అ‘ధర్మాని’కి కొమ్ముకాస్తున్న కిరణ్!
posted on Aug 20, 2012 @ 11:41AM
తుమ్మితే ఊడిపోయే ముక్కులా మన రాష్ట్రానికి మూడోకృష్ణుడుగా వచ్చిన ముఖ్యమంత్రి కిరణ్ ప్రభుత్వం అధర్మానికి కొమ్ము కాస్తోందంటూ ప్రతిపక్షాలన్నీ ముక్తకంఠంతో విమర్శిస్తున్నాయి! అప్పటి వై.ఎస్ ప్రభుత్వానికి కొనసాగింపుగా రోశయ్య, అనంతరం కిరణ్ మంత్రి వర్గాల్లో అత్యధిక మంత్రులు వై.ఎస్. అనుచరగణమే! సోనియమ్మతో జగడానికి దిగిన పాపానికి జగన్ ఆస్తుల కేసు విచారణకు రావడంతో ఒక్కొక్కటిగా అసలు నిజాలు వెలుగు చూస్తున్నాయి. పుత్రప్రేమతో ప్రజల సొమ్మును ఇష్టం వచ్చినట్లుగా ధారదత్తం చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తడం, విచారణలో ఆ ఆరోపణలు నిజాలేనని తేలుతుండటంతో సిబిఐ వరుసగా నాలుగు ఛార్జిషీట్లు దాఖలు చేసింది.
దొడ్డిదారిన సొమ్ము చేసుకున్న జగన్‌తో బాటు, బడాబడా పారిశ్రామిక వేత్తలు, ఐఎఎస్ అధికారులు మంత్రులు కూడా ఈ పాపంలో పాలు పంచుకున్నారని సిబిఐ తన ఛార్జిషీట్లలో పేర్కొంది. ప్రాథమిక సాక్ష్యాధారాలు లభించిన అనేక మంది చంచల్‌గూడా జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. అప్పటి వైఎస్ సర్కారులో మంత్రులుగా పనిచేసి, ఇప్పటి కిరణ్ సర్కారులోనూ మంత్రులుగా కొనసాగుతున్న వారిలో ఆరుగురు మంత్రులపై అభియోగాలు వచ్చాయి. అందులో మోపిదేవి ఇప్పటికే జైలుకెళ్ళారు. ఇప్పు డుధర్మాన వంతువచ్చింది. ఛార్జిషీటులో ఎ5 ముద్దాయిగా పేర్కొనడంతో ఆయన తానెంత ధర్మాత్ముడో నిరూపించుకోడానికన్నట్లుగా వెంటనే రాజీనామా చేసేశారు. తలపట్టుకోవడం కిరణ్‌వంతయ్యింది. మంత్రుల్ని రక్షించుకోడానికి ఎత్తులు పైఎత్తులు వేస్తూ కిరణ్ కాలం గడిపేస్తున్న తీరును చూస్తుంటే`ఈ పాపంలో కిరణ్‌కు కూడా భాగం ఉందేమోనన్న అనుమానాలను దేశం వర్గాలు, వామపక్షాలు, ఇతర ప్రజాసంఘాలు వ్యక్తం చేస్తున్నాయి. అభియోగాలు ఉన్న మంత్రులనూ, అధికారులనూ తక్షణమే సిబిఐ అదుపులోకి తీసుకుని విచారణ చేపడితే` అవినీతి అసలు మూలాలు వెలుగులోకి వస్తాయని ప్రజలు అభిప్రాయ పడుతున్నారు. ధర్మాన రాజీనామా లేఖను గవర్నరుకు పంపకుండా తాత్సారం చెయ్యడం తప్పును కప్పిపుచ్చే చర్యగా భావిస్తూ గవర్నర్ తనదైన చర్యలు తీసుకుంటే మంచిదన్న అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి!