉందని సామాన్య మధ్యతరగతి వర్గాలు భావిస్తున్నాయి! ఈ క్రమంలో విద్యారంగాన్ని పూర్తిగా ప్రభుత్వ అధీనంలోకి తెచ్చుకుని ప్రజలకు ఉచిత విద్య అందించే పార్టీని బలపరచాలని ఆర్థికంగా వెనుకబడిన వర్గాలతోబాటు, బిసి మైనారిటీ వర్గాలు నిర్ణయించుకుంటున్నట్లు తెలుస్తోంది! రాబోయే రోజుల్లో ప్రజలందరికీ ఉచిత విద్య వైద్య సౌకర్యాల కోసం ఉద్యమ నిర్మాణం కోసం సన్నాహాలు జరుగుతున్నాయని జరుగుతున్న ఘటనలు సూచిస్తున్నాయి!

రాహూల్‌ క్యాబినెట్‌లో చిరంజీవికి చోటు ?

కేంద్రంలో ఎన్నికలముందే మరోసారి క్యాబినెట్‌ విస్తరణ వచ్చేనెల పార్లమెంట్‌ సమావేశాల తర్వాత జరుగుతుందని పార్టీవర్గాల భోగట్టా. దీనికి సంబంధించి అన్ని లాంచనాలు పూర్తయ్యాయని, సెప్టెంబరు 6 తర్వాత ఈ కార్యక్రమం జరుగుతుందని నాయకులు చెబుతున్నారు. ఇప్పటికీ చాలా కీలక పదవులు ఖాళీగా ఉండటమే దీనికి కారణంగా చెబుతున్నారు. ఇందులో భాగంగానే రాహుల్‌ పదవిని అలంకరించనున్నారని తెలుసింది. అలాగే మన రాష్ట్రం నుండి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న చిరంజీవికి కూడా ఒక పదవి ఇవ్వనున్నారని పార్టీ వర్గా సమాచారం. రాహుల్‌ని 2014 కి ముందే మంత్రి పదవి చేపట్టడం ద్వారా అనుభవం గణించి తద్వారా యుపిఎ 3 లో ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించవచ్చని కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ ప్రణాళికగా తెలుస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు ప్రిన్స్‌ గ్రామీణాభివృద్దిగాని, మానవ వనరుల శాఖగాని చేపట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే ఖాళీ అయిన మంత్రి పదవులు చాలానే ఉన్నాయి. వీరభద్రాసింగ్‌, శశిధరూర్‌, అగాధసంగ్మా, కనిమొళి, అస్కార్‌ ఫెర్నాండేజ్‌ దివంగత మంత్రి విలాస్‌రావ్‌ దేశ్‌ ముఖ్‌ లాంటివారి మంత్రిపదవులు ఖాళీగా ఉన్నాయి. అయితే విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్‌ఎం కృష్ణను ఆ బాధ్యతల నుండి తప్పించి రానున్న ఎన్నికల కోసం కర్ణాటక ఇన్‌ఛార్జ్‌గా వేయనున్నారు. ఈ క్యాబినెట్‌ విస్తరణలో రాష్ట్ర కాంగ్రెస్‌నుండి చిరంజీవి, డిఎంకే పార్టీనుండి కనిమొళనికి, దయానిధి మారన్‌కి ఇవ్వనున్నట్లు సమాచారం.

తెలంగాణాకు ప్రత్యేక ప్రతిపత్తి ఇవ్వనున్న కాంగ్రెస్‌

తెలంగాణ రాష్ట్ర సాధన కష్టమేనని చట్టసభల్లో ఆమేరకు తగిన బలం లేనందున తీర్మానం చేయటం అసాద్యమే అని తేలింది. రాజ్యసభ అనుభవం లోక్‌సభలోనూ ఎదురవుతుందని అన్ని రాజకీయ పార్టీలు తలస్తున్నాయి. అయితే రాష్ట్రంలో అధికార పార్టీకి అడ్డంకిగా ఉన్న తెలంగాణ సమస్యకు కేంద్రం ప్రత్యామ్నాయాన్ని వెదుకుతుంది. అందులో భాగంగా గుర్ఘాలాండ్‌ తరహాలో ప్రత్యేక ప్రతిపత్తితో కూడిన బోర్డు ఏర్పాటు చేయనుందని తెలుస్తుంది. తెలంగాణ ప్రజలు స్వయం పాలన కోరుతున్నందువల్ల రాష్ట్ర ఏర్పాటు మినహా ఆస్ధాయిలో ప్రత్యామ్నాయం ఏర్పాటు చేస్తే వారిని సంతృప్తి చేయవచ్చని కాంగ్రెస్‌ భావిస్తుంది. ఇటీవల మమతా బెనర్జీ ముఖ్యమంత్రి అయిన తరువాత కొన్ని దశాబ్దాల నుంచి పశ్చిమ బెంగాల్‌ను పట్టి పీడిస్తున్న గుర్ఖాలాండ్‌ సమస్యను పరిష్కరించిన వైనాన్ని కాంగ్రెస్‌ నాయకత్వం పరిశీలించింది.అదే పరిష్కారాన్ని తెలంగాణకు కూడా అమలు చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తుంది. ఆ ప్రతిపాదనను సీమాంద్ర ఎంపీలు కూడా  ఈ పాటికే ఆంగీకరించారని తెలుసింది.రాష్ట్రం ముక్కలు కాకుంగా ఉండే ఎలాంటి నిర్ణయాన్నయినా సమర్ధిస్తామని తెలంగాణకు న్యాయం జరిగేందుకుచేసే ప్రయత్నాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యతిరేకించమని ఆయా నాయకులు హామీ ఇచ్చారు. దానివల్ల తెలంగాణకు కెటాయించే నిధులన్నిటినీ ఎవరి అనుమతులు లేకుండా ఖర్చుపెట్టుకునే అధికారం ఉంటుంది. దానివల్ల ప్రాధాన్యతా రంగాలకు ఖర్చుపెట్టడం ద్వారా తెలంగాణాను అభివృద్ది చేసుకోవచ్చునని కేంద్రం భావిస్తుంది. దీనివల్ల తెలంగాణ సమస్యకు చెక్‌ చెప్పి రానున్న ఎన్నికల్లో తమ సత్తా చాటాలనుకుంటుంది

విద్యార్ధులకు మలేరియా, విషజ్వరాలు

తూర్పుగోదావరి ఏజెన్సీలో రోజురోజుకూ మలేరియా ,విషజ్వరాలతో సంక్షేమ హాస్టళ్లను సిక్‌రూమ్‌లను చేశాయి. ప్రతి వసతి గృహంలోనూ రోజుకు 10 నుండి 20 మంది విద్యార్ధులు జ్వరాలబారిన పడుతున్నారు. గత ఏడాది విషజ్వరాలకు 15 మంది చనిపోయారని ప్రభుత్వ లెక్కల్లో ఉండగా మరింత ఎక్కువగా ఉన్నాయని పరిశీలకులు చెబుతున్నారు. ఇటీవలి కాలంలో ఒక కానిస్టేబుల్‌కూడా మలేరియా బారిని పడి మృతి చెందారు. రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి ప్రతిరోజూ 70 నుంచి 100 మంది జ్వరాలతో వస్తున్నారు. గిరిజన సంక్షేమ ఆశ్రమ వసతి గృహాలతో పాటు, మైదాన ప్రాంతాల్లో కూడా విద్యార్దులు జ్వర పీడుతులుగా ఉన్నారు.తూర్పుగోదావరి జిల్లా లోని ఏడు మండలాల్లో 78 గిరిజన సంక్షేమ, ఆశ్రమ వసతి గృహాలన్నాయి. ఒక్కో వసతి గృహంలో 300 మంది విద్యార్ధులు ఉన్నారు. ఏ వసతి గృహాన్ని పరిశీలించినా కనీస వసతులలేమి,పారిశుద్యలేమి కన్పిస్తుంది.     రంపచోడవరం పరిధిలోని ప్రభుత్వ, ప్రయివేటు డిగ్రీ కళాశాలలకు చెందిన 350 మంది విద్యార్ధులు దాహానికి వాగునీటినే వాడుతున్నారు.ఫలితంగా విషజ్వరాలు, మలేరియా వ్యాధికి గురి అవుతున్నారు. వసతి గృహాలన్నీ ఇలాగే ఉన్నాయని పరిశీలకులు చెబుతున్నారు. దేవిపట్నం మండలంలోని ఆశ్రమ పాఠశాలకూడా ఇరుకైన గదుల్లో ఉండటం, పారిశుద్యలోపం వెరసి దోమలకు నిలయంగా మారింది. అయితే ఏజెన్సీలో ఏరియా ఆసుపత్రితో పాటు మరో 18 ప్రాధమిక ఆసుపత్రులున్నాయి. వీటిలో 36 మంది డాక్టర్లు ఉండాల్సి ఉండగా కేవలం 18 మంది మాత్రమే ఉన్నారు.డాక్టర్ల కొరతే కాకుండా మందుల కొరత కూడా వెంటాడుతుంది. దోమలనుండి రక్షణకు దోమతెరలు పంచినా వినియోగంపై అవగాహన లేకపోవడంతో గిరిజనులు వినియోగించడం లేదు.దోమలను లార్వా దశలోనే నిర్మూలించేందుకు ఈ పాటికే స్ప్రేను 2 సారి వినియోగించవలసి ఉన్నా మలేరియా విభాగాన్ని నిధుల కొరత వెంటాడటంతో అరకొరక పనులు చేస్తున్నారు. ఏజెన్సీ ఆసుపత్రిలో కూడా మలేరియా కిట్స్‌ లేకపోవడంతో ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల పరిస్థితి ఎలా ఉంటుందో అని అంచనావేసుకోవచ్చు.రోజు రోజుకీ ఆసుపత్రుల్లో మలేరియా, ఇతర విషజ్వరాలతో నిండుతున్నా అధికార యంత్రాంగంలో మాత్రం చలనం ఉండటం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు.

హరికృష్ట , బాలకృష్ణ మద్య తెలంగాణ చిచ్చు

ఎట్టకేలకు తెలుగుదేశం పార్టీ తన రెండు కళ్ల సిద్దాంతానికి తెరదించి తెలంగాణకు వ్యతిరేకం కాదని ప్రకటించింది. దీనిపై హరికృష్ణ , బాలకృష్ణ చెరొకవైఖరితో అడుగులు వేస్తున్నారు. హరికృష్ణ ఇప్పటికీ సమైఖ్యాంద్రా నినాదాన్నే కొనసాగిస్తుండగా, బాలకృష్ణ మాత్రం అవసరమైతే తెలంగాణకు అనుకూలంగా మరొక లేఖ కేంద్రానికి రాయటానికి సిద్దంగా ఉన్నానని తెలిపారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తీసుకున్న నిర్ణయానికి అంతా కట్టుబడి ఉంటామని వాఖ్యానించారు.దీనిపై ఘాటుగా స్పందించిన హరికృష్ణ తనలో నందమూరి తారక రామారావు రక్తం ప్రవహిస్తున్నంత కాలం సమైఖ్యాంద్రకే కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. గతంలో హరికృష్ట ప్రత్యేక రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ వ్యతిరేకం అని తెలంగాణ పార్టీ అద్యక్షుడు కెసిఆర్‌కు లేఖ రాశారు. దీనిపై ఎర్రబెల్లి దయాకర్‌ అది హరికృష్ణ స్వంత అభిప్రాయంగా ప్రకటించారు. పార్టీలో చాలా మంది పొలిట్‌ బ్యూరో సభ్యులున్నారని ఆయనొక్కడే కాదని వాఖ్యానించారు.     ఆ సమయంలో హరి ఎర్రబెల్లిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దానికి తగ్గట్టుగా పార్లమెంటు బయటకూడా అనేక సార్లు సమైఖ్యాంద్రా నినాదాన్నే కొనసాగిస్తున్నారు. తెలంగాణ వ్యవహారంలో ఎర్రబెల్లి, కడియం శ్రీహరివంటి నేతలు చంద్రబాబునాయుడిని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపిస్తున్నారు. కేవలం అధికారంకోసం విధానాలను మార్చుకోవడం మంచిది కాదని కూడా చెబుతున్నారు.దీని వల్ల సీమాంద్రలో పార్టీ దెబ్బతింటుందన్నారు. అయితే తెలంగాణకు అనుకూలంగా పార్టీ లేఖ ఇచ్చినంత మాత్రాన దానిని ఆధారం చేసుకొని కేంద్రం నిర్ణయం తీసుకోదన్న వాస్తవం గుర్తించాలని, ఆవిషయాన్ని ప్రజలకు తెలియచేసేకంటే ముందు నేతలు గ్రహంచాలంటున్నారు. కాంగ్రెస్‌ తనకు రాజకీయంగా లాభదాయకంగా ఉంటే తప్పనిర్ణయం తీసుకోదని, ఆలోగా అన్ని పార్టీల్లో చీలిక తేవడమే దాని లక్ష్యమని అంటున్నారు. కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణపై తన అభిప్రాయం చెప్పాలని, అన్ని పార్టీలమద్య ఏకాభిప్రాయం కావాలని, ఇవన్నీ పూర్తికావాలంటే చాలాకాలం పడుతుంది కాబట్టి తెలుగుదేశం తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇస్తే వచ్చే నష్టం మేమీలేదని పార్టీ నాయకులు విశ్లేషిస్తున్నారు.

ధర్మానను రక్షించేందుకు ప్రభుత్వ నాటకం?

రాష్ట్రరెవెన్యూ శాఖా మంత్రి ధర్మాన ప్రసాదరావును రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కప్పదాటు చర్యలు చేపడుతోందని విమర్శలు వ్యాపించాయి. ధర్మాన రాజీనామాను సిఎం, ప్రభుత్వం ఆమోదించిన తరువాత చివరిగా గవర్నర్‌ ఆమోదానికి వెడుతుంది. ముందే గవర్నర్‌ నరసింహన్‌కు పంపించేశామని సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. ఆ విషయంలో తన నిర్ణయం ఏమీ ఉండదని గవర్నర్‌ నరసింహన్‌ స్పష్టం చేశారు. మంత్రి విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుని తనకు పంపిస్తే దాన్ని ఆమోదిస్తానని ఆయన పునరుద్ఘాటించారు. మరి ఆ రాజీనామా వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వద్ద పెండిరగులో పడిరదని గవర్నర్‌ మాటలను బట్టి అర్థమవుతోంది. అంటే గవర్నర్‌ను తెరపై చూపి మంత్రి ధర్మాన రాజీనామాను ఆమోదించకుండా కాలక్షేపం చేద్దామనుకున్న సిఎం ప్లాను తలకిందులైంది. మొత్తం విషయం గవర్నర్‌ ప్రకటనతో వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వం నాటకాలు ఆడి ధర్మానను రక్షించేందుకు కసరత్తులు చేస్తోందని ఎవరూ చెప్పాల్సిన పని లేకుండా ప్రతిపక్షాలూ అర్థం చేసుకున్నాయి. సిఎం కిరణ్‌ తెలివితేటలు కూడా ఒకరకంగా వెలుగులోకి వచ్చినట్లే. సిఎం ఇకనైనా నాటకాలు ఆపి మంత్రి వ్యవహారం తేల్చాలని ప్రతిపక్షాలు డిమాండు చేస్తున్నాయి. ఇంకోవైపు ధర్మాన వ్యవహారం తెలిసిన కాంగ్రెస్‌ అధిష్టానం కూడా ఎలర్ట్‌గా వ్యవహరిస్తోంది.

బాబుకు తలనొప్పిగా మారిన బైర్రెడ్డి?

నిన్నటి దాకా చంద్రబాబే తమ తొలిప్రత్యర్థి అని తెలంగాణా రాష్ట్ర సమితి (టిఆర్‌ఎస్‌) కారాలు, మిరియాలు నూరేది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు తరుపున సినీహీరో, తెలుగుదేశం నాయకుడు నందమూరి బాలకృష్ణ తాము తెలంగాణాకు అనుకూలమని లేఖ ద్వారా తెలియజేస్తామని ప్రకటన చేశారు. బాబు ప్రకటించాల్సిన విషయాన్నే బాలకృష్ణ ప్రకటించాడనుకున్న టిఆర్‌ఎస్‌ ఇక తెలుగుదేశం గురించి ఆలోచించటమే మానేసింది. హమ్మయ్య! అనుకుని బాబు ఆ లేఖ పనిలో పడితే సరిపోతుందనుకున్నారు. అయితే ఈ గొడవ తగ్గితే మరొకటి చేయటానికి నేనున్నాను కదా అన్నటు రాయలసీమ పరిరక్షణ సమితి ఛైర్మను బైర్రెడ్డి రాజశేఖర రెడ్డి కొంచెం ఘాటుగా స్పందించటం ప్రారంభించారు. ఆయన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి కూడా కావటం గమనార్హం. అవసరమైతే తన పదవిని త్యజించైనా రాయలసీమ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకుంటానని బైర్రెడ్డి ప్రకటించారు. అంతటితో ఆగకుండా తెలంగాణా ఇచ్చేందుకు తెలుగుదేశం పార్టీకి ఎటువంటి అభ్యంతరం లేకపోతే రాయలసీమ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చేందుకు అభ్యంతరం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణా కోసం బాబు లేఖరాసేస్తే ఖచ్చితంగా రాయలసీమ ప్రత్యేకరాష్ట్రం గురించి కూడా అందులో రాయాలని బైర్రెడ్డి డిమాండు చేస్తున్నారు. అంతేకాకుండా సీమవాసుల మనోభావాలను అర్థం చేసుకోవాలని టిఆర్‌ఎస్‌ తరహాలోనే బైర్రెడ్డి పెద్ద లెక్చర్‌ ఇస్తున్నారట. ఏదేమైనా భవిష్యత్తులో బైర్రెడ్డిని తమ అధినేత తట్టుకోక తప్పదని తెలుగుదేశం పార్టీ సీమ నేతలు అభిప్రాయపడుతున్నారు.

సబ్‌ ముసల్‌మానోంకో ఈద్‌ ముబారక్‌

రంజాన్‌ నెల ముస్లింలకు అత్యంత ప్రీతి పాతమైన నెల. ఈనెల లోనే ముస్లింలకు మతగ్రంధమైన ఖురాన్‌ ఉద్బవించిందని చెబుతారు. మొదట ఆరునెలలు ఈ ఉపవాసదీక్షను ముస్లింలందరూ అమలుచేయవలసి ఉండేది. అయితే దైవ ప్రవక్త మహ్మద్‌ ఈ ఆరునెలలను ఒక నెలగా తగ్గించాల్సిందిగా అల్లాప్‌ాని ప్రార్దించారు.అప్పటినుండి ఒక నెలకు కుదించబడిరదని ముస్లింలు నమ్ముతారు. రంజాన్‌ నెలను సహోదరప్రేమ, ప్రార్దన, తోటివారిని ప్రేమించేందుకు గుర్తుగా భావిస్తారు. పేద గొప్ప తారతమ్యం లేకుండా మానవులంతా సమానులే అని చాటిచెపటానికే ఈ మాసం ఆవిర్బవించిందని చెబుతారు.శాంతి, సహజీవనంను పాటించడానికే రంజాన్‌ మాసం ఉపయోగపడుతుందని ముస్లింల నమ్మకం. ఉపవాసలద్వారా, ప్రార్ధన చేస్తూ, సహోదర ప్రేమకలిగి పేద,గొప్ప తేడాలేకుండా కలసి జీవిచడం వల్ల శత్రుభావం కొరవడుతుందని నమ్ముతారు. ప్రేమ ఆప్యాయతలు లోపించటం,ఎవరి స్వార్ధం వారే చూచుకుంటూ గొప్పవాళ్లు మరింత గొప్పవాళ్లుగా పేదలు మరింత పేదరికానికి దిగజారిపోవడం అల్లాప్‌ాకు ఇష్టం లేదని రంజాన్‌ నెల చాటి చెబుతుంది. కక్ష్యలు కార్పణ్యాలతో అల్లర్లు సృష్టించడం ముస్లిం తత్వానికి వ్యతిరేకం. ఉపవాసం వల్ల పేదవారి ఆకలి బాధలు తెలుసుకుంటానికి, ఇఫ్తార్‌ పేదలతో కలసి భుజించడానికి మాత్రమే  ఏర్పాటు చేయబడిరది. అలాగే దేవుడు మానవులకిచ్చిన ప్రతి చిన్న ఆశీర్వాదానికి కృతజ్ఞతలు తెలుపటం ముస్లిం జీవితంలో చాలా ముఖ్యం. ప్రతిరోజూ సాయంత్రం మస్‌జిద్‌లో ప్రార్దనలు జరిపిన తర్వాత దేవుని సమక్షంలో పేద ముస్లింలతో తినటం ఆశీర్వాదంగా భావిస్తారు. అదే సమయంలో అబద్దాలు చెప్పటం, బూతులు మాట్లాడటం, చెడ్డదృష్యాలు చూడటం, చెడ్డతలంపులను కలిగివుండటం, పుకార్లను వ్యాపింప చేయటం పాపంగా భావిస్తారు.   ఈ పవిత్రమాసం లో ముస్లింలు మక్కా మస్‌జిద్‌ను దర్శించడాని ఇష్టపడతారు. మక్కా సౌదీ అరేబియాలో ఉంది. ఇది ప్రపంచంలోని ముస్లింలకందరికి పవిత్ర ప్రదేశంమైన కాబాలో ఉంటుంది. దీని వైశాల్యం 3,841,000 చతురపు అడుగులు. దీని లోపల బయట కలిపి 820,000 ముస్లింలు ప్రార్ధించే వీలుంటుంది. ఈ ప్రార్దనలనే హాజ్‌ అంటారు. ఈ పవిత్ర దినాల్లో సుమారు 2 కోట్ల మంది ముస్లింలు ప్రపంచం నలుమూలలనుండి దీన్ని దర్శించి ప్రార్దిస్దారు. వెళ్లలేని  ప్రతి ముస్లిం దీని దిక్కుగా నిలుచుని ప్రార్ధనలు జరుపుతారు. ముస్లింల పవిత్ర గ్రంధమైన ఖుఱ్‌ఆన్‌ లేఖనముల ప్రకారం దేవుని అత్యంత ఇష్టుడైన  ఇబ్రహీం దీన్ని నిర్మించారని తెలుస్తుంది. ఈ రంజాన్‌ పండుగ ప్రార్ధనలద్వారా దేశం శాంతి, సౌభాగ్య, సౌభ్రాతృత్యాలను పండిరచగలదని ఆశిద్దాం...           

అదిగో కుంభకోణం, చేయండి రాజీనామా!

బొగ్గు కుంభకోణంలో దేశ ఖజానాకు రూ.1.86 కోట్ల నష్టానికి బాధ్యత వహించి ప్రధాని రాజీనామా చేయాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్‌చేస్తున్నాయి. ప్రధాని సీరియస్‌గా ఆత్మావలోకనం చేసుకోవాలి. పోటీ బిడ్డింగ్‌పై విధాన నిర్ణయం తీసుకోవడానికి ఉద్దేశపూర్వకంగా ఎనిమిదేళ్లు జాప్యం చేశారని, ఆ ఎనిమిదేళ్ళలో ఐదేళ్ళు బొగ్గు శాఖ ప్రధాని వద్దే ఉందని అందుచేత నైతిక బాధ్యత వహించి ప్రధాని రాజీనామాచేయాలని ప్రతిపక్షం ఆరోపించింది. అంతేకాక ఎనిమిదేళ్ళ జాప్యానికి ప్రధానమంత్రి కార్యాలయమే కారణమని అన్నాయి    అంతేకాక దీనిపై ఉభయసభల్లోను ప్రభుత్వాన్ని నిలదీస్తామని కూడా అన్నాయి. ప్రభుత్వపరంగా అవినీతో, కుంభకోణమో బయటపడటం ఆలస్యం ‘అదిగో అదిగో అవినీతి..కుంభకోణం... నైతిక బాధ్యత ఏది?.. చేయండి రాజీనామా..!’ ప్రతి ప్రతిపక్షం నుండి కొంచెం అటుఇటుగా అవేమాటలు...!  అధికారంలోనివారికి ఈ ఛీత్కార సత్కారాలు వినీవినీ అలవాటైపోయిందేమో...‘మేం తామరాకుపై నీటిబొట్టు లాంటివాళ్ళం’ అంటూ కప్పదాటు వ్యవహారాలతో కాలం గడిపేస్తున్నారు. ఏదిఏమైనా ప్రభుత్వంలో బయటపడ్డ ప్రతి కుంభకోణానికి ప్రధాని రాజీనామా చేస్తుంటే ఏడాదికో ప్రధాని మారుండేవారంటూ విశ్లేషకులు సన్నాయినొక్కులు నొక్కుతున్నారు. అయినా అసలు అధికారమంతా అమ్మ చేతిలో ఉంటే పాపం ప్రధాని ఏం చేస్తారు అన్నది ప్రజల సానుభూతి. అయితే ` జరుగుతున్న తంతుకు బాధ్యత ఎవరు వహించాలన్నది పెద్ద భేతాళప్రశ్నే!

ప్రభుత్వానికి కోర్టు మొట్టికాయలు

ఫీజుల ఖరారుపై రాష్ట్రప్రభుత్వానికి సంబంధం ఏమిటని హైకోర్టు ప్రశ్నించింది. ఫీజుల ఖరారు వ్యవహారంలో ప్రభుత్వానికి సంబంధమేమిటని, దీనిపై ఎందుకు జోక్యం చేసుకుంటున్నారన్న హైకోర్టు సూటి ప్రశ్నకు అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ సమాధానం చెప్పలేకపోయారు. దీనిపై న్యాయమూర్తి ‘మౌనంగా ఉన్నంత మాత్రాన సరిపోదు.ఫీజుల విషయంలో ఎవరేం చేస్తున్నారో... ఏం జరుగుతుందో ప్రజలంతా చూస్తున్నారు. అన్ని విషయాలు వారికి తెలుసు’ అని వ్యాఖ్యానించారు.   అంతేకాదు బయటిశక్తుల ప్రభావానికి లోనుకాకుండా  ఫీజులను ఖరారు చేయాలని ఏఎఫ్‌ఆర్‌సిని ఆదేశించారు. నిబంధనలను పూర్తిస్థాయిలో పరిగణనలోకి తీసుకుని ఫీజులను ఖరారు చేయాలని, కాలేజీలు సమర్పించిన ఫీజుల ప్రతిపాదనలపై నిపుణుల బృందం ఇచ్చే నివేదిక ఆధారంగానే ఫీజులు ఖరారుచేయాలని, అలాగే ఫీజుల ఖరారులో ఏకపక్షంగా వ్యవహరించరాదని కూడా  ఏఎఫ్‌ఆర్‌సికి సూచించింది. ఈ మధ్యకాలంలో ప్రభుత్వం తీసుకునే ప్రతినిర్ణయం  కోర్టు గుమ్మం ఎక్కి  అక్కడి నుండి సంబంధిత శాఖలకు అక్షింతలో, మొట్టికాయలో పడనిదే ఆయా నిర్ణయాలు మంచిగా ప్రజలకు చేరేట్లులేవు. ‘అమ్మ పెట్టే నాలుగు పెట్టందే పని జరగదని..’ మన పెద్దలు అంటుంటారు.  స్వంతలాభం కొంత చూసుకుంటు సాగే ప్రస్తుత ప్రభుత్వ పాలనలో  ప్రభుత్వం ఏదైనా అమలుచేయాలంటే కేసులు, వాయిదాలు వంటివి రాకుండా ముందుగా  న్యాయనిపుణులను సంప్రదించి ఖచ్చితనిర్ణయం తీసుకుంటే మంచిదేమో!  అయినా అంతముందుచూపు ఉంటే అసలు తప్పులెందుకు జరుగుతాయి? అంటున్నారు ప్రజలు.

కాపాడే దిక్కెవరు?

ప్రజారోగ్యమే తమ లక్ష్యంగా చెప్పుకునే ప్రభుత్వ ఏలుబడిలో రోజురోజుకీ శిశుమరణాలు ఎక్కువైపోతున్నాయి. హైదరాబాద్‌లోని ఓ ప్రభుత్వ పిల్లల ఆసుపత్రిలో రోజుకు సగటున 7 నుండి 10 మంది చిన్నారులు మృత్యువాత పడుతున్నారనీ అందుతున్న సమాచారం స్పష్టంచేస్తోంది. శుక్రవారం ఒక్కరోజే 16 మంది శిశువులు మృతి చెందారు. దీనికి కారణం ఇందులో వైద్యులు, నర్సులు, ఇతర సేవల కొరతే ప్రధాన కారణమన్న విమర్శలున్నాయి. అలాగే రాష్ట్రంలో పలు ఆసుపత్రుల్లో ఇతర కారణాల వల్ల కూడా పిల్లలు మృతి చెందారు. ఇంత జరుగుతున్నా సమస్యను పక్కదారి పట్టించే వ్యాఖ్యాలతో కాలం గడిపేస్తున్నారు మన నాయకులు. కొన్ని చోట్ల సరైన చికిత్స అందక, మరికొన్ని చోట్ల ఇతర వ్యాధులుసోకడం వల్ల పిల్లలు మరణిస్తుంటే స్పందనలేని పాలకులు, సంబంధిత అధికారులపై న్యాయవ్యవస్థే మానవతాదృక్పథంతో విచారణ చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

అస్సాంలో ఏం జరుగుతోంది?

అస్సాంలో స్థానిక బోడో గిరిజనులకు, ముస్లిం మైనారిటీ వలసవాదులకు మధ్య జరుగుతున్న ఘర్షణలకు దేశంలో పలు రాష్ట్రాల్లో వున్న అస్సాం వాసులు భయంమాటున జీవనం సాగిస్తున్నారు. పలుచోట్ల తామున్న ప్రాంతాలను వదిలి తమ స్వస్థలాలకు చేరుకుంటున్నారు. అయితే ప్రభుత్వం అసలు ఘర్షణలకు మూలకారణాలను వెదికి పరిష్కారం కనుగొనకుండా మొండిగా వ్యవహరించడం వల్లే నేటి హింసలకు కారణమవుతోందని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ హింసకు మూల కారణంగా భావిస్తున్న అక్రమ వలసలతో జనాభాపరంగా సమతుల్యత లోపించిన అస్సాంలో పరిస్థితిని చక్కదిద్దేందుకు పార్లమెంటు కూడా తనవంతు పాత్ర పోషించవలసి ఉంది.   రాష్ట్రాలు సుభిక్షంగా, ప్రశాంతంగా ఉంటేనే దేశం ప్రశాంతంగా ఉంటుంది.  ఏ రాష్ట్రమైనా ప్రశాంతంగా ఉండేలా చూడవలసిన బాధ్యత అయా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రంపై ఉంది.  శాంతిభద్రతలు వంటి విషయాలపై ప్రత్యేక శ్రద్ధ చూపించనప్పుడు ఇటువంటి సంఘటనలు ఆ రాష్ట్రాన్నే కాక ఇతర రాష్ట్రాలను సైతం అలజడికి గురిచేస్తాయి. ఇప్పటికైనా ప్రభుత్వాలు సత్వరమే దీనికి చక్కని పరిష్కారం కనుగొనవలసి ఉంది.

గ్యాస్‌ రాయల్టీ రాబట్టవలసిందే

కేంద్రం నుండి రాష్ట్ర అవసరాలకు గ్యాస్‌ సాధించలేనప్పటికీ కనీసం మన కేజీ బేసిన్‌ గ్యాస్‌ పై రాయల్టీ అయినా దక్కించు కోవాలని విద్యుత్‌ అధికారులు, న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. గ్యాస్‌ ఇతర సహజవనరులపై రాయల్టీ కోరటానికి మనకు అధికారం ఉందని వారు తెలియ చేస్తున్నారు. అంతేకాకుండా మన పొరుగు రాష్ట్రామయిన తమిళనాడు కాని మహారాష్ట్ర , పశ్చిమ బెంగాల్‌ వంటి రాష్ట్రాలయితే  ఇప్పటికే రాయల్టీ ముక్కు పిండి వసూలు చేసేవారని చెబుతున్నారు. గ్యాస్‌ ఇతర సహజవాయువులు కేంద్రం జాబితాలో ఉన్నప్పటికీ మన అవసరాలకు సరిపడా గ్యాసు ఆయా సంస్దలు కెటాయించటంతో పాటు రాయల్టీ కూడా కట్టాల్సి ఉందని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, కేంద్ర మంత్రి జైపాల్‌ రెడ్డి, పూర్తి భాద్యత వహించాలని నిపుణులు భావిస్తున్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రయోజనాలకోసం పార్టీల కతీతంగా పోరాటం చేయవల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఉత్తర ప్రదేశ్‌ తన భూభాగం నుండి గ్యాసు పైపు లైన్లు డిల్లీకి, ఇతర రాష్ట్రాలకు వెళుతున్నాయని  తమకు పన్ను చెల్లించాలని ఇప్పటికే కోర్టులో కేసులు వేసిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. గ్యాస్‌ నిక్షేపాలు, తవ్వకాలతో సంబందంలేని రాష్ట్రాలే వ్యాట్‌ ఇతర పన్నులతో ఆదాయాన్ని పెంచుకుంటుంటే  మనరాష్ట్రం మాత్రం గ్యాస్‌ నిక్షేపాలగని ఉన్నా పైసా దక్కించుకోపోవడం పై ఆర్దిక నిపుణులు పెదవివిరుస్తున్నారు.

అస్సాం అల్లర్లు: వెలవెలబోతున్న సెక్యూరిటీ ఏజెన్సీలు

అస్సాం అల్లర్లల నేపధ్యంలో భారతదేశంలోని అన్ని ప్రధాన పట్టణాలనుండి ఈశాన్య రాష్ట్రాల ప్రజలు ఇంటిదారి పడుతున్నారు. ఈ నేపధ్యంలో రోజూ వేలమంది కాలేజీలను, ఉద్యోగాలను వదిలి స్వంత రాష్ట్రానికి ప్రయాణం చేస్తున్నారు. ఈ శాన్యరాష్ట్రాలకు చెందినవారు ఎక్కువగా ప్రయివేట్‌ సెక్యూరిటీ ఏజెన్సీలలో పనిచేస్తారు. అల్లర్ల నేపధ్యంలో రోజుకు 5000 మంది హైదరాబాద్‌ను విడచి వెళ్లటం వల్ల ప్రవేటు సెక్యూరిటీ సంస్ధలకు చిక్కొంచ్చింది. ఈ సంస్ధల నుంచి సెక్యూరిటీ గార్డులుగా స్కూళ్లు, కాలేజీలకు, అఫీసులు మరీ ముఖ్యంగా సాఫ్ట్‌వేర్‌ సంస్ధలలోనూ పనిచేస్తుంటారు.    సెక్యూరిటీ సంస్ధలలో ఈ శాన్య రాష్ట్రాలకు చెందిన వారు 70 శాతం ఉంటారు. వీరంతా మూకుమ్మడిగా ఇంటిదారి పట్టడంతో అనేక సంస్థలకు సెక్యూరిటీ సమస్య తలెత్తింది.దీంతో రైల్యే పోలీసులు రైల్యేపోలీసులు వారికి కౌన్సిలింగ్‌ ఇస్తున్నారు. వారిలో ధైర్యం తామున్నామని సహోదరత్వాన్ని చాటుతూ వెళ్లిన వారిని కూడా తిరిగి రప్పించేందుకు కృషి చేస్తున్నారు. అంతవరకు మాదాపూర్‌, మియాపూర్‌ స్టాఫ్‌ వేర్‌ సంస్ధల దగ్గర పోలీస్‌ పెట్రోలింగ్‌ పెంచడానికి పోలీస్‌ శాఖ తమ సంసిద్దతను తెలియచేసింది.ఈ సంఘటనతో అసలే నిత్యం వత్తిడితో వుండే పోలీసులపై మరింత వత్తిడి పడిరదని పోలీసులు భావిస్తున్నారు. వీలయినంత త్వరలో ఈశాన్య రాష్ట్రాల ఉద్యోగులు వెనుతిరిగాలని ప్రజలు కోరుకుంటున్నారు.  

విశాఖలో ఐఎస్‌ల మద్యవార్‌

విశాఖపట్టణంలో ఇద్దరి ఐఎఎస్‌ అధికారుల అధికారుల మద్యపచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది.ఉన్నత స్ధాయి అధికారులమని మరచి పోయి ప్రతి చిన్న విషయానికి రచ్చకెక్కటం ప్రజలను అయోమయానికి గురి చేస్తుంది. ఒకరు విశాఖ కలెక్టర్‌ లవ్‌ అగర్వాల్‌కాగా మరొకరు మహావిశాఖ నగర పాలక సంస్థ కమీషనర్‌ రామాంజనేయులు. ఆరు నెలల క్రితం జివిఎంసీపాలక వర్గం పదవీకాలం ముగిసి పోవడంతో దానికి ప్రత్యేక అధికారిగా బాధ్యతలు చేపట్టాలని రామాంజనేయులు ప్రయత్నించారు.   అయితే లవ్‌ అగర్వాల్‌ పోటీపడి ఆ పదవిని దక్కించుకున్నారు. అప్పటినుండి ఇద్దరికి మద్య విభేదాలు ముదిరాయి. ప్రత్యేక అధికారిగా జీవియం ఫైళ్లను తొక్కి పెడుతున్నారనేది కమీషనర్‌ వాదన. ఇటీవల కాలంలో బదిలీలలో వీరిద్దరి పేర్లు ఉండగా విశాఖ అభివృద్దికి ఇద్దరం కలసికట్టుగా పని చేస్తామని మంత్రి గంటా శ్రీనివాస్‌కు చెప్పి బదిలీ లేకుండా చేసుకున్నారు. అయినా యధాప్రకారం దులాడుకుంటున్నారు. మంత్రి తనకంటే కలెక్టర్‌కే అధిక ప్రాధాన్యత నిస్తున్నారని కమీషనర్‌ మరో మంత్రి బాలరాజు చెంత చేరారు.తాజాగా స్వాతంత్య్రదినోత్సవ నాడు వారి విభేదాలు తారా స్ధాయికందుకున్నాయి. ఆరోజు జిల్లా కలెక్టరు ఆఫీసులో జెండా ఎగురవేసి జివిఎంసీలో కూడా ఎగురవేద్దామని లవ్‌ అగర్వాల్‌ అక్కడకు చేరుకోగా అక్కడ తలుపులు వేసిఉండటంతో అవాక్కయ్యారు. దీంతో సంబంధిత ఏఈ పై నిప్పులు చెరిగి, బ్లడీ ఆర్గనైజింగ్‌ అంటూ ఉద్యోగులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవియంసీ లో తనను కావాలనే అవమాన పరిచారని చీఫ్‌ సెక్రటరీకి ఫిర్యాదు చేశారు. అయితే కమీషనర్‌ వాదన మరోలా ఉంది. తన కంటే జూనియర్‌ అధికారులు వారి కార్యాలయాల్లో జెండాలు ఆవిష్కరిస్తే కలెక్టర్‌ కావాలనే ఇదంతా చేశారని మంత్రి బాలరాజుకు వివరించి ఆయన సాయంతోడిప్యూటీ సీఎం రాజనరసింహను కలసి తన వాదనను వినిపించారు. ఈవిషయంలో ఎవరూ తగ్గక పోగా తాడో పేడో తేల్చుకుంటామని బుసలు కొడుతున్నారు. అయితే వీరిద్దరి మద్య జిల్లాపరువు పోతుందని నగరవాసులు వాపోతున్నారు. వీరి పంతాలు పట్టింపులకే సమయం సరిపోతుందని, ప్రజలసమస్యలను గాలికి ఒదిలేశారని స్దానికులు, ప్రతిపక్షాలు ఆరోపిస్తూ వీరిరువరినీ బదిలీ చేయాలని కోరుతున్నారు.